ఈ మధ్య కాలంలో ఓటీటీ గ్రౌండ్స్ లో ఎక్కడ చూసినా క్రైమ్ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ సినిమాలు రాజ్యం చేస్తున్నాయి. అలాంటి ఈ నేపథ్యంలో తమిళం నుంచి ఒక మైథలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమానే 'మహాసేన'. వేమల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, క్రితం ఏడాది డిసెంబర్ 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోను, ఈ నెల 6వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులోకి వచ్చింది.
అది దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ రెండు గిరిజన గూడాలు నివసిస్తూ ఉంటాయి. ఒక గూడానికి చెందిన శింగోట్టవ (వేమల్) మరో గూడానికి చెందిన 'గంగ' (మహిమ గుప్తా) ను ప్రేమిస్తాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఈ లోగా శింగోట్టవ తండ్రి కారణంగా గంగ తండ్రి చనిపోతాడు. దాంతో పగతో రగిలిపోయిన గంగ, శింగోట్టవ తండ్రిని హత్య చేయిస్తుంది. ఈ కారణంగా శింగోట్టవ - గంగ మధ్య ప్రేమ చెదిరిపోతుంది. శింగోట్టవ పెళ్లి 'భూమి' (సృష్టి డాంగే)తో జరుగుతుంది. అలాగే గంగ పెళ్లి 'ఇడుంబన్'తో జరుగుతుంది.
కొండపై శింగోట్టవ వర్గం .. కొండ క్రింద గంగ వర్గం వారు నివసిస్తూ ఉంటారు. రెండు గూడాల మధ్య శత్రుత్వం కొనసాగుతూ ఉంటుంది. శింగోట్టవ వర్గానికి చెందినవారు 'యాలేశ్వర ' దేవతను తమ కులదేవతగా పూజిస్తూ ఉంటారు. ప్రాచీన కాలానికి చెందిన ఆ విగ్రహం ఖరీదు కోట్లలో ఉంటుంది. ఆ విగ్రహంపై ఫారెస్టు ఆఫీసర్ ప్రతాప్ (జాన్ విజయ్) కన్నుపడుతుంది. 'యాలేశ్వర' స్వామిని 'మహాసేన' అనే ఒక ఏనుగు రక్షిస్తూ ఉంటుంది. ఆ ఏనుగుకి సంరక్షకుడిగా శింగోట్టవ ఉంటాడు. ప్రతి ఏడాది 'యాలేశ్వర' స్వామికి వైభవంగా జాతర నిర్వహిస్తూ ఉంటారు.
ఆ ఏడాది జాతరలో ఆ విగ్రహాన్ని కాజేసి తనకి అందజేయవలసిన బాధ్యతను, 'గంగ' వర్గానికి అప్పగిస్తాడు ఫారెస్ట్ ఆఫీసర్ ప్రతాప్. అదే సమయాల్లో ట్రెక్కింగ్ కోసం సిటీ నుంచి ఒక విద్యార్ధి బృందం ఆ అడవికి వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతాప్ వెనుకున్నది ఎవరు? గూడెం ప్రజలకు ఎదురుకానున్న ప్రమాదాలు ఎలాంటివి? అనేది మిగతా కథ.
సాధారణంగా అడవి నేపథ్యంలో కథ అనగానే ఆడియన్స్ ఆసక్తికరంగా ఫీలవుతారు. ఎందుకంటే అడవి అనేది అనేక రహస్యాలకు నిధి మాదిరిగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అడవిలో అక్కడివారు పూజించే ఒక శక్తిమంతమైన దేవత .. ఆ విగ్రహంపై కన్నేసిన శత్రువులు .. ఆ విగ్రహానికి కాపలాగా ఒక ఏనుగు .. ఆ ఏనుగును సంరక్షించే నాయకుడు అనేసరికి మరింత కుతూహలాన్ని చూపడం సహజం.
దర్శకుడు ఈ కథను చాలా ఆసక్తికరంగా మొదలుపెడతాడు. రెండు గూడాల మధ్య పోరాటం .. మధ్యలో ఫారెస్టు ఆఫీసర్ హడావిడి .. ట్రెక్కింగ్ పేరుతో కాలేజ్ స్టూడెంట్స్ సందడితో కథ పరిగెడుతూ ఉంటుంది. అయితే ఏ ట్రాక్ వెంట పరిగెత్తినా ఎలాంటి ప్రయోజనం లేదనే విషయం అర్థం కావడానికి ప్రేక్షకులకు ఎక్కువ సమయం పట్టదు. ఎత్తుకున్న పాత్రలు .. డిజైన్ చేసుకున్న సన్నివేశాలు బలహీనపడుతూ వెళుతుంటాయి. శత్రువుల వ్యూహాలు .. అక్కడివారు ఆ వ్యూహాలను తిప్పికొట్టడాలు .. తనని విశ్వసించినవారిని కాపాడేందుకు దైవశక్తి ప్రయత్నించడం గట్రా సన్నివేశాలేవీ కనిపించవు.
హీరో ద్వారా ఏనుగు గానీ .. ఏనుగు ద్వారా హీరోగానీ ఈ కథలో చేసినదేమీ లేదు. ప్రధానమైన పాత్రలను ఒక రేంజ్ లో పరిచయం చేస్తారు. ఆ పాత్రలు బలహీనపడటానికి గానీ, కథకి బరువై పోవడానికి గాని ఎంతో సమయం పట్టదు. హీరో .. హీరోయిన్ .. మెయిన్ విలన్ .. లోకల్ విలన్ .. యోగిబాబు .. ఇలా పేరుకే తప్ప ఎవరి పాత్రను కూడా సరిగ్గా డిజైన్ చేయలేకపోయారు .. ఉపయోగించుకోలేకపోయారు. కథాకథనాల సంగతి అలా ఉంచితే, చేసిన కొద్ది గ్రాఫిక్ వర్క్ కూడా వీక్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు .. ఎక్కడిక్కడ బలహీన పడుతున్న సన్నివేశాల మధ్య, అడవికి సంబంధించిన దృశ్యాలు మాత్రమే మనకి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి.
ప్రధానమైన పాత్రల స్థానాల్లో కొంతమంది ఆర్టిస్టులు కనిపిస్తారు. కాకపోతే వాళ్లు చేయడానికి అక్కడ ఏమీలేదు. కెమెరా పనితనం ఫరవాలేదు. నేపథ్య సంగీతం విషయానికి వస్తే ఆ సౌండ్స్ ను భరించడానికి బలమైన గుండె కావాలి. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. ఈ సినిమా పేరు 'మహాసేన'. కథలో ఇది ఏనుగు పేరు. ఏనుగు వలన కథ ప్రభావితం కాలేదు .. కథ వలన ఏనుగు కీలకంగా నిలవనూ లేదు. కథకీ .. టైటిల్ కి పొంతన కూడా లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అడవిలో సాగే అయోమయం .. అక్కడి గూడాల మధ్య సాగే గందరగోళం .. అంతే.
'మహాసేన'(అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Mahasenha Review
-
Movie Details
Movie Name: Mahasenha
Release Date: 2026-02-06
Cast: Vemal, Srushti Dange, Yogibabu, John Vijay, Kabir Duhan Singh, Mahima Guptha
Director: Dinesh Kalaiselvan
Music: Praveen Kumar
Banner: Madhuram Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer