గత కొంత కాలంగా కామెడీ కథాంశాలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్న కథానాయకుడు శ్రీవిష్ణు. ఇప్పుడు అదే కోవలో మరో వినోదాత్మక కథాంశాన్నిఎంచుకుని ఈ యువ కథానాయకుడు నటించిన చిత్రం 'విష్ణు విన్యాసం'. ఎటువంటి బజ్‌ లేకుండా విడుదలైన  'విష్ణు విన్యాసం'లో కామెడీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసిందా? శ్రీవిష్ణుకు మరో విజయం దక్కిందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

జూనియలర్‌ లెక్చరర్‌గా పనిచేసే విష్ణుకు  (శ్రీవిష్ణు) వాస్తు, న్యూమరాలజీ, జాతకాలపై నమ్మకం ఎక్కువ. తాను ఏ పనిచేసినా వీటికి అనుగుణంగా, వాటిని తూ.చ తప్పకుండా ఫాలో అవుతుంటాడు. ఇందువల్లే విష్ణుకు వయసు దాటిపోయినా పెళ్లి కూడా అవ్వదు. ఇక తన కాలేజీలోనే పనిచేసే లెక్చరర్‌ మనీషా (నయన సారిక) కింద జూనియర్‌ లెక్చరర్‌గా విష్ణు పనిచేయాల్సి ఉంది. ఇక మనీషాది కూడా ఓ విచిత్రమైన సమస్య. అందువల్లే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు, తొలిచూపులోనే విష్ణును ప్రేమిస్తుంది. 

ఇద్దరి జాతకాలు కలుస్తాయని విష్ణు నమ్ముకున్న సిద్దాంతి చెప్పడంతో ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. అయితే సరిగ్గా ఆమెను పెళ్లి చేసుకునే సమయానికి మనీషా తన జీవితంలో వున్న సమస్యను చెబుతుంది. దీంతో షాక్‌ తిన్న విష్ణు ఏం నిర్ణయం తీసుకున్నాడు? ఈ ఇద్దరి పెళ్లి జరిగిందా? అసలు మనీషా జీవితంలో ఉన్న సమస్య ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

సమాజంలో కొంత మంది మూడనమ్మకాలుగా, మరికొంత మంది నమ్మకాలుగా  పరిగణించే జాతకాలు, న్యూమరాలజీ, వాస్తులను పిచ్చిగా నమ్మే అబ్బాయి, దాని చుట్టు అల్లుకున్న వినోదం, హీరోయిన్‌ పాత్రకు ఓ విచిత్రమైన సమస్య ఇవీ ముఖ్య అంశాలుగా తయారుచేసుకున్న కథ ఇది. కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా, హీరోయిన్‌ పాత్రను తీర్చిదిద్దిన విధానంలో కాసింత వైవిధ్యత ఉంటుంది. తొలిభాగం సరదాగా శ్రీవిష్ణు సినిమాల తరహాలోనే వన్‌లైన్‌ పంచ్‌లతో సాగిపోతుంది. కాకపోతే ప్రథమార్థం అంతా ఊహలకు తగ్టట్టే సాగిపోతుంది. హీరో, హీరోయిన్‌ మధ్య వచ్చే సన్నివేశాలు అక్కడక్కడ నవ్విస్తాయి. కథానాయిక జీవితంలోని అసలు  ట్విస్ట్‌ తెలిసిన తరువాత కథపై ఆసక్తి పెరుగుతుంది. 

అయితే ఆ ఇంట్రెస్ట్‌ను సన్నివేశాల్లో ఆద్యంతం చూపించలేకపోయారు దర్శకుడు. ముఖ్యంగా కథలో ట్విస్ట్‌ తెలిసిపోయిన తరువాత కథనం నడిపించడంలో దర్శకుడు తడబడ్డాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో శ్రీ విష్ణు తన మార్క్‌తో నవ్వులు పూయించాడు. ముద్దు ఎపిసోడ్‌తో పాటు 'జయం'లోని వీరి వీరి గుమ్మడి పండు పాటతో శ్రీవిష్ణు హీరోయిన్‌తో చేసే వినోదం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుంది. అయితే ఇంటర్వెల్‌కు ముందు కథానాయిక జీవితంలోని సమస్యను రివీల్‌ చేయడంతో సెకండాఫ్‌లో ఆడియన్స్‌ ఊహలకు తగ్గట్టే కథనం ఉంటుంది. అయితే సెకండాఫ్‌లో కూడా దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్ముకుని ముందుకు వెళ్లినా ఆ సీన్స్‌ తేలిపోయాయి. 

హీరోయిన్‌కు సమస్య ఉన్నా హీరో ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు? అందుకు కారణమేమిటి అని వివరించే సన్నివేశాలను ఎమోషనల్‌గా తెరకెక్కించినా అవి అంతగా పండలేదు.  అయితే పెళ్లి చూపుల ఎపిసోడ్‌, పెళ్లి చుట్టు అల్లుకున్నవినోదం ప్రేక్షకులకు టైమ్‌పాస్‌ సన్నివేశాలుగా ఉంటాయి.  ముఖ్యంగా సెకండాఫ్‌ బోరింగ్‌గా, సినిమాటిక్‌గా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోవు. 

ఈ చిత్రంలో శ్రీవిష్ణుది వన్‌మ్యాన్‌ షో. ఆయన విచిత్రమైన డైలాగ్‌ డెలివరి, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. ఈసినిమాను తన భుజస్కందాలపై మోసే ప్రయత్నం చేశాడు.అయితే ఆద్యంతం అది కుదరలేదు. మనీషాగా నయన సారి పాత్ర కొత్తగా ఉంది. ఆమె కూడా ఆ పాత్రనే అంతే సమర్థవంతంగా పోషించిది. స్క్రీన్‌పై నయన సారిక అందంగా కనిపించింది. జ్యోతిష్య శాస్తం గురించి తెలియకున్నా అన్నీ తెలిసిన సిద్దాంతిగా నటించిన కమెడియన్‌ శ్రీనివాస రెడ్డి నవ్వించే ప్రయత్నం చేశాడు. 

సినిమా ఆద్యంతం సత్య ఉన్నా ఎందుకో ఆయన కామెడీ మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. లెక్చరర్స్‌ పాత్రల్లో  బిళహరిగా ప్రవీణ్‌, పంకజ్‌గా బ్రహ్మాజీ అక్కడక్కడా నవ్వించారు.  చిత్ర దర్శకుడు రాసుకున్న కథలో నవ్యత లేకపోయినా కామెడీతో సినిమా ఆద్యంతం నడిపించాలనే ప్రయత్నం చేశాడు.అయితే కొన్ని చోట్ల మాత్రం సక్సెస్‌ అయినా, కంటెంట్‌ లేకుండా సినిమాను కేవలం వినోదంతోనే  విజయా తీరాలకు చేర్చడం అత్యాశే అవుతుంది. కొత్తదనం లేని కథతో ఊహలకు అందే సన్నివేశాలతో, అక్కడక్కడా నవ్వించే ఎంటర్‌టైన్‌మెంట్‌తో 'విష్ణు విన్యాసం' ప్రేక్షకులను పూర్థిస్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలమైంది.