కొరియన్ సినిమాలకు .. సిరీస్ లకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వైపు నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. కొరియన్ కథల్లోని బలం .. సహజత్వం .. టేకింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందువలన ఓటీటీ సెంటర్లలో కొరియన్ కంటెంట్ హవా నడుస్తోంది. అలా వచ్చిన సిరీస్ గా 'ది ఈస్ట్ ప్యాలెస్' కనిపిస్తోంది. నామ్ జూ హ్యూక్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ డార్క్ ఫాంటసీ సిరీస్ ను 8 ఎపిసోడ్స్ గా రూపొందించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది.
అది ఒక అందమైన ప్యాలెస్. అక్కడ నుంచే ప్రిన్స్ 'క్రౌన్' తన పరిపాలన కొనసాగిస్తూ ఉంటాడు. అతనికంటే ముందున్న రాజుకి నలుగురు వారసులు ఉంటారు. వాళ్లంతా కూడా ఒకరి తరువాత ఒకరు చనిపోతారు. ఆ మరణాలు జరిగిన 30 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతమవుతూ ఉంటుంది. క్రౌన్ వారసులు ముగ్గురు చనిపోతారు. నాల్గొవ కుమారుడు (యువరాజు) చావు బ్రతుకుల్లో ఉంటాడు. ఈ వరుస మరణాలకు కారణం 'కోనేటి దెయ్యం' అనే అంతా నమ్ముతుంటారు.
'గు - చోన్' ( నామ్ జూ హ్యూక్)కి చిన్నతనం నుంచే కొన్ని అతీంద్రియ శక్తులు వస్తాయి. అందువలన అతనికి దుష్టశక్తులను ఎదుర్కొనగలిగే శక్తి వస్తుంది. ఈ కారణంగా 'క్రౌన్' అతనిని పిలిపిస్తాడు. కోనేటి దెయ్యాన్ని అంతం చేసి, తన కొడుకుని బ్రతికిస్తే, అతను కోరినది ఇస్తానని చెబుతాడు. అసలు విషయాన్ని దాచేసి, 'వాస్తు నిపుణుడు'గా తన ప్యాలెస్ లో చెలామణి కావలసిందిగా ఆదేశిస్తాడు. ప్యాలెస్ కి దూరంగా పెరిగిన కూతురు (యువరాణి)ని పిలిచి, 'గు -చోన్'కి సహకరిస్తున్నట్టుగా ఉంటూ, అతనిని గమనించమని చెబుతాడు.
యువరాణి .. గు - చోన్ ఇద్దరూ కూడా ఆ ప్యాలెస్ లో తిరుగుతూ, పరిస్థితులను పరిశీలించడం మొదలుపెడతారు. ఆ ప్యాలెస్ లో 'కోనేరు' చుట్టూ ఏదో రహస్యం ఉందని భావిస్తారు. అలాగే 'ఉప్పుగని' ప్రదేశంలోనే ప్రేతాత్మల హడావిడి ఎక్కువగా ఉండటాన్ని గమనిస్తారు. మంత్రించిన కుండల వెనుక మర్మం ఏదో ఉందని భావిస్తారు. యువరాజు ప్రాణాలకు హాని తలపెడుతున్న పిశాచిని గురించి కనుక్కోవడానికి 'గు-చోన్' ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ రాజభవనంలో తన తల్లిని హత్యచేసింది ఎవరనే అన్వేషణను యువరాణి కొనసాగిస్తూ ఉంటుంది.
ఆ రాజభవనంలోని రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించిన వాళ్లు ప్రాణాలతో ఉండరనే ఒక ప్రచారం ఆ రాజ్యంలో బలంగా వినిపిస్తూ ఉంటుంది. అందువలన తాను వచ్చిన పనిని పూర్తి చేసి త్వరగా బయటపడాలనే ఉద్దేశంతో 'గు - చోన్' ఉంటాడు. తాను వచ్చిన పని అయ్యేంతవరకూ రాజభవనంలోనే ఉండాలనే ఆలోచనతో యువరాణి ఉంటుంది. వాళ్ల ప్రయత్నాలకు రాజమాత అడ్డుపడుతూ ఉంటుంది. వాళ్ల అన్వేషణలో తేలే నిజాలేమిటి? పిశాచిగా మారిన రాజనర్తకి ఎవరు? ఆ రాజభవనంలోని తూర్పు ప్రదేశంలో దాగిన రహస్యాలేమిటి? అనేది కథ.
రాజభవనంలో వరుసగా జరుగుతున్న వారసుల మరణాలు, చనిపోయిన రాజనర్తకి అందుకు కారణమంటూ అసహనాన్ని ప్రదర్శించే రాజమాత, రాజావారి ఆదేశంతో ఆ పిశాచాన్ని అంతం చేయడం కోసం బరిలోకి దిగిన కథానాయకుడు, అతని పనితీరును పరిశీలించడం కోసం నియమితమైన యువరాణి. రాచకుటుంబంతో గల గొడవల కారణంగా ప్యాలెస్ కి దూరంగా పెరిగిన పాత్ర ఇది. ప్రధానమైన కథ అంతా కూడా ఈ నాలుగు ప్రధానమైన పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.
రాజులు .. రాజ్యాలు .. రాజభవనాలు అనగానే, అధికారం కోసం వారసత్వ పోరాటాలు జరగడం మామూలే. ఇక రాజభవనంలో పెత్తనం కోసం పోటీలు పడటం సహజమే. రాజభవనంలో ఏం జరుగుతుందనేది బయటికి తెలియకుండా సేవకులను భయపెట్టడం మామూలే. ఈ నేపథ్యంలో వాళ్లు క్షుద్ర విద్యలను తెలిసినవాళ్లను నమ్మడం కూడా సహజంగానే జరిగిపోతూ ఉంటుంది. ఈ అంశాలన్నిటినీ కలుపుకుంటూ సాగిపోయే ఈ కథ, ఇటు హారర్ టచ్ ను .. అటు ఫాంటసీ టచ్ ను ఇస్తూ .. జానపద కథను తలపిస్తుంది.
రాజభవనం చుట్టూ అల్లుకున్న రహస్యాలను ఛేదించడం అనే అంశమే అందరిలో చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఆ అంశం క్షుద్ర శక్తులతో ముడిపడి ఉంటే .. అతీంద్రియ శక్తులతో వాటిని ఎదుర్కోవడం వంటి సన్నివేశాలు ఉంటే ఆడియన్స్ మరింత ఎంజాయ్ చేస్తారు. అలా ఈ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నైట్ ఎఫెక్టులు .. గ్రాఫిక్స్ .. విజువల్స్ .. సెట్స్ .. ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్లో మన కళ్లముందు నిలబెడతాయి.
ఒక సాధారణ యువకుడు .. యువరాణి అనే విషయం తెలియక ఆమెతో కలిసి రహస్యాలను ఛేదించడం థ్రిల్ కలిగిస్తుంది. కథలో ట్విస్టులపై ట్విస్టులు ఉంటాయి. ఒకానొక దశలో నాల్గో ఎపిసోడ్ కి కథ అయిపోయిందేమో .. ఆ తరువాత ఇంకా ఏం చూపిస్తారబ్బా అనిపిస్తుంది. కానీ అక్కడి నుంచి కథ మరో అనూహ్యమైన మలుపు తీసుకుంటుంది. ఇలా ఈ కథ అంతఃపురం మొదలు ప్రేతాత్మలతో యుద్ధం వరకూ వెళుతుంది.
కథ .. స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా సాగుతాయి. మేకింగ్ చాలా స్టైలీష్ గా అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ - నేపథ్యసంగీతం ఎక్కువ మార్కులు సంపాదించుకుంటాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసుకోవచ్చు. గ్రాఫిక్స్ ను గట్టిగానే ఉపయోగించారు. పిశాచాలతో పోరాటం వంటి సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెట్టినా, మిగతా సన్నివేశాలు ఆసక్తికరంగానే సాగుతాయి. సాధారణంగా జానపద కథలకు ఫాంటసీ టచ్ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. ఈ సిరీస్ లో హారర్ టచ్ కూడా ఇవ్వడం కొత్తగా అనిపిస్తుంది.
'ది ఈస్ట్ ప్యాలెస్' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!
The East Palace Review
Movie Details
Movie Name: The East Palace
Release Date: 2026-07-17
Cast: Nam Joo-Hyuk,Roh Yoon-Seo,Cho Seung-Woo,Jang Young-Nam,Hong Seo-Jun
Director: Choi Jung-Kyu
Music: Jung Se-rin - Kim Joon-seok
Banner: Imaginus
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer