మోనా సింగ్ - మిహిర్ అహోజా ప్రధానమైన పాత్రలను పోషించిన సిరీస్ 'మా కా సమ్'. నికోలస్ ఖార్కోమ్ గోర్ దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. 8 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను రూపొందించారు. హిందీతో పాటు, తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సిరీస్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథమేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

'ఢిల్లీ' నగరంలో వినీత (మోనా సింగ్) ఆమె తనయుడు అగస్త్య (మిహిర్ అహూజా) నివసిస్తూ ఉంటారు. అగస్త్య  కాలేజ్ చదువును కొనసాగిస్తూ ఉంటాడు. అతని స్నేహితులే జున్నార్ .. అనీ .. మంజరి. వాళ్లతో కలిసి అతను కాలేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. 'అనీ' అతనిని ప్రేమిస్తూ ఉంటుంది. మ్యాథ్స్ లో అతను జీనియస్. గణితానికి తర్కాన్ని జోడించి సమస్యలను పరిష్కరించడం అతని ప్రత్యేకత.  అందువలన లెక్చరర్ 'ఇరా' (అంగీరా ధర్) కూడా అతని పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తూ ఉంటుంది. 
         
అగస్త్య చిన్నతనంలోనే అతని తండ్రి ఇల్లొదిలి వెళ్లిపోతాడు. అతను ఏమైపోయాడనేది ఎవరికీ తెలియదు. తండ్రి కోసం ఎంతో కాలం పాటు ఎదురుచూసి అగస్త్య అలసిపోతాడు. తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లికి ఒక తోడును వెతికే ప్రయత్నంలో పడతాడు అగస్త్య. అందుకోసం ఆమె డేటింగ్ కి డేట్లు ఏర్పాటు చేస్తుంటాడు. తనకి సరైన జోడీని ఎంచుకునే ప్రయత్నంలో ఆమె కొడుకు సాయం తీసుకుని ముందుకు వెళుతుంటుంది. 

ఈ క్రమంలో అగస్త్య ప్రమేయం లేకుండా ఆమె తల్లికి 'అభిమన్యు' అనే వ్యక్తి తారసపడతాడు. అభిమన్యు అంటే అగస్త్యకి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. ఈ నేపథ్యంలో 'జేబీ' అనే వ్యక్తి 'ఇరా' మేడమ్ తో చనువుగా ఉండటాన్ని చూసి అగస్త్య అసహనానికి లోనవుతాడు. అలాగే 'ఇరా'తో అగస్త్య  సన్నిహితంగా ఉండటాన్ని చూసి 'అనీ' అపార్థం చేసుకుంటుంది. ఒక వైపున తల్లి .. మరో వైపున 'అనీ' .. ఇంకొక వైపున 'ఇరా' .. అగస్త్య జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తారు? అనేదే కథ.

రవీందర్ రంధావ - సుమ్రిత్ షాహీ తయారు చేసిన కథ ఇది. తల్లీ కొడుకుల అనుబంధం చుట్టూ ఈ కథ తిరుగుతూ వెళుతుంది. తన భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడం కోసం ఆరాటపడే ఒక కొడుకు కథ ఇది. భర్త కోసం ఎంతో కాలంగా ఎదురుచూసి అలసిపోయి, ఒక కొత్త ప్రయాణాన్ని ఆరంభించాలనే ఆలోచన చేసిన భార్య కథ ఇది. ఈ రెండు పాత్రలను ప్రధానంగా చేసుకుని దర్శకుడు ఈ కథను నడిపించాడు.

చాలా కాలంగా భర్తకి దూరమై బాధ్యతలతోనే కాలం గడిపిన 'వినీత' డేట్ చేయడానికి సిద్ధపడుతుంది. ఆమె డేట్ చేయడానికి తగిన వ్యక్తులను ఆన్ లైన్ ద్వారా అగస్త్య ఎంపిక చేస్తూ ఉంటాడు. అలాగే తన కాలేజ్ లో సబ్జెక్ట్ కి సంబంధించిన విషయాలను 'ఇరా'తో షేర్ చేసుకుంటూ, 'అనీ'తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తూ .. తన జీవితంలోకి కొత్త రంగులను అతను ఆహ్వానిస్తూ ఉంటాడు.  

వినీత తన డేటింగ్ లో భాగంగా ఆయా వ్యక్తులను కలవడం .. వాళ్ల అభిప్రాయాలను తెలుసుకోవడం,అగస్త్య తన ఎమోషన్స్ ను 'ఇరా'తో షేర్ చేసుకుంటూ ఉండటం వంటి అంశాలు ప్రేక్షకులలో కొంత ఆసక్తిని పెంచుతాయి. 'అనీ' .. అగస్త్య స్టూడెంట్స్ అయినప్పటికీ, లెక్చరర్ గా ఉన్న 'ఇరా'తో అగస్త్య కి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఈ ట్రాక్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

బాధ్యతలు తీరిన తరువాత ఒంటరిగా ఉన్న తండ్రికి పెళ్లి చేసే కొడుకు కథలు .. తల్లికి సరైన తోడును చూపించే కూతురు కథలు గతంలో సినిమాలుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరహాలో ఈ ట్రెండ్ కి తగిన కథగా వచ్చిన కంటెంట్ ఇది. కాకపోతే తల్లి డేట్ కి వెళ్లాలనుకోవడం .. అందుకు సంబంధించిన ఆన్ లైన్ వ్యవహారం కొడుకు చూడటం వంటి విషయాలు ఆడియన్స్ లో అందరికీ నచ్చకపోవచ్చు. 

ప్రతి ఒక్కరూ తల్లిని త్యాగాల వైపు నుంచే చూస్తూ ఉంటారు. కానీ ఆమె మనసు తెలుసుకుని .. ఆమెను సంతోషంగా ఉంచవలసిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందనే విషయాన్ని చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ఆధునిక జీవనశైలి పట్ల అవగాహన ఉన్నవారికి ఇది సాధారణమైన విషయంగానే అనిపించడంతో ఆశ్చర్యం లేదు. మిగతావారికి కనెక్ట్ అయ్యే అవకాశాలు తక్కువనే చెప్పాలి.