మలయాళంలో జోజు జార్జ్ కి మంచి క్రేజ్ ఉంది. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఆయన సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటి ఆయన నుంచి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమనే 'వరవు'. షాయాజీ కైలాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 16వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైంది. అలాంటి ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంటుగా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.

పాల్సన్ (జోజు జార్జ్) సెంట్రల్ జైలు నుంచి 'పెరోల్'పై బయటికి వస్తాడు. కోర్టు అతనికి 10 రోజులు మాత్రమే సమయం ఇస్తుంది. ఈ లోగా తాను చేయవలసిన పనులు పూర్తి చేయాలనే కసితో అతను ఉంటాడు. అతని అక్కయ్య 'డైసీ' (సుకన్య) నన్ గా ఉంటుంది. తమ్ముడు 'విల్సన్' (అర్జున్ అశోకన్) కనిపించకుండాపోయి నాలుగేళ్లు అవుతూ ఉంటుంది. వాళ్లిద్దరి గురించి అతను ఎక్కువగా ఆలోచన చేస్తుంటాడు. అతనికి తోడుగా స్నేహితులైన సేతు - పాపన్ ఉంటారు.

పాల్సన్ .. డైసీ .. విల్సన్ ఈ ముగ్గురూ కూడా తమ చిన్నతనంలోనే 'సెభాన్' (దీపక్ పరాంబోల్)ను చేరదీస్తారు. అయితే అతను రాజకీయంగా ఎదిగి ఇప్పుడు ఎమ్మెల్యే గా చక్రం తిప్పుతుంటాడు. ఆ ప్రాంతంలో అన్యాయాలకు .. అక్రమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న 'కొచ్చాటన్' చేతిలో పావుగా మారిపోతాడు. అక్కడి పోలీస్ స్టేషన్ లో ఉండే 'స్కారియా' కూడా 'కొచ్చాటన్' కోసమే తన అధికారాలను ఉపయోగిస్తూ ఉంటాడు. అతనికి అనుకూలంగా పనిచేస్తూ ఉంటాడు. 'కొచ్చాటన్' కూతురే 'లిషా'. 

పాల్సన్ తమ్ముడు విల్సన్ లెక్చరర్ గా పనిచేస్తున్న కాలేజ్ లోనే 'లిషా' చదువుకుంటూ ఉంటుంది. ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ ఊరు నుంచి పారిపోతారు. తన పరువు ప్రతిష్ఠలను బజార్లో పడేసిన విల్సన్ పై కొచ్చాటన్ మండిపడతాడు. వాళ్లిద్దరి ఆచూకీ తెలుసుకుని, తన కూతురును ఇంటికి తీసుకుని వెళతాడు. అప్పటి నుంచి విల్సన్ ఆచూకీ తెలియదు. తన తమ్ముడు కనిపించకుండా పోయిన విషయంలో కొచ్చాటన్ .. సెభాన్ .. స్కారియాపై పాల్సన్ కి అనుమానం ఉంటుంది. పెరోల్ పై వచ్చిన ఆయన ఏం చేస్తాడు? ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? అనేదే కథ.

'వరవు' అంటే మలయాళంలో 'రావడం' అనే అర్థం ఉంది. అంటే హీరో జైలు నుంచి 'పెరోల్' పై రావడం .. లేదంటే నాలుగేళ్ల క్రితం ఊరు నుంచి పారిపోయిన హీరో తమ్ముడు తిరిగి రావడం అనే సందర్భాలు మనకి ఈ కథకి తగినట్టుగా కనిపిస్తాయి. తన తమ్ముడికి జరిగిన అన్యాయానికి ఒక అన్నయ్య ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనే దిశగా ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు. అయితే ఈ ప్రతీకారం తీర్చుకునే విషయంలో ఒక కొత్త కోణం ఉంది. అయితే ఆ పాయింటు కూడా ఆల్రెడీ ఇంతకుముందు టచ్ చేసినదే.  

డబ్బు .. పలుకుబడి .. అధికారం .. ఈ మూడు ఏకమైతే, సామాన్యుల జీవితాలను బలి తీసుకునే ఆలోచనలు చేస్తాయి. ఈ మూడు శక్తులు ఏకమై నిలబడితే సామాన్యులు ఎదురువెళ్లలేరు .. ఏమీ చేయలేరు అనే  ధీమా అరాచక శక్తులకు ఉంటుంది. అలాంటి వాళ్లకి ఒక సామాన్యుడి ప్రతీకారం ఎలా ఉంటుందనేది చూపించే కోణంలో దర్శకుడు ఈ కథను నడిపించాడు. 

ఈ కథ అంతా కూడా జోజు జార్జ్ చుట్టూనే తిరుగుతుంది. నెగెటివ్ షేడ్స్ కలిగిన మిగతా పాత్రలు తెరపై అక్కడక్కడా .. అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఒక బడా వ్యాపారీ .. ఒక రాజకీయనాయకుడు .. ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కథలో విలన్స్ గా కనిపిస్తారు. అయితే మలయాళ సినిమాల సహజ లక్షణంగా .. వాస్తవానికి దగ్గరగా ఈ కథ కదులుతుంది. ఎక్కడా కూడా 'అతి' అనేది కనిపించదు. పరిస్థితులకు తగినట్టుగా మారిపోవడమే కనిపిస్తుంది. 

ఈ కథలో హీరో తమ్ముడి ప్రేమవ్యవహారం చాలా కీలకం. కథను మలుపు తిప్పే అంశం ఇదే. అలాంటి ఈ అంశానికి పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. కథ .. కథనం .. చిత్రీకరణ .. ఇవన్నీ కూడా బోర్ అనిపించకుండా సాగిపోతూనే ఉంటాయి. కాకపోతే గతంలో వచ్చిన ఈ తరహా కథల అడుగుజాడలలోనే ఈ కథ కూడా నడవడం ఇబ్బందిని కలిగిస్తుంది. 

జోజు జార్జ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన తరువాత ప్రభావితం చేసే స్థాయిలో మిగతా పాత్రలేవీ కనిపించవు. శరవణన్ ఫొటోగ్రఫీ .. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం .. ఆకట్టుకుంటాయి. షమీర్ మహ్మద్ ఎడిటింగ్ ఫరవాలేదు. 

కర్మ ఫలితం ఎవరినీ వదిలిపెట్టదు. నువ్వు మంచి చేసినా .. చెడు చేసినా దాని ఫలితాన్ని ముట్టజెప్పడానికి అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అనే సందేశం  ఈ కథలో మనకి కనిపిస్తుంది.