'లక్కీ ది సూపర్ స్టార్' (జియో హాట్ స్టార్)మూవీ రివ్యూ!



తమిళంలో రూపొందిన సినిమానే 'లక్కీ ది సూపర్ స్టార్'. జీవీ ప్రకాశ్ కుమార్ - అనశ్వర రాజన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి ఉదయ్ మహేశ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నేరుగా ఈ రోజునే 'జియో హాట్ స్టార్'లో విడుదలైంది. 'లక్కీ' అనే ఒక కుక్క పిల్ల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుందా .. లేదా? అనేది చూద్దాం.

లక్ష్మణ్ (జీవీ ప్రకాశ్ కుమార్) అక్కాబావలు శ్రీనివాసన్ - అనూ సిటీలో నివసిస్తూ ఉంటారు. వాళ్ల ఒక్కగానొక్క సంతానమే 'అమ్ములు'. ఆ పాప 'ఆటిజం'తో బాధపడుతూ ఉంటుంది. శ్రీనివాసన్ ఒక పెద్ద సంస్థలో పని చేస్తూ ఉంటాడు. ఆయన ద్వారా ఆ కంపెనీలో జాబ్ సంపాదించవచ్చని లక్ష్మణ్ కూడా సిటీకి వచ్చేస్తాడు. అక్కాబావల దగ్గర ఉంటూ 'అమ్ములు'ను చూసుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ప్రమాదం బారిన పడబోయిన ఒక వీధి కుక్కపిల్లను కాపాడి, దానిని ఇంటికి తీసుకుని వస్తాడు లక్ష్మణ్. 
 
లక్ష్మణ్ కుక్క పిల్లను తీసుకుని రావడం ఇష్టం లేకపోయినా, అనూ కారణంగా శ్రీనివాసన్ ఏమీ అనలేకపోతాడు. అందరూ కలిసి ఆ కుక్కపిల్లకి 'లక్కీ' అనే పేరు పెడతారు. లక్కీ వచ్చిన దగ్గర నుంచి 'అమ్ములు'లో మంచి మార్పు కనిపించడం మొదలుపెడుతుంది. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు లేకుండా పోతుంది. లక్ష్మణ్ తో గొడవపడిన కౌన్సిలర్ గణేశ్ మూర్తి మనుషులు, 'లక్కీ'ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళతారు. మరో కుక్కపిల్ల కోసం వెదుకుతున్న లక్ష్మణ్ కీ, కీర్తి (అనశ్వర రాజన్) తారసపడుతుంది.         

లక్కీ అడుగుపెట్టడమే ఆలస్యం అదృష్టం కలిసొస్తుందనే విషయం కౌన్సిలర్ కి అర్థమవుతుంది. దాంతో వెంటనే ఆ కుక్కపిల్ల ఎమ్మెల్యే ఇంటికి చేరుకుంటుంది. ఎమ్మెల్యే కి కూడా ఇదే విషయం అనుభవంలోకి వస్తుంది. ఫలితంగా ఆ కుక్కపిల్ల ముఖ్యమంత్రి ఇంటికి చేరుకుంటుంది. లక్కీపై బెంగతో అమ్ములు హాస్పిటల్ పాలవుతుంది. అమ్ములును దక్కించుకోవాలంటే, ముఖ్యమంత్రి దగ్గరున్న లక్కీని తీసుకురావలసిన బాధ్యత లక్ష్మణ్ పై పడుతుంది. అప్పుడతను ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు? అనేది కథ.

ఈ సినిమా పోస్టర్స్ చూసిన వాళ్లు ఈ కథలో 'కుక్కపిల్ల' ఒక భాగం కావొచ్చు అనుకుంటారు. కానీ ఈ కథ తిరిగేదే కుక్కపిల్ల చుట్టూ. కరెక్టుగా చెప్పాలంటే ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర కుక్కపిల్లదే. ఇక కొన్ని వీధికుక్కలు కూడా ఈసినిమాలో కీలకమైన పాత్రలలో కనిపిస్తాయి. అవి కూడా మాట్లాడుతూ ఉంటాయి. రకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది చిన్న పిల్లలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే కంటెంట్ అనే అనుకోవాలి.

దర్శకుడు కుక్కపిల్లకు ముడిపెట్టి ఈ కథను మూడు నాలుగు కోణాల్లో ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు. ఒక వైపున తన మేనకోడలి కోసం కుక్కపిల్లను హీరో వెదుకుతూ ఉంటాడు. ఒక వైపున కుక్కపిల్ల తల్లి తన బిడ్డ జాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరో వైపున తమకి కలిసొచ్చిన ఆ కుక్కపిల్లను, తమ అనుచరులతో రాజకీయనాయకులు వెతికిస్తూ ఉంటారు.

ఇంతవరకూ బాగానే అనిపిస్తుంది. కుక్కపిల్ల ప్రధానమైన కేంద్రంగా ఇన్ని కోణాల్లో కథను నడిపించడానికి చేసిన ప్రయత్నం కరెక్టుగానే అనిపిస్తుంది. అయితే ఈ ట్రాకులను ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయారు. కుక్కపిల్ల ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ అవుతూ ఉండటం .. చేజారిపోతూ ఉండటం .. దానిని వెతికి పట్టుకోవడానికి గ్రూపులు పడే పాట్లు .. ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించవచ్చు. కానీ అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. 

జీవీ ప్రకాశ్ కుమార్ ... అనశ్వర రాజన్ ను జంటగా తీసుకున్నప్పటికీ, లవ్.. రొమాన్స్ దిశగావాళ్లను ఎంత మాత్రం వాడుకోలేదు. ఇక హీరో మేనకోడలి వైపు నుంచి, కుక్క - కుక్కపిల్ల వైపు నుంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయిగానీ, అవి పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. కొన్ని సీన్స్ ను సీరియస్ తీసుకోకపోవడం .. మరికొన్ని సీన్స్ సిల్లీగా అనిపించడం జరుగుతుంది. దాంతో ఈ కంటెంట్ ఎక్కడా .. ఏ విషయంలోను కదిలించలేకపోయింది.

జీవీ ప్రకాశ్ కుమార్ - అనశ్వర రాజన్ తో పాటు, ఎవరి నటన గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. దర్శకుడు పూర్తిగా కుక్కపిల్లపైనే దృష్టి పెట్టడం వలన, ఇక మిగతా పాత్రలను డిజైన్ చేసే విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఏ పాత్ర కూడా తన వైపు నుంచి కథను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోతుంది. ప్రీ క్లైమాక్స్ లో కాస్త హడావిడి కనిపిస్తుందంతే. క్లైమాక్స్ కూడా అందరూ గెస్ చేసేదిగానే ఉంటుంది. 
              
ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. బలమైన కథాకథనాలు లేకుండా .. పాత్రలపై కసరత్తు చేయకుండా .. తేలికపాటి సన్నివేశాలతోనే సరిపెట్టిన కంటెంట్ ఇది. లవ్ .. రొమాన్స్ వైపు తొంగి చూడకుండా, కామెడీని టచ్ చేయకుండా వెళ్లిన ఈ కథ, ఎమోషన్స్ వైపు నుంచి కూడా ఏమీ చేయలేకపోయింది.  

Movie Details

Movie Name: Lucky The Super Star

Release Date:

Cast: GV Prakash Kumar, Ashwara Rajan, Adukalan Naren, Mdhusudan, Devadarshini

Director: Uday Mahesh

Producer: Kandasami

Music: Hesham Abdul Wahab

Banner: Kavithalaya productions

Lucky The Super Star Rating: 1.50 out of 5

Trailer

More Movie Reviews