'గ్లోరీ' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన వెబ్ సిరీస్ గా 'గ్లోరీ' కనిపిస్తుంది. కనిష్క్ వర్మ - కరణ్ అన్శుమాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో దివ్యేందు శర్మ - పుల్కిత్ సామ్రాట్ ప్రధానమైన పాత్రలను పోషించారు. 7 ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకూ ఉంది. ఈ నెల 1వ తేదీ నుంచి హిందీతో పాటు ఇతర భాషల్లోను స్ట్రీమింగ్ అవుతోంది.

రఘువీర్ సింగ్ ( సువిందర్ విక్కీ) 'శక్తి గఢ్'లో హర్యానా బాక్సింగ్ క్లబ్ ను నిర్వహిస్తూ ఉంటాడు. అదే సిటీలో విజూ సాంగ్వాన్ (అశుతోష్ రాణా) శక్తి బాక్సింగ్ అకాడమీని నడుపుతుంటాడు. ఈ రెండు ట్రైనింగ్ సెంటర్ల మధ్య గట్టిపోటీ నడుస్తుంటుంది. ఒలింపిక్స్ లో పాల్గొనడం కోసం తన శిక్షణా కేంద్రం నుంచి నిహాల్ ను తయారు చేస్తుంటాడు రఘువీర్ సింగ్. అతని కూతురు 'గుడియా', నిహాల్ ను ప్రేమిస్తూ ఉంటుంది. నిహాల్ కారణంగా ఆమె గర్భవతి అవుతుంది. ఊరు వదిలి పారిపోవాలని అనుకున్న ఆ జంటపై కొంతమంది ఆగంతకులు దాడి చేస్తారు.

ఆ దాడిలో నిహాల్ చనిపోగా, గుడియా చావుబతుకుల్లో ఉంటుంది. ఈ విషయం తెలియగానే ఆమె సోదరులైన దేవేందర్ సింగ్ (దివ్యేందు శర్మ) రవి వీర్ సింగ్ (పుల్కిత్ సామ్రాట్) తమ ఊరికి తిరిగొస్తారు. తమపై దాడి చేసిన వ్యక్తులు చిత్రమైన మాస్కులు ధరించారని చెప్పిన 'గుడియా', హాస్పిటల్లో బెడ్ పైనే హత్య చేయబడుతుంది. ఈ కేసును సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం కోసం స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా 'అరవింద్' రంగంలోకి దిగుతాడు. 

అరవింద్ - రవివీర్ సింగ్ కలిసి చదువుకోవడం వలన వారి మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఈ కారణంగానే అరవింద్ భార్య భారతి (కాశ్మీర పరదేశి) తోను ఆ కుటుంబానికి చనువు ఏర్పడుతుంది. నిహాల్ - గుడియాపై జరిగిన దాడిలో విజూ సాంగ్వాన్ .. సర్పంచ్ డాండా .. కుకీ యాదవ్ ప్రమేయం ఉండొచ్చని అరవింద్ భావిస్తాడు. ఆ వెంటనే అతణ్ణి ఆ కేసు నుంచి తప్పిస్తారు. దాంతో జరిగిన సంఘటనకి కారకులెవరనేది తెలుసుకోవడానికి దేవేందర్ సింగ్ - రవి వీర్ సింగ్ రంగంలోకి దిగుతారు.

నిహాల్ పై జరిగిన దాడిలో గుడియా చనిపోయిందని అనుకున్న వాళ్లకి, గుడియా కారణంగానే నిహాల్ చనిపోయాడని తెలుసుకుని షాక్ అవుతారు. జరిగిన సంఘటనకు కారకులు ఎవరు? ఆ అన్వేషణలో వాళ్లకి తెలిసే చేదు నిజాలేమిటి? అరవింద్ భార్య భారతి నేపథ్యం ఏమిటి? అనే మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. 
   
ఒక ప్రేమజంటపై జరిగిన దాడితో ఈ కథ మొదలవుతుంది. డబ్బు .. అధికారం .. పలుకుబడి కలిగిన ముగ్గురు వ్యక్తులు ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంటారు. వాళ్లను పోలీసులు ఏమీ  చేయలేని పరిస్థితి. దాంతో తమ చెల్లెలికి జరిగిన అన్యాయానికి కారకులెవరనేది తెలుసుకోవడానికి  గుడియా సోదరులు రంగంలోకి దిగడమనేది ఈ కథపై ఆడియన్స్ కి ఆసక్తిని పెంచే మొదటి అంశంగా కనిపిస్తుంది. 

బాక్సింగ్ లో నిహాల్ ఎదుగుదలను అడ్డుకోలేక అతనిని హత్య చేసి ఉంటారని భావించిన గుడియా సోదరులకి, శత్రువుల అసలు టార్గెట్ తమ చెల్లెలేనని తెలుసుకుని ఉలిక్కిపడతారు. ఆమెను ఎవరు ఎందుకు చంపాల్సి వచ్చిందనే సందేహం, ఆడియన్స్ లో మరింత కుతూహలాన్ని పెంచుతుంది. అక్కడి నుంచి ఈ కథ మరిన్ని మలుపులు తీసుకుంటూ, మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది.

ఈ కథలో నెమ్మదిగిగా జర్నలిస్ట్ జోయ్ నా .. అరవింద్ భార్య భారతి పాత్రలు నిదానంగా బలపడుతూ వెళుతుంటాయి. చూస్తుండగానే ఆ పాత్రలు కీలకమైనవిగా మారిపోతాయి. ఈ రెండు పాత్రలు కూడా ఆయా సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చుతూ వెళతాయి. ప్రధానమైన ప్రతినాయకులు .. వాళ్ల అనుచరులు .. కీలక పాత్రలు ఈ కథను ఎప్పటికప్పుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి. 

కథ కథనాలు చాలా బలంగా కనిపిస్తాయి. ఈ సిరీస్ కి స్క్రీన్ ప్లే ప్రాణంగా నిలిచిందని చెప్పాలి. ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చిన ట్విస్టులు కథను కదలకుండా ఫాలో అయ్యేలా చేస్తాయి. వేశ్యాగృహం .. జైలు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతాయి. ఆడియన్స్ అంచనాలకు అందనిదిగా క్లైమాక్స్ ఉంటుంది. 

ప్రధానమైన రెండు పాత్రలు సమాంతరంగా .. సమానమైన ప్రాధాన్యతతో నడుస్తాయి. ఆయా పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు. కాశ్మీర పరదేశి ఈ సిరీస్ మొత్తానికి ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పుకోవాలి. చాలా అందంగా కనిపిస్తూ .. తన హావభావాలతో కట్టిపడేస్తుంది. 

నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదనే విషయం తెలిసిపోతూనే ఉంటుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఈ కథకి పూర్తిస్థాయిలో సపోర్టు చేశాయి. రక్తపాతం ఎక్కువగానే కనిపించే సిరీస్ ఇది. ఈ ఒక్క విషయాన్ని పక్కన పెడితే, పక్కాగా తయారు చేసుకున్న స్క్రిప్ట్ .. ఆర్టిస్టుల ఎంపిక .. స్క్రీన్ ప్లే .. ట్విస్టులు .. క్లైమాక్స్ ఈ సిరీస్ కి మంచి మార్కులు తెచ్చిపెడతాయని చెప్పచ్చు.         


Movie Details

Movie Name: Glory

Release Date:

Cast: Divyenndu, Pulkith Samrat, Kashmira Pardeshi, Ashutosh Rana, Suvinder Vicky, Sayani Guptha

Director: Karan Anshuman - Kanishk Varma

Producer: Mohith Shah- karan Anshuman

Music: -

Banner: Atomic Films Production

Glory Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews