కన్నడలో నటిగా .. రచయితగా .. దర్శకనిర్మాతగా సుధా శ్రీనివాసమూర్తికి మంచి గుర్తింపు ఉంది. ఆమె ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'అలా చేరె సీత రాముని చెంతకు'. జ్ఞాని వాసుదేవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

'వైజాగ్' లో ఒక యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ హెడ్ గా మిథిల (సుధా శ్రీనివాసమూర్తి) పనిచేస్తూ ఉంటుంది. రామ్ (కౌశిక్ ఘంటసాల) కొత్తగా అక్కడ జాబ్ లో చేరతాడు. అతణ్ణి చూడగానే మిథిల ఆనందంతో పొంగిపోతుంది. గతంలో అదే కాలేజ్ చదువుతున్నప్పుడు ఆమె అతనిని ఆరాధిస్తుంది. అయితే అప్పటికే అతను వేరొక అమ్మాయితో లవ్ లో ఉండటం వలన పైకి చెప్పలేకపోతుంది. ఇప్పుడు అతను సోలోగానే ఉన్నాడని తెలిసి హ్యాపీగా ఫీలవుతుంది. 

జీవితంలో తనకి తగిలిన ఎదురు దెబ్బల వలన రామ్ చాలా ముభావంగా ఉంటూ ఉంటాడు. తనకి బాస్ స్థానంలో మిథిల ఉండటం వలన, ఆమె చెప్పిన పని చేస్తుంటాడు. అంతకు మించి ఆమె పట్ల అతనికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, గతంలో తనతో పాటు అదే కాలేజ్ లో ఆమె చదివిందనే విషయం కూడా అతనికి గుర్తుండదు. అలాంటి అతనికి దగ్గర కావడానికి మిథిల ప్రయత్నిస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఒక రాత్రివేళ లాంగ్ డ్రైవ్ కి రామ్ ను తీసుకుని వెళుతుంది. 

వైజాగ్ సిటీ దాటేసి ఒక ఫారెస్ట్ ఏరియాకి వెళతారు. అక్కడ వాళ్ల కారు ట్రబుల్ ఇస్తుంది. తప్పనిసరి పరిస్థితులలో మిథిలను ఒంటరిగా వదిలేసి, టైర్ పంక్చర్ వేయించుకు రావడానికి రామ్ వెళతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? రామ్ - మిథిల ఆ రాత్రివేళ ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఫేస్ చేయవలసి వస్తుంది? అక్కడి నుంచి వాళ్లు ఎలా బయటపడతారు? అనేది కథ.

వెలుగుకి అవతల ఉన్నది చీకటే. ఎన్నో అక్రమాలు .. అరాచకాలు చీకటి నేపథ్యంలోనే జరుగుతుంటాయి. సిటీలో వెలుగు జిలుగులు మధ్య జీవితాన్ని సాగించేవారికి, ఆ వెలుగులకు అవతల ఏం జరుగుతుందనేది తెలియదు. రాత్రికి .. ఉదయానికి మధ్య ఎలాంటి రాక్షస గణాలు నిద్రలేస్తాయనేది తెలియదు. అలాంటి ఒక జంట సరదాగా ఫారెస్టు ఏరియాకి వచ్చి అక్కడ ఎలా చిక్కుబడిపోయిందనే అంశం చుట్టూ అలుకున్న కథ ఇది. 

సాధారణంగా సిటీకి దూరంగా చిన్నచిన్న గుడిసెలు .. దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ప్రదేశాలలో వాళ్లకి ఉపాధి కూడా తక్కువగానే ఉంటుంది. అలాంటివాళ్లలో కొందరు నేర స్వభావం ఉన్నవారు ఎలాంటి ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకుంటారు? అది మిగతావారి జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తుందనే అంశాన్ని దర్శకుడు ఈ సినిమాలో టచ్ చేశాడు. చాలామందికి తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. 

ఈ కథ మొదలైన దగ్గర నుంచి చాలావరకూ నిదానంగా సాగుతుంది. కాస్తంత కామెడీతో .. మరికాస్త ఎమోషన్స్ ను కలుపుకుంటూ కదులుతుంది. రాత్రివేళలో ఫారెస్టు ఏరియాలో ఎప్పుడైతే కారు ట్రబుల్ ఇచ్చిందో, అప్పటి నుంచి కథలో వేగంతో పాటు కుతూహలం కూడా పెరుగుతుంది. ఒక క్రైమ్ థ్రిల్లర్ ను మరిపించే స్థాయిలో మలుపులు తీసుకుంటూ ముందుకు వెళుతుంది.

కథలో భారీతనం లేకపోయినా ఆ కథను డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలను మలచిన విధానం .. చిన్నచిన్న పాత్రలే అయినప్పటికీ, ఆ పాత్రల నుంచి రాబట్టిన అవుట్ పుట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఫస్టాఫ్ ను సరదాగా .. సాఫీగా తీసుకెళ్లిన దర్శకుడు,సెకండాఫ్ లో ఆడియన్స్ ను టెన్షన్ పెట్టేస్తాడు. చీకటికి ఇవతల .. అవతల అన్నట్టుగా కథలోని వేరియేషన్స్ ను పరిచయం చేస్తాడు. 

కథ - స్క్రీన్ ప్లే ఎంత సింపుల్ గా కనిపిస్తాయో, ట్రీట్మెంట్ అంత బలంగా అనిపిస్తుంది. ఆర్టిస్టులంతా తమ నటన ద్వారా ఈ కథకు మరింత సహజత్వాన్ని ఆపాదించారు. సుధా శ్రీనివాసమూర్తి నటన ఆకట్టుకుంటుంది. ఆమెలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ ఉందనే విషయం అర్థమవుతుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కంటెంట్ ను మరింత పెర్ఫెక్ట్ గా అందించాయి. 

 ఆమె పేరు 'మిథిల' .. అతని పేరు రామ్ .. వాళ్లిద్దరూ ఒకటైన తీరు కారణంగా ఈ సినిమాకి 'అలా చేరె సీత రాముని చెంతకు' అనే టైటిల్ సరైనదేనని అనిపిస్తుంది. చూడటానికి ఈ టైటిల్  కాస్త పొయెటిక్ గా అనిపించినప్పటికీ, ఒక ఫ్లోలో పలకడం కష్టమనే అనిపిస్తుంది. ఒక సింపుల్ కంటెంట్ ను ఫీల్ తో చెబుతూ, ట్రీట్మెంట్ పరంగా మెప్పించే సినిమాగా ఇది కనిపిస్తుంది.