మహేశ్ విట్టా హీరోగా చేసిన సినిమానే 'ఉత్తుత్త హీరోలు'. కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, మహేశ్ విట్టా కూడా ఒక నిర్మాతగా వ్యవహరించాడు. హర్ష కొడాలి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 22వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ కామెడీ జోనర్లో నిర్మితమైన సినిమా ఇది.
చందూ (మహేశ్ విట్టా) అతని స్నేహితులకు సినిమా పట్ల ఆసక్తి ఎక్కువ. ఎలాగైనా సినిమాలలో కనిపించాలనే ఒక పట్టుదలతో ఉంటారు. అందుకోసం ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు. చందూ .. అతని ఫ్రెండ్స్ ఉత్సాహం, ఒక సినిమాలో వారికి ఛాన్స్ వచ్చేలా చేస్తుంది. అయితే ఆ సినిమా అనుకోకుండా ఆగిపోతుంది. దాంతో వాళ్లకి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. సినిమా మధ్యలో ఆగిపోవడం వలన ఊళ్లో వాళ్లంతా 'ఉత్తుత్త హీరోలు' అంటూ ఆటపట్టిస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలో చందూ .. అతని ఫ్రెండ్స్ ఆలోచనలో పడతారు. తామే ఒక సినిమా చేయాలనీ, ఆ సినిమాను హిట్ చేసి, తమను గురించి ఊళ్లో వాళ్లంతా గొప్పగా మాట్లాడుకునేలా చేయాలని బలంగా నిర్ణయించుకుంటారు. తమ కలను నిజం చేసుకోవడానికి 'ప్రొద్దుటూరు' బయల్దేరుతారు. అక్కడ ఫైనాన్సియర్ గా 'రామిరెడ్డి'కి పేరు ఉంటుంది. అతని చెల్లెళ్లను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేయాలని భావిస్తారు.
చందూ.. అతని మిత్రబృందం కలిసి 'ప్రొద్దుటూరు' వెళతారు. ఆయన ఇద్దరు చెల్లెళ్లు ఎవరు? వాళ్లు ఏం చేస్తూ ఉంటారు? తరచూ ఎక్కడికి వెళుతూ ఉంటారనేది తెలుసుకుంటూ 'రెక్కీ' నిర్వహిస్తారు. రామిరెడ్డి సామాన్యుడు కాదనీ, తమ ప్లాన్ తేడా కొడితే చావు తప్పదని తెలిసినప్పటికీ, ఆయన చెలెళ్లను కొడ్నాప్ చేస్తారు. వాళ్లు చేసిన ఆ కిడ్నాప్ వాళ్లను ఎలాంటి చిక్కుల్లో పడేస్తుంది? అనేది కథ.
ఈ మధ్య కాలంలో విలేజ్ లో ఉన్న కుర్రాళ్లు తమ టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు. అలా వెండితెరపైకి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అలా కొంతమంది విలేజ్ కుర్రాళ్లు కలిసి, ఒక సినిమా చేయాలనుకుంటారు. ఆ సినిమా ఆగిపోయినా, తమ ఆశ .. ఆశయం ఆగిపోకూడని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఏ మార్గాన్ని ఎంచుకున్నారనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది.
సాధారణంగా సినిమాలు చేయాలనుకున్నప్పుడు .. తీయాలనుకున్నప్పుడు ఎవరైనా హైదరాబాద్ దారిపడుతూ ఉంటారు. అయితే ఈ సినిమాలోని మిత్ర బృందం 'ప్రొద్దుటూరు' వెళుతుంది. అందుకు కారణం ఏమిటనే ఒక సందేహం ఆడియన్స్ ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ సందేహానికి సమాధానంగా ఆ తరువాత ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా పడుతుంది.
ఈ కథలో ప్రధానమైన ఉద్దేశం సినిమా చేయడమైతే, ఆ ఆశయంతో ముడిపడిన కిడ్నాప్ డ్రామా ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. కిడ్నాప్ ను ఎలా ప్లాన్ చేస్తారు? ఎలా బయటపడతారు? అనేది ఉత్కంఠను రేకెత్తించేదిగా ఉండాలి. కానీ అందుకు సంబంధించిన సన్నివేశాలు చప్పగా సాగుతాయి. ఈ ట్రాక్ మొత్తం కూడా కామెడీపై ఆధారపడి నడిపించారు కానీ, కామెడీ వర్కౌట్ చేయలేకపోయారు. దాంతో సిల్లీ సన్నివేశాలతో ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది.
నటీనటుల నటన గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. హర్ష కోడలి ఫొటోగ్రఫీ .. జాన్ కె జోసెఫ్ సంగీతం .. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఫరవాలేదు. కథాకథనాలు .. సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు .. ఆవిష్కరించిన విధానం మాత్రం బలహీనంగా అనిపిస్తాయి. కంటెంట్ విషయంలో .. అవుట్ పుట్ విషయంలో మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండేది.
'ఉత్తుత్త హీరోలు' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
Utthuttha Herolu Review
Movie Details
Movie Name: Utthuttha Herolu
Release Date: 2026-05-22
Cast: Mahesh Vitta, Thanu, Hara Srinivas, Vinay, Preveena Sony, Ganga
Director: Harsha Kodali
Music: John K Joseph
Banner: MVM Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer