కన్నడలో రూపొందిన మరో యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా'. ఈ సినిమాకి ఉపశిర్షిక 'మెన్ లవ్ వెంజన్స్'. హేమంత్ కుమార్ .. అయానా .. గోపీకా సురేశ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, విజయ్ నాగేంద్ర దర్శకత్వం వహించాడు. రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా, ఫిబ్రవరి 20వ తేదీన థియేటర్లకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో, ఈ నెల 22వ తేదీ నుంచి కన్నడతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.

శక్తిప్రసాద్ (అచ్యుత్ కుమార్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. భార్య .. కూతురు ప్రియ .. కొడుకు అర్జున్ (హేమంత్ కుమార్) ఇదే అతని కుటుంబం. అర్జున్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలనేది శక్తిప్రసాద్ కోరిక. కానీ ఏదైనా బిజినెస్ చేసుకుంటూ సొంతకాళ్లపై నిలబడాలనేది అర్జున్ ఆశయం. ఆ ప్రయత్నాల్లో ఉండగానే అతనికి ఆకాంక్ష (గోపీకా సురేశ్) పరిచయమవుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇక శక్తి ప్రసాద్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాధ (అయానా) కూడా అర్జున్ ను ఆరాధిస్తూ ఉంటుంది. 

అదే సిటీలో మంగళ్ ( రమేశ్ ఇందిర) అతని కొడుకులైన కాళీ .. వాజీ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారు.హైదరాబాద్ లోని బాబీకి డ్రగ్స్ ను చేర్చవలసిన బాధ్యతను వాళ్లకి అప్పగిస్తాడు సుల్తాన్. వాళ్లు ఆ డ్రగ్స్ తీసుకుని వెళుతుండగా, శక్తిప్రసాద్ పట్టుకుంటాడు. కాళీ బృందం పారిపోగా, 500 కోట్ల రూపాయాల విలువైన ఆ డ్రగ్స్ అతని అధీనంలోకి వెళతాయి.

తన బిజినెస్ కి అడ్డంకిగా మారిన శక్తిప్రసాద్ ను అంతం చేయడం కోసం 'బాబీ' రంగంలోకి దిగుతాడు. అతనికి తోడుగా కాళీ టీమ్ నిలుస్తుంది. తన తండ్రి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించిన అర్జున్, ఆయనను కాపాడుకోవడం కోసం బరిలోకి దిగుతాడు. బాబీ ఎవరు? ఆయన బారి నుంచి అర్జున్ తన తండ్రిని కాపాడుకోగలుగుతాడా? రాధ - ఆకాంక్షలలో అర్జున్ చేయి అందుకునేదెవరు? అనేది మిగతా కథ.

ఒక వైపున సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ .. ఆ ప్రొఫెషన్ ను ఇష్టపడని అతని కొడుకు, మరో వైపున మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించే బాబీ. ఆయన క్రింద పనిచేస్తూ .. పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే కాళీ గ్యాంగ్. ఈ మూడు ట్రాకుల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ఈ మూడింటినీ కలుపుతూ వెళ్లిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ముఖ్యమైన పాత్రలుగా తెరపై చాలానే కనిపించినప్పటికీ, హీరో .. విలన్ .. కాళీ పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుంది. తన తండ్రి కోరుకున్నట్టుగా తాను పోలీస్ ఆఫీసర్ కాకపోయినప్పటికీ, ఒకవేళ తాను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయ్యుంటే ఎలా ప్రవర్తించేవాడో అలాగే హీరో పాత్రను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. జీవితంలో ఎప్పటికైనా డబ్బులు లెక్కపెట్టే మిషన్ కొనాలనే కసితో  కనిపించే కాళీ పాత్ర భయపెడుతుంది. 

ఇక డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా కోట్లు సంపాదించాలనే దిశగా సాగే బాబీ ప్రయాణం ఇంట్రెస్టింగా అనిపిస్తుంది. బాబీ పాత్రకి సంబంధించిన సస్పెన్స్ .. ఆ సస్పెన్స్ ను రివీల్ చేసిన విధానం .. ఆ పాత్ర నేపథ్యంలో సాగే డ్రామా కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. తన తండ్రిని కాపాడుకునే క్రమంలో హీరో తెలుసుకునే నిజాలు తాలూకు ట్విస్టులు, ఆడియన్స్ ను ఆశ్చర్యచకితలను చేస్తాయి.

హీరో హేమంత్ కుమార్ మంచి హైట్ .. పర్సనాలిటీతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సన్నివేశాలలో మరింత రాణించాడు. ఇక విలన్ తో పాటు, కాళీ పాత్రను పోషించిన నటుడు .. అచ్యుత్ కుమార్ నటన ఆకట్టుకుంటుంది. రమేశ్ ఇందిర నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. కాకపోతే ఆయన పాత్రను అంత పవర్ఫుల్ గా డిజైన్ చేయలేదు. అలాగే ఆకాంక్ష పాత్ర విషయంలోను అంతగా శ్రద్ధ పెట్టినట్టుగా కనిపించలేదు.

ఇద్దరు హీరోయిన్స్ ఉండటంతో ఆడియన్స్ లవ్ .. రొమాన్స్ పాళ్ల గురించి కాస్త ఎక్కువగానే ఆశలు పెట్టుకుంటారు. కానీ ఆ వైపు నుంచి అంత ఉత్సాహకరమైన సన్నివేశాలేం పడలేదు. ఈ జంటల మధ్య ఫీల్ వర్కౌట్ చేసే పాటలు కూడా ఏమీ లేవు. కాకపోతే ఆ వెలితి తెలియకుండా యాక్షన్ .. ఎమోషన్స్ తో ఈ కథ ముందుకు వెళుతుంది. ట్విస్టులతో కూడిన డ్రామాతో అలా కూర్చోబెట్టేస్తుంది. 

కథాకథనాలు .. టేకింగ్ పరంగా ఈ సినిమా మంచి మార్కులనే తెచ్చుకుంటుంది. కార్తీక్ ఫొటోగ్రఫీ .. అనూప్ సీలిన్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. దీపు ఎస్ కుమార్ ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. అనవసరమైన సన్నివేశాలేమీ కనిపించవు. రక్తపాతంతోను .. ట్విస్టులతోను కూడిన యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి.