'పెన్నుమ్ పోరాట్టం' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

మలయాళంలో రూపొందిన సినిమానే 'పెన్నుమ్ పోరాట్టం'. సెటైరికల్ డ్రామా నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాకి రాజేశ్ మాధవన్ దర్శకత్వం వహించాడు. విలేజ్ నేపథ్యంలో .. ఒక కుక్క చుట్టూ తిరిగే కథ ఇది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. రైనా రాధాకృష్ణన్ .. సుభాశ్ చంద్రన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

అది ఒక చిన్న గ్రామం. అక్కడ పనీపాటా లేకుండా తిని తిరిగే వాళ్లే ఎక్కువ. చాలామంది అనవసరమైన విషయాలను గురించి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆ ఊళ్లోనే బాబూ రాజ్ .. అతని తల్లి 'నిమిష' కలిసి నివసిస్తూ ఉంటారు. బాబూరాజ్ తండ్రి ఊరొదిలిపెట్టి వెళ్లిపోయి ఐదేళ్లు అవుతూ ఉంటుంది. బాబూరాజ్ ఒక కుక్క పిల్లను పెంచుతాడు. దానిపేరు 'సుట్టు'. ఆ కుక్క అంటే 'చారులత'కి చాలా ఇష్టం. 

చారులత .. బాబూరాజ్ ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆ ఊళ్లోని కుమార్ అనే యువకుడు చారులతపై మనసు పారేసుకుంటాడు. ఆమె పట్ల తనకి గల ఇష్టాన్ని గురించి వాయిస్ మెసేజ్ చేస్తాడు. చారులతతో చీవాట్లు తింటాడు. తన అన్నయ్య చారుహాసన్ ఊరు నుంచి వచ్చిన తరువాత అతనితో చెబుతానని బెదిరిస్తుంది. చారులతకి కుమార్ చేసిన మెసేజ్ గురించిన విషయం గుప్పుమంటుంది. దాంతో ఆమె పేరెంట్స్ కోపంతో ఊగిపోతూ ఉంటారు. 

చాలా కాలంగా బోనులో బంధించి ఉంచిన కారణంగా, 'సుట్టు' విసిగిపోతుంది. ఒక రోజున 'నిమిష'ను కరిచి అక్కడి నుంచి బయటపడుతుంది. అడ్డొచ్చిన వారికి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. దాంతో కుక్కకు పిచ్చి ఎక్కిందని ఊళ్లోవాళ్లంతా భావిస్తారు. ఆ కుక్కను చంపడానికి వెంటపడతారు. ఈ విషయం తెలుసుకున్న చారులత ఏం చేస్తుంది? సుట్టును ఆమె కాపాడగలుగుతుందా? కుమార్ తో ముడిపెడుతూ ఊళ్లో తన గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఎలా ఎదుర్కొంటుంది? అనేది మిగతా కథ.

గ్రామాలలో ప్రచారాలు ఎలా నిజమవుతాయి? అవి ఇతరుల జీవితాలను శాసించడానికి ఎలా ప్రయత్నిస్తాయి? అనే ఒక ప్రధానమైన అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఒకే గ్రామం .. ఒక వైపున చారులత జీవితం .. మరో వైపున ఆమెకి ఇష్టమైన కుక్క జీవితం ఈ కథలో ప్రధానమైన విషయాలుగా కనిపిస్తాయి. ఈ రెండు అంశాల చుట్టూ కథను అల్లుకుంటూ వెళ్లిన తీరు  ఆకట్టుకుంటుంది .. ఆలోచింపజేస్తుంది. 

సమాజంలో కొంతమంది వ్యక్తులు ఇతరుల జీవితాలను తాము కోరుకున్నట్టుగా ప్రభావితం చేయాలని చూస్తారు. కుక్కను చంపాలంటే ముందుగా అది పిచ్చిదనే ముద్రవేయాలి అన్నట్టుగా, పెళ్లి వైపు నడిపించాలంటే ముందుగా పరువుపై దెబ్బకొట్టాలి అనేట్టుగా ఆలోచన చేస్తుంటారు. అలాంటి ఒక గ్రామం చుట్టూ అల్లుకున్న ఈ కథ, మనుషుల స్వరూపాలను .. స్వభావాలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరిస్తుంది.

సాధారణంగా విలేజ్ నేపథ్యంలో చాలా సినిమాలు రూపొందుతూనే ఉంటాయి. అయితే విలేజ్ లోని వాళ్లందరినీ పాత్రలుగా ఆవిష్కరించిన కథ ఇది. ప్రతి పాత్రను సహజత్వానికి దగ్గరగా .. ఆల్రెడీ గతంలో మనకి తారసపడిన పాత్రలా అనిపించేలా డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. మనలను కూడా అక్కడి సన్నివేశాలలో ఏదో ఒక మూల నిలబెట్టినట్టుగా అనిపిస్తుంది.    

ప్రతి జీవి స్వేచ్ఛను కోరుకుంటుంది. తన అవసరాలు .. ఆకలి తీరుతున్నప్పటికీ, బోనులో ఉండాలని ఏ జంతువు కోరుకోదు. తన సహనం పూర్తిగా నశించినప్పుడు అది తిరగబడి మరీ తన స్వేచ్ఛను సంపాదించుకుంటుంది. ఇక విచక్షణా జ్ఞానం కలిగిన బాధితులు చేయవలసింది ఎదురు తిరగడమే .. ప్రశ్నించడమే. నచ్చినట్టుగా బ్రతకడంలోనే అసలైన ఆనందం ఉందనే విషయాన్ని వినోదాన్ని జోడిస్తూ చెప్పడమే ఈ కథలోని గొప్పతనం.      

సాధారణంగా ఏ గ్రామంలోనైనా పనిలేని వాళ్లంటూ కొంతమంది కనిపిస్తూ ఉంటారు. వాళ్లంతా తమ ఊహాగానాలను ప్రచారంలోకి తీసుకొచ్చి అవి నిజమని ఇతరులు నమ్మేలా చేస్తారు. వాళ్లలో గుడ్డిగా నిర్ణయాలు తీసుకునేవారు కొందరైతే, అంతే గుడ్డిగా వాటిని అనుసరించేవాళ్లు మరి కొందరు. తమ హీరోయిజాన్ని చాటుకోవడానికి ప్రయత్నించేవాళ్లు ఇంకొందరు.  అలాంటివాళ్లకు సమాధానాన్ని .. బాధితులకు సందేశాన్ని ఇచ్చేలా ఈ కథను ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది.

'ఇష్టం లేని చోటు నుంచి పారిపోవడం కోసమే ఇంతటి విశాలమైన ప్రపంచం సృష్టించబడింది' అనే మాట, ఈ కథ మొత్తాన్ని ఒక్కో ముక్కలో తేల్చి చెబుతుంది. నిజంగా అందరూ ఒక గ్రామస్థులేనేమో అనేంత సహజంగా ఆర్టిస్టులు చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకు మరింత సపోర్ట్ చేస్తూ సాగుతాయి. విలేజ్ లలో కనిపించే వాతావరణం .. అక్కడి మనుషులు .. వారి స్వభావాలను వినోదభరితంగా ఆవిష్కరించిన ఈ సినిమా, సరదాగా సాగిపోతూ ఆకట్టుకుంటుంది .. ఆలోచింపజేస్తుంది.  

Movie Details

Movie Name: Pennum Porattum

Release Date:

Cast: Raina Radhakrishnan, Subhash Chandran, Suma, Shinoj

Director: Rajesh Madhavan

Producer: Santhosh Kuruvilla- Binu George

Music: Dawn Voncent

Banner: SKT Frames

Pennum Porattum Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews