ఈ మధ్య కాలంలో దైవశక్తిని తోడుగా చేసుకుని తెరపైకి వస్తున్న కథలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ తరహా సినిమాలకు ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు కూడా. అలా వారాహీదేవి చుట్టూ తిరిగే ఒక కథగా వచ్చిన సినిమానే 'మహేంద్రగిరి వారాహి'. సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన సినిమా ఇది. సిద్ధూ జొన్నలగడ్డ .. ఐశ్వర్య రాజేశ్ కనిపించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన విడుదలైంది.
అది 'మహేంద్రగిరి' అనే ఒక విలేజ్. మహేంద్ర భూపతికి సంబంధించిన రాజవంశీకులు జమీందారులుగా ఆ గ్రామంలో నివసిస్తూ ఉంటారు. ఆ వంశానికి వారాహీదేవి శాపం ఉంటుంది. 33 ఏళ్లు నిండగానే ఆ వంశానికి సంబంధించిన వారసులు చనిపోతారనేదే ఆ శాపం. ఆ రోజున రాజేంద్రవర్మ ( సిద్ధూ జొన్నలగడ్డ) 33వ జన్మదినం. దాంతో రాజేంద్ర వర్మ భార్య సుజాత .. ఆయన నాయనమ్మ శకుంతల ( మంజుభార్గవి) ఆందోళన చెందుతుంటారు. అంతలో సుజాతకి నొప్పులు మొదలు కావడంతో, ఆమెను పట్నం తీసుకెళ్లడానికి బయల్దేరిన రాజేంద్రవర్మ చనిపోతాడు. అందుకు వారాహీదేవి కారణమని చెప్పుకుంటారు.
రాజేంద్రవర్మ చనిపోవడం .. నిండు గర్భవతి అయిన సుజాత కనిపించకుండా పోవడం శకుంతలను కుంగదీస్తాయి. ఆ సమయంలో కూతురు పురుడు పోసుకోవడం ఆమెకి కాస్త ఊరటను కలిగిస్తుంది. శకుంతల ఆ బిడ్డకు నరేంద్రవర్మ అని నామకరణం చేసి పెంచుతుంది. 'ప్రీతి' అనే అమ్మాయిని నరేంద్రవర్మ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. దాంతో తమ వంశానికి వారాహీదేవి ఇచ్చిన శాపం గురించి ప్రీతితో శకుంతల చెబుతుంది. తన తాతయ్య విశ్వనాథ శాస్త్రి ( సురేశ్) తమను ఈ గండం నుంచి బయటపడేయగలడని ప్రీతి ధైర్యం చెబుతుంది.
ప్రీతి తాతయ్య విశ్వనాథ శాస్త్రి, తన మనవరాలి మాంగళ్యాన్ని కాపాడటం కోసం రంగంలోకి దిగుతాడు. వారాహిదేవి శాపం నుంచి ఆ కుటుంబాన్ని బయటపడేయడానికి తనవంతు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అలాంటి పరిస్థితులలోనే తన కుటుంబంతో కలిసి ఆ ఊరుకి వస్తాడు సిద్ధార్థ్ (సుమంత్). అతను ఓ యూట్యూబర్. దేవుడు లేడు - దెయ్యం లేదు అనేది ఆయన బలంగా నమ్ముతుంటాడు. ఆ విషయాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి సిద్ధార్ తమ్ముడి మాట కాదనలేక మహేంద్రగిరిలోని వారాహి ఆలయానికి వెళతాడు.
ఆ రోజునే నరేంద్రవర్మ 33వ పుట్టినరోజు కావడంతో, ఆ ఫ్యామిలీ వారాహి ఆలయానికి వస్తుంది. అక్కడ ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. మహేంద్ర భూపతి వంశానికి గల వారాహి శాపాన్ని గురించి అప్పుడే సిద్ధార్థ్ కి తెలుస్తుంది. మహేంద్రగిరి వారసుల మరణాలకు కారణం వారాహిదేవియేనా? అనే నిజాన్ని తెలుకోవాలని అతను నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎదురయ్యే సవాళ్లే ఈ సినిమా.
మహేంద్ర భూపతి వంశానికి వారాహీదేవి ఇచ్చిన శాపం .. అందువలన తమ 33వ పుట్టినరోజున ఒక్కొక్కరుగా వారసులు చనిపోవడం .. ఈ దారుణాలు ఆపలేని రాజమాత దిగులుతో కూడిన సన్నివేశాలు తెరపైకి వస్తాయి. ఆ విలేజ్ వచ్చిన సిద్ధార్థ్ అమ్మవారి శాపం వెనకున్న అసలు రహస్యాన్ని ఛేదించాలనుకోవడం .. అందుకోసం ఆ ఊళ్లో తిష్ఠ వేయడం వంటి సన్నివేశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.
ఈ కథ 18వ శతాబ్దంలో మొదలై .. ప్రస్తుత కాలంలో నడుస్తుంటుంది. మహేంద్రగిరి విలేజ్ .. అక్కడి వారాహీదేవి ఆలయం .. అమ్మవారి పట్ల ప్రజలకు గల విశ్వాసం .. అసలు దేవుడినే నమ్మని హీరో ఆ విలేజ్ లోకి అడుగుపెట్టడం వంటి సన్నివేశాలతో అల్లుకున్న కథ ఇది. ఈ సినిమా చూస్తుంటే, ఇంతకుముందు ఇలాంటి కథనే ఎక్కడో చూసినట్టుగా ఉందేనని అనిపిస్తూ ఉంటుంది. ఆ సినిమా పేరు 'సుబ్రహ్మణ్య పురం' అనీ .. అది సుమంత్ - సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్ లోనే వచ్చిందనే విషయం గుర్తుకు రావడానికి కొంత సమయం పడుతుంది.
'సుబ్రహ్మణ్య పురం' కథ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం చుట్టూ తిరిగితే, ఈ కథ వారాహీదేవి చుట్టూ తిరుగుతుంది. నాస్థికుడైన హీరో, రహస్యాలను అన్వేషించడం అక్కడా ఇక్కడా ఒకటే. ఇలా చాలా దగ్గర పోలికలతో .. అదే కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ఒక సీరియస్ విషయంలోకి వెళ్లడానికి ముందు హీరో ఇంట్రడక్షన్ .. ఒక కామెడీ సీన్ తో జరుగుతుంది. అలీ కాంబినేషన్ లోని ఈ సీన్ తోనే, కంటెంట్ తేలిపోవడం మొదలవుతుంది.
జరుగుతున్న సంఘటనలకు కారణం వారాహీ కాదనే విషయం ఆడియన్స్ కి తెలుసు. కాకపోతే కారకులు ఎవరు? కారణం ఏమిటి? అనేది తెలుసుకోవడానికి వాళ్లు వెయిట్ చేస్తుంటారు. ఆ దిశగా హీరో కొనసాగించే అన్వేషణ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమీ అనిపించదు. ఉన్న ట్రాకులే బలహీనంగా నడుస్తుంటే, కొంతసేపు కనిపించే కొత్త పాత్రలొచ్చి మరింత బలహీనంగా మారుస్తుంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ ..క్లైమాక్స్ విషయానికి వస్తే, రావు గోపాలరావు - అల్లు రామలింగయ్య కాలంనాటి కథలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్ లోని ఈ కొత్తదనాన్ని ఆడియన్స్ ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి మరి.
నటీనటులంతా ఎవరి పాత్ర పరిధిలో వాళ్లు చేశారు. ప్రతాప్ ఆర్ కృష్ణ ఫొటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. వారాహి అమ్మవారు తెరపై కనిపించేటప్పుడు ఆశించినస్థాయి అవుట్ పుట్ రాలేదని అనిపిస్తుంది. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. అమ్మవారికి సంబంధించిన గ్రాఫిక్స్ .. విగ్రహాలను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
వారాహీదేవి శత్రు సంహారిణి. శత్రువులను వేటాడటంలో .. కట్టడి చేయడంలో ఆమె ఎంత మాత్రం ఆలస్యం చేయదని అంటారు. కథలో జరుగుతున్న సంఘటనలలో ఆమె ప్రమేయం లేదని నిరూపిస్తూ వచ్చి, చివర్లో ఆమె శిక్షించే విధానాన్ని చూపించారు. దాంతో ఇప్పటివరకూ అమ్మవారు ఏం చేస్తోంది మరి? అనే ఒక సందేహాన్ని రేకెత్తించినట్టు అయింది. థియేటర్ బయటికి వస్తూ ఆడియన్స్ ఇదే మాట అనుకోవడం వినిపిస్తుంది.
'మహేంద్రగిరి వారాహి' - మూవీ రివ్యూ!
Mahendragiri Varahi Review
Movie Details
Movie Name: Mahendragiri Varahi
Genre: Fantasy, Mystery, Thriller
Release Date: 2026-09-11
Cast: Sumanth, Aishwarya Rajesh, Siddhu Jonnalagadda, Vennela Kishore,Brahmanandam, Rajeev kanakala
Director: Santhossh Jagarlapudi
PRO: -
Music: Anoop Rubens
Banner: Bridge Films - RS Entertainments
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer