'చథా పచ్చ' ఓ మలయాళ సినిమా. 'ది రింగ్ ఆఫ్ రౌడీస్' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. అర్జున్ అశోకన్ .. రోషన్ మాథ్యూ .. విశాక్ నాయర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, కామెడీనీ .. యాక్షన్ మీ టచ్ చేస్తూ సాగే యాక్షన్ డ్రామా. ఈ ఏడాది జనవరి 22వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'నెట్ ఫ్లిక్స్'లోకి స్ట్రీమింగ్ కి వచ్చింది. అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంతో పాటు తెలుగు ..తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.
సావియో (అర్జున్ అశోకన్) వెట్రి (రోషన్ మాథ్యూ) లిటిల్ (ఇషాన్ షౌకత్) ముగ్గురూ అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి ఈ ముగ్గురికీ 'కుస్తీ' పోటీలపట్ల ఆసక్తిగా ఉండేది. ఆ ఊర్లో జరిగే కుస్తీ పోటీలలో 'మాని'కి తిరుగుండేది కాదు. అలాంటి అతణ్ణి ఎక్కడి నుంచో వచ్చిన 'వాల్టర్' (మమ్ముట్టి) ఓడిస్తాడు. అప్పటి నుంచి అక్కడివాళ్లకు అతను హీరో అవుతాడు. ఈ ముగ్గురు అన్నదమ్ములు కుస్తీలో అతని దగ్గరే శిక్షణ పొందుతారు.
ఆ తరువాత కాలంలో ఈ ముగ్గురు అన్నదమ్ముల దారులు వేరైపోతాయి. మిగతా ఇద్దరు సోదరులను వెతుక్కుంటూ తన సొంత ఊరుకి 'లిటిల్' చేరుకుంటాడు. సావియో ఒక 'లాంచ్' పై పనిచేస్తూ రోజులు గడుపుతూ ఉండటం చూస్తాడు. వెట్రి ఏడెనిమిదేళ్లుగా జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడని తెలుసుకుని షాక్ అవుతాడు. వెట్రికి జాస్మిన్ తో వివాహం జరిగిందనీ, సావియో దగ్గర పెరుగుతున్న 'రోసా', వెట్రి కూతురని తెలుసుకుంటాడు.
ఆ ఊళ్లో రాజకీయంగా శివన్ చక్రం తిప్పుతూ ఉంటే, 'కుస్తీ'కి సంబంధించి తనదే పైచేయి అని 'చెరియన్' నిరూపించుకుంటూ ఉంటాడు. మళ్లీ 'కుస్తీ'ని మొదలుపెట్టి తామేంటనేది నిరూపించాలనే లిటిల్ నిర్ణయాన్ని సావియో సమర్థిస్తాడు. అయితే అందుకోసం జైలు నుంచి వెట్రిని విడిపించాలంటే భయపడతాడు. అందుకు కారణం ఏమిటి? చెరియన్ ను వాళ్లు ఎలా ఎదుర్కుంటారు? అన్నదమ్ముల ఆశయం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.
స్పోర్ట్స్ నేపథ్యంలో గతంలో మలయాళంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఈ కథ 'కుస్తీ' పోటీల చుట్టూ తిరుగుతుంది. 90లలో విపరీతమైన క్రేజ్ ఉన్న 'డబ్ల్యూ డబ్ల్యూ ఈ'ని మనకి మరోసారి గుర్తుకు చేస్తుంది. 'కుస్తీ' పట్ల ఆసక్తి ఉన్న ముగ్గురు అన్నదమ్ములు, తమ కలను నిజం చేసుకోవడం కోసం, ఎలాంటి అవరోధాలను అధిగమించారనే ఒక అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ముగ్గురు అన్నదమ్ముల బాల్యం .. కుస్తీ పోటీల పట్ల వాళ్లకి ఇష్టం ఏర్పడటానికి కారణం .. వాళ్ల దారులు వేరైన తీరు .. చెరియన్ తో గొడవ .. ఇలా కొంతవరకూ ఈ కథ ఆసక్తికరంగానే నడుస్తుంది. వెట్రి జైలుకు ఎందుకు వెళ్లాడు? అతను తిరిగొస్తాడని తెలిసి సావియో ఎందుకు భయపడుతున్నాడు? అనే అంశాలు ఈ కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఇక మరో వైపు నుంచి చెరియన్ విలనిజం కూడా టెన్షన్ పెడుతూ ఉంటుంది.
ఇక వెట్రి జైలుకు వెళ్లడానికి ముందు 'జాస్మిన్' అనే యువతిని ప్రేమించి, ఆమె ఇంట్లోవాళ్లకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటాడు. దాంతో అతనిపై జాస్మిన్ సోదరులు ఇద్దరూ కోపంతో ఉంటారు. వాళ్ల వైపు నుంచి కూడా సావియోకి ఆపద పొంచి ఉంటుంది. ఇలా ఇన్ని వైపులా నుంచి కథను అల్లుకుంటూ వచ్చారు. అయితే అది కొంతదూరం వరకే. ఆ తరువాత కథ అంతా వరుస కుస్తీ పోటీలతో విసుగు తెప్పిస్తుంది.
క్రీడలకు సంబంధించిన కథల విషయంలో కచ్చితంగా ఒక క్లారిటీ ఉండవలసిన అవసరం కనిపిస్తుంది. ఆటను ఎంతవరకూ చూపించాలి. ఆ ఆట చుట్టూ ఎమోషన్స్ ను ఎక్కడి వరకూ అల్లుకోవాలి? అనే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అప్పుడప్పుడు ఆటను టచ్ చేస్తూ, మిగతా వినోదపరమైన అంశాల వైపు వెళ్లవలసి ఉంటుంది. లేదంటే నిజమైన గేమ్ ను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.
'చథా పచ్చ' అంటే 'డూ ఆర్ డై' అనే అర్థం వస్తుంది. కాలంలో కాస్త వెనక్కి వెళ్లి జరిగే కథ ఇది. ఒక దశ తరువాత 'కుస్తీ' పోటీలపై మాత్రమే పూర్తి ఫోకస్ చేశారు. ఆటకి తగినట్టుగానే అరుపులు .. కేకలు .. గందరగోళ వాతావరణంలో ఈ కథ నడుస్తుంది. ఉత్కంఠను రేపే ట్విస్టులేవీ తగలవు. ఈ కంటెంట్ ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతుంది. మిగతా ఆడియన్స్ కి అంతగా పట్టుకోదు.
ఈ కథ చివర్లో అతిథి పాత్రలో మమ్ముట్టి కనిపిస్తారు. కథ మొదలైన దగ్గర నుంచి ఆ పాత్ర ప్రస్తావన కనిపిస్తుందిగానీ, ఆ పాత్ర తెరపైకి వచ్చినందు వలన పెద్దగా ప్రభావం కనిపించదు. ఎమోషన్స్ .. కామెడీ ఏ మాత్రం కనిపించకపోవడం, కథాకథనాలలో బలం లేకపోవడం మరో మైనస్ గా అనిపిస్తుంది. పాత్రలు ఎక్కువైపోవడం .. పాత్రలకి తగిన ప్రత్యేకత .. ప్రాధాన్యత లభించకపోవడం .. గందరగోళ వాతావరణం వలన ఈ కథ ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.
'చథా పచ్చ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Chatha Pacha Review
-
Movie Details
Movie Name: Chatha Pacha
Release Date: 2026-02-19
Cast: Arjun Ashokan,Roshan Mathew , Vishak Nair,Ishan Shoukath,Siddique
Director: Adhvaith Nayar
Music: Shankar-Ehsaan-Loy
Banner: Reel World Entertainment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer