'D/O ప్రసాద్ రావు కనబడుటలేదు' (జీ 5) సిరీస్ రివ్యూ!



'జీ 5' నుంచి వదిలిన మరో తెలుగు సిరీస్ 'D/0 ప్రసాద్ రావు కనబడుటలేదు'. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రాజీవ్ కనకాల .. ఉదయభాను .. వసంతిక .. గాయత్రి భార్గవి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను 6 ఎపిసోడ్స్ గా  రూపొందించారు. ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) సూళ్లూరుపేటలో ఒక కిరాణా షాపు నడుపుతూ ఉంటాడు. భార్య .. కూతురు స్వాతి (వసంతిక) ఇదే అతని ఫ్యామిలీ. ప్రసాద్ రావు తమ్ముడు .. బావ ఇద్దరూ కూడా తమ కుటుంబాలతో కలిసి అక్కడికి దగ్గరలోనే ఉంటూ ఉంటారు. స్వాతి అంటే ప్రసాద్ రావుకి ప్రాణం. ఇంజనీరింగ్ పూర్తికావడంతో, ఆమెకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలని ఆయన నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో స్వాతికి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ సంస్థలో జాబ్ వస్తుంది. 

ప్రసాద్ రావుకి ఇష్టం లేకపోయినా, కుటుంబ సభ్యులంతా కలిసి ఒత్తిడి చేయడంతో కాదనలేకపోతాడు. హైదరాబాద్ తీసుకుని వెళ్లి, ఆఫీస్ .. హాస్టల్ చూసి దిగబెట్టేసి వస్తాడు. స్వాతి అక్కడ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్లో దిగుతుంది. హాస్టల్ రూములో అప్పటికే మంజు - రమ్య - శాండీ ఉంటారు. ఆ రూమ్ లో తాము తప్ప మరొకరు ఉండటానికి వాళ్లు ఎంతమాత్రం ఇష్టపడరు. వాళ్ల ధోరణి స్వాతికి చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. హాస్టల్ నిర్వాహకురాలు భవాని ( గాయత్రి భార్గవి)కి చెప్పినా ఆమె పెద్దగా పట్టించుకోదు.         

అలా నెల గడిచిపోతుంది. ఓ రోజు రాత్రి స్వాతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, ప్రసాద్ రావు వర్షంలోనే బయల్దేరి హైదరాబాద్ లోని హాస్టల్ కి చేరుకుంటాడు. అప్పటికే స్వాతి మిస్సింగ్ గురించి పోలీస్ ఆఫీసర్ రెబెక్కా (ఉదయాభాను)తో భవాని మాట్లాడుతూ ఉంటుంది. తన కూతురు కనిపించకుండా పోయిందని తెలుసుకున్న ప్రసాద్ రావు ఏం చేస్తాడు? ఆమె కనిపించకుండా పోవడానికి కారకులు ఎవరు? ఈ విషయంలో ప్రసాద్ రావుకి తెలిసే చేదు నిజాలేమిటి? అనేది మిగతా కథ.

 ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు కూడా ఉద్యోగాల పేరుతో తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. అప్పటివరకూ తోడుగా ఉంటూ పెంచిన అమ్మాయిలను .. పెళ్లికి ముందు జాబ్ కోసం సిటీలకు పంపించడం తల్లిదండ్రులకు నిద్రపట్టనీయకుండా చేస్తోంది. ఆడపిల్లలు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆనందం .. ఆలస్యం చేస్తే ఆందోళన అనేది తల్లిదండ్రులకు అలవాటైపోయింది. అలాంటి ఒక వాస్తవ  పరిస్థితి నుంచి దర్శకుడు ఈ కథ వస్తువును తీసుకున్నాడు. 

 టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన సిరీస్ ఇది. కూతురిని వదిలిపెట్టి ఉండలేని ఒక తండ్రి కథ ఇది. తండ్రికి దూరంగా ఉండటం ఇష్టం లేకపోయినా, సిటీలో జాబ్ చేయాలనే ఆసక్తి ఉన్న ఒక కూతురు కథ ఇది. దర్శకుడు ప్రధానమైన కథను ఈ ఇద్దరి ఎమోషన్స్ చుట్టూనే తిప్పుతూ వెళ్లాడు. అలాంటి  అమ్మాయి కనిపించకుండా పోతే, అందుకు గల కారణాలు తెలియకపోతే .. అనే అంశాల చుట్టూ ఈ కథ పరిగెడుతుంది. 

ఈ నేపథ్యంలోనే పోలీస్ ఆఫీసర్ 'రెబెక్కా' రంగంలోకి దిగుతుంది. అక్కడి నుంచి కథ మరింత వేగాన్ని అందుకుంటుంది. వివిధ కోణాలలో సాగుతూ వెళ్లే పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఆడియన్స్ లో ఉత్కంఠను పెంచుతుంది. ఆఫీసులో స్వాతి టీమ్ లీడర్ వైపు నుంచి .. ఇటు హాస్టల్ నిర్వాహకురాలి వైపు నుంచి .. స్వాతి రూమ్మేట్స్ వైవు నుంచి అనుమానాన్ని రేకెత్తిస్తూ వెళ్లిన విధానం, ఆడియన్స్ ను మరింత కుతూహలంతో కూర్చోబెట్టేస్తుంది.

ఇన్వెస్టిగేషన్ ఎటూ తేలకపోడం .. తేల్చకపోవడం ఆడియన్స్ లో కాస్త అసహనాన్ని కలిగిస్తూ ఉండగా ఒక ట్విస్ట్ పడుతుంది. ఆ ట్విస్ట్ అప్పటివరకూ అక్కడక్కడా కాస్త బలహీనంగా నడిచిన కథను బలంగా మార్చేస్తుంది. ఈ కథలో కొత్తదనం ఏవుంది? గతంలో ఇలాంటివి చాలానే వచ్చాయి గదా అని అనిపించవచ్చు. అయితే ఈ సిరీస్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. నిడివి పరంగా అది చిన్నదే అయినా, అది కథపై చూపించే ప్రభావం ప్రధానమైనది. 

సాదాసీదాగా సాగిపోతున్న ఈ కథను ప్రభావితం చేసేది ఈ ఫ్లాష్ బ్యాక్ నే. ఇది సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది కూడా. కథ .. కథనం .. సన్నివేశాలను ఆవిష్కరించిన విధానం మెప్పిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. రామ్ కె మహేశ్ అందించిన ఫొటోగ్రఫీ బాగుంది. శ్రీరామ్ మద్దూరి నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా సాగింది. చంద్రశేఖర్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. 
  
సాఫ్ట్ వేర్ జాబ్స్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిలు సిటీలకు వస్తుంటారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ఉంటారు. ఇక్కడ ఎవరి ఉద్దేశం ఏమిటో .. ఎవరి స్వభావం ఏమిటో వాళ్లు పసిగట్టలేక ప్రమాదంలో పడుతుంటారు. అలాంటివారి విషయంలో జరంత జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ధైర్యంతో బ్రతకడం నేర్పించాలనే సందేశం ఈ సిరీస్ లో మనకి  కనిపిస్తుంది. ప్రేమ ప్రపంచాన్ని వికసింపజేస్తుంది .. ద్వేషం దహించి వేస్తుంది అనే నీతి కూడా ఈ కథలో మనకి కనిపిస్తుంది. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సిరీస్ ఇది.

Movie Details

Movie Name: D/O Prasad Rao Kanabaduta ledu

Release Date:

Cast: Rajeev Kanakala, Vasanthika, Udayabhanu, Gayathri Bhargavi, Bindu Chandramouli

Director: Poluru krishna

Producer: Venkat Sriram

Music: Sri Ram Maddury

Banner: South Indian Screens

D/O Prasad Rao Kanabaduta ledu Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews