రణదీప్ హుడా కథానాయకుడిగా 2023లో 'ఇన్ స్పెక్టర్ అవినాష్' సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1997లో ఉత్తరప్రదేశ్ కి చెందిన సూపర్ కాప్ అవినాశ్ మిశ్రా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో రూపొందించిన సిరీస్ ఇది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ కి సీక్వెల్ గా 'ఇన్ స్పెక్టర్ అవినాష్ 2'ను రూపొందించారు. నీరజ్ పాఠక్ దర్శకత్వం వహించిన సీజన్ 2ను 10 ఎపిసోడ్స్ తో వదిలారు. ఈ నెల 15వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో  హిందీతో పాటు 7 భాషల్లో ప్రేక్షకులను పలకరిస్తోంది.

ఉత్తరప్రదేశ్ లో మాఫియా అంతకంతకూ విస్తరిస్తూ వెళుతుంటుంది. ఒక వైపున స్వార్థరాజకీయాలు .. మరో వైపున అవినీతి .. ఇంకొక వైపున మాదకద్రవ్యాలు .. హత్యలు.. కిడ్నాప్ లతో అల్లకల్లోలంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను వెంటనే అదుపులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి బ్రహ్మానంద్ అగ్నిహోత్రి, హోమ్ మినిస్టర్ వీర్ భూషణ్ ఠాకూర్ తో కలిసి ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. 

ముఖ్యమంత్రి సూచన మేరకు ఇన్ స్పెక్టర్ అవినాశ్ అధ్వర్యంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తాడు వీర్ భూషణ్. ఇన్ స్పెక్టర్ అవినాశ్ తన టీమ్ తో కలిసి రంగంలోకి దిగుతాడు. అతను ధైర్యసాహసాల గురించి తెలిసిన రౌడీ గ్యాంగులు తమంతట తాముగా లొంగిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలోనే విచారణ సమయంలో భాటియా అనే క్రిమినల్ చనిపోతాడు. అతనిపై విషప్రయోగం జరిగిందని తెలిసి అవినాశ్ ఆశ్చర్యపోతాడు.

ఈ కేసును అనేక కోణాలలో పరిశీలించిన అవినాశ్, తన టీమ్ తో కలిసి దేవికాంత్ త్రివేది స్థావరానికి వెళతాడు. హిజ్రాగా ఉన్న అతని పట్ల అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, భాటియా గురించి ప్రశ్నిస్తాడు. దాంతో కంగారుపడిపోయిన త్రివేది, ఆ తరువాత 'షేక్' ఇంటికి వెళ్లి అతణ్ణి కలుస్తాడు. అవినాశ్ తనని వెతుక్కుంటూ వచ్చినట్టుగా చెబుతాడు.షేక్ ఎవరు? అతనితో త్రివేదికి గల సంబంధం ఏమిటి? పెద్ద తలకాయలను టచ్ చేయడం వలన, అవినాశ్ ఎలాంటి చిక్కుల్లో పడతాడు? అనేది కథ.

1990లలో ఉత్తర ప్రదేశ్ లోని పోలీస్ శాఖలో పనిచేసిన అవినాశ్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ జీవితాన్ని ప్రధానంగా తీసుకుని రూపొందించిన సిరీస్ ఇది. పై అధికారుల నుంచి .. రాజకీయనాయకుల నుంచి .. లోకల్ గూండాల నుంచి .. మాఫియా నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ గా ఆయన ఎలాంటి ఒత్తిళ్లను ..  సవాళ్లను ఎదుర్కుంటూ వెళ్లారనే సంఘటనల చుట్టూ అల్లుకున్న కథ ఇది.

అవినాశ్ కి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు ఉంది. ఆయన ఎన్నో ఎంకౌంటర్లు చేశాడు. అయితే ఎలాంటి నేరస్థులను .. ఎలాంటి సందర్భాలలో ఆయన ఎన్ కౌంటర్ చేయవలసి వచ్చిందనేది అక్కడక్కడా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. మాఫియా కబంధ హస్తాలలో నుంచి  ఉత్తర ప్రదేశ్ ను కాపాడటానికి ఆయన తన ప్రాణాలకు తెగించి చేసే పోరాటమే ప్రధానమైన కథాంశమని చెప్పుకోవచ్చు.

1990లలో ఆ ప్రాంతంలో ఎలాంటి నేరాలు జరిగాయి? ఆ నేరస్థులను అవినాశ్ ఎలా పట్టుకున్నాడు? ఎలా శిక్షించాడు? అనేది చూపించారు. హత్యలు .. అత్యాచారాలు చేస్తూ వెళ్లినవారిని ఆయన ఎలా వెంటాడాడు? అనేది ప్రతి ఎపిసోడ్ లోను టచ్ చేశారు. అయితే ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన సన్నివేశాలు .. ఎటాక్ చేసే దృశ్యాలు ఇవేవీ కిక్ ను ఇచ్చే స్థాయిలో ఆవిష్కరించలేకపోయారు. 

ఇక నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో పోలీసుల జీవితాలు ఎలా ఉంటాయి? వృత్తి పరంగా .. కుటుంబం పరంగా వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయవలసి ఉంటుందనేది చూపించిన విధానం వాస్తవానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఈ ట్రాక్ లోనే లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేశారు. ఇక జోనర్ కి తగిన యాక్షన్ పార్ట్ ఉండనే ఉంది. 

10 ఎపిసోడ్స్ లో కొత్తగా డిజైన్ చేసిన ఎపిసోడ్ అంటూ ఏదీ కనిపించదు. ఒక సమస్య తరువాత ఒక సమస్య వచ్చి అవినాశ్ ముందు పడుతూ ఉంటాయి .. ఆయన వాటిని తనదైన స్టైల్లో సాల్వ్ చేస్తూ వెళ్లిపోతుంటాడు. అయితే అందుకు సంబంధించిన చిత్రీకరణ సాధారణంగా అనిపించడమే లోపంగా కనిపిస్తుంది.  ఉత్కంఠను రేకెత్తించే పోలీస్ వ్యూహాలు .. దాడులు పెద్దగా కనిపించవు. యాక్షన్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి. కానీ వాటిని గొప్పగా డిజైన్ చేయలేదు. మొత్తంగా చూసుకుంటే ఒకటి రెండు కేసులను డీల్ చేసిన విధానం ఫరవాలేదు అనిపిస్తుందంతే.

ఇక ఈ సిరీస్ లో అభ్యంతరకరమైన సన్నివేశాలు తగులుతాయి. అంతకంటే ఎక్కువగా రక్తపాతంతో కూడిన దృశ్యాలు టెన్షన్ పెడతాయి. ఇటు హీరో .. అటు విలన్ గ్యాంగ్ వైపు నుంచి కూడా హింస అనేది కంగారు పెడుతుంది. ఆర్టిస్టులందరి నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ ..నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. మొత్తంగా చూసుకుంటే, ఇది రొటీన్ క్రైమ్ యాక్షన్ డ్రామా అనే చెప్పుకోవలసి ఉంటుంది.