విలేజ్ నేపథ్యంలోని కథలను .. క్రైమ్ డ్రామా నేపథ్యంలోని కథలను తెరకెక్కించడంలో తమిళ దర్శకులు సిద్ధహస్తులు. ఈ రెండిటినీ కలుపుకుని రూపొందిన సినిమాగా 'లెనిన్ పాండియన్' కనిపిస్తుంది. బాలచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. గంగై అమరన్ - రోజా - దర్శన్ గణేశన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ప్రస్తుతం 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులో ఉంది. 

'శివగంగ' అనే ఒక విలేజ్ లో 'దురై రాజు' ( గంగై అమరన్) తన భార్య 'చందనం' (రోజా)తో కలిసి నివసిస్తూ ఉంటాడు. కొద్దిగా పొలం .. ఊరు చివరన ఒక చిన్న పాక .. ఇవే అతనికున్న ఆస్తులు. పిల్లలు లేని ఆ దంపతులు 'మీనాక్షి' అనే మేకను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. ఆ ఊరు 'నది' నుంచి రాజారత్నం (ఆడుగాలం నరేన్) అతని కొడుకు 'రవి' (యుగేంద్రన్) అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఉంటారు. రాజారత్నం నుంచి పెద్ద మొత్తంలో ముడుతున్నందువలన, రాజకీయనాయకులు .. పోలీస్ అధికారులు అతని గుప్పెట్లో ఉంటారు.

ఒక రోజు ఒక ఇసుక లారీ ఢీ కొట్టడం వలన దురై రాజు మేక చనిపోతుంది. ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోరు. దాంతో అతను ఇసుక మాఫియా విషయాన్ని వీఏవో (అర్చన రవిచంద్రన్) దృష్టికి తీసుకెళతాడు. వెంటనే యాక్షన్ తీసుకున్న ఆమెను, రాజారత్నం మనుషులు హత్య చేస్తారు. దాంతో దురైరాజు కోర్టుకు వెళతాడు. కోర్టు ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తుంది. దురైరాజుకి భద్రతగా సుందర పాండియన్ (దర్శన్ గణేశన్) అనే కానిస్టేబుల్ ను నియమిస్తుంది. 

సుందరపాండియన్ తండ్రి లెనిన్ పాండియన్ గతంలో కానిస్టేబుల్ గా పనిచేసి చనిపోతాడు. అతని మరణంపై అనేక ఊహాగానాలు ఉంటాయి. అతని స్థానంలో సుందరపాండియన్ కి పోలీస్ జాబ్ వస్తుంది. అయితే సానుభూతితో ఇచ్చిన ఆ జాబ్ చేయడం అతనికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అయితే ఆ జాబ్ చేయడం తమకి ఎంతో అవసరమని భార్య 'ప్రియ' చెబుతుంది. అతను ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వలన, ఆమె కుటుంబ సభ్యులు అతనిని టార్గెట్ చేసి ఉంటారు. వాళ్ల నుంచి తమని ఆ జాబ్ కాపాడుతుందని అంటుంది. 

సుందరపాండియన్ పిరికివాడనీ .. అతను ఆ జాబ్ కి పనికిరాడని తోటి ఆఫీసర్లు హేళన చేస్తుంటారు. అతణ్ణి డ్యూటీ చేయనీయకుండా చిల్లరపనులు చేయిస్తూ ఉంటారు. అతను ఒక అసమర్థుడని ప్రొజెక్ట్ చేస్తుంటారు. అలాంటి సుందరపాండియన్ దురై రాజుకి రక్షణ ఇవ్వగలుగుతాడా? తాను సమర్ధుడైన పోలీస్ కానిస్టేబుల్ గా నిరూపించుకోగలుగుతాడా? అసలు అతని తండ్రి ఎలా చనిపోతాడు? ఇసుక మాఫియాకి సుందరపాండియన్ తెరదించగలుగుతాడా? అనేది మిగతా కథ.

 సుందరపాండియన్ అనే యువకుడు సున్నితమైన మనసున్నవాడు. పోలీస్ గా పనిచేస్తున్న తండ్రి చనిపోవడంతో, తన స్వభావానికి ఆ జాబ్ సెట్ కాదని తెలిసి కూడా, కుటుంబాన్ని నెట్టుకు రావడం కోసం పోలీస్ అవుతాడు. ఒక వైపున ఫ్యామిలీ వైపు నుంచి .. మరో వైపున స్వార్థ రాజకీయ నాయకుల నుంచి .. ఇంకొక వైపు నుంచి అవినీతి అధికారులు సృష్టించిన సమస్యలను ఒక సాధారణ పోలీస్ ఎలా ఎదుర్కొంటాడు? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం.

వయసు బాగా పైబడిన ఒక చిన్నపాటి రైతు, ఇసుక మాఫియాకి చెందిన వ్యక్తులతో తలపడటానికి సంబంధించిన సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. ఆ మాఫియా లీడర్ల నుంచి అతనికి రక్షణగా నియమించబడిన ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ ఎలాంటి సవాళ్లను ఫేస్ చేయవలసి వస్తుందనే సన్నివేశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది. ఈ మధ్యలోనే పోలీస్ కి .. అతని భార్యకి., రైతుకు .. అతని భార్యకి గల ఎమోషన్స్ ను టచ్ చేస్తూ వెళ్లారు. 

అందంగా నదులు ప్రవహించే ఆహ్లాదకరమైన పల్లెలు ఇసుకాసురులు కబంధ హస్తాలలోకి వెళ్లిపోయాయి. అలాంటి ఇసుక మాఫియా ఒక సాధారణ రైతు .. ఒక సాధారణ పోలీస్ జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే అంశం చుట్టూ అల్లుకున్న ఈ కథ చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. చాలా ప్రాంతాలలో అనునిత్యం కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. అలాగే రైతులకు తమ నేలపై .. తాము పెంచుకుంటున్న జీవాలపై ఎంత అనురాగం ఉంటుందనేది ఆవిష్కరించిన తీరు కూడా గొప్పగా అనిపిస్తుంది. 

దర్శకుడు బలమైన కథనే ఎంచుకున్నాడు. దానిని సహజంగా ఆవిష్కరించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే వయసుపైబడిన వ్యక్తిని చందనం ఎందుకు పెళ్లి చేసుకుంది? అనే విషయానికి సంబంధించిన కారణం బలంగా కనిపించదు. అలాగే రోజా అనగానే రెబల్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకుంటారు. ఆ పాత్రలో ఆ వైపుకి సంబంధించిన యాంగిల్ ను చూపిస్తారేమోనని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశనే ఎదురవుతుంది. 

గంగై అమరన్ .. రోజా .. దర్శన్ గణేశన్ .. ఆడుకాలం నరేన్ .. ఇలా అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఎడ్విన్ సాకే ఫొటోగ్రఫీ .. ఇళయరాజా నేపథ్య సంగీతం ... రామచంద్రన్ ఎడిటింగ్ మంచి మార్కులు దక్కించుకుంటాయి. సహజత్వాన్ని ప్రతిబింబించే కథలు .. విలేజ్ నేపథ్యంలో నడిచే కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుందనే చెప్పాలి.