హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఈ జోనర్ నుంచి వచ్చిన సినిమాలను భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ చూస్తుంటారు. అందువల్లనే ఈ జోనర్ సినిమాలను ఎక్కువగా వదలడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా రూపొందిన సినిమానే 'ది కాల్'. 2020 నవంబర్లో విడుదలైన ఈ సౌత్ కొరియన్ సినిమా, ఆ తరువాత ఓటీటీ సెంటర్లలోకి అడుగుపెట్టింది. అయితే తాజాగా 'జియో హాట్ స్టార్' లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

అది సిటీకి దూరంగా ఉన్న ఒక మారుమూల గ్రామం. అక్కడ ఎడిత్ క్రాన్స్ టన్ (లిన్ షేయ్) అనే ఒక వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. క్రాన్స్ భర్త ఎక్కువగా ట్రావెలింగ్ లో ఉండటం వలన, ఆమె భయపడుతూనే రోజులు గడుపుతూ ఉంటుంది. ఆమె రూపం.. చిత్రమైన ధోరణి కారణంగా మంత్రగత్తె అనే ఒక పేరు పడిపోతుంది. కొంతమంది ఆకతాయిలు ఆమెను మరింత ఇబ్బందిపెడుతూ ఉంటారు. 

 తన చెల్లెలు 'లారా' కనిపించకపోవడానికి క్రాన్స్ కారణమని 'తానియా' భావిస్తుంది. ఆమెనే లారాను ఏదో చేసి ఉంటుందని ప్రచారం చేస్తుంది. తన స్నేహితులైన క్రిస్ .. బ్రెడ్ .. జాక్ తో కలిసి క్రాన్స్ ఇంటిపైకి వెళుతుంది. రాళ్లు విసురుతూ ఆమె ఇంటి అద్దాలను పగులగొడతారు. ఆ తరువాత ఆమె చనిపోయిందని తెలుసుకుని వాళ్లంతా ఆశ్చర్యపోతారు. ట్రావెలింగ్ నుంచి వచ్చిన క్రాన్స్ భర్త, ఆ నలుగురు స్నేహితులను తన ఇంటికి పిలిపిస్తాడు. తన భార్య ఆత్మ హత్య  చేసుకుందనీ, ఆమె బాడీతో పాటు ఫోన్ ను కూడా ఖననం చేశానని చెబుతాడు. 

తన ఇంట్లోని మేడ పై గదిలోకి ఒక్కొక్కరుగా వెళ్లి, ఆ నెంబర్ కి కాల్ చేసి ఒక నిమిషం మాట్లాడమని కోరతాడు. నిమిషం పాటు మాట్లాడినవారికి, పెద్ద మొత్తంలో నగదు బహుమతిని అందజేస్తానని చెబుతాడు. అలా చేయకపోతే తన భార్య రాసిన సూసైడ్ లెటర్ ను పోలీసులకు అందజేస్తానని బెదిరిస్తాడు. దాంతో అతను చెప్పినట్టుగా చేయడానికి వాళ్లు అంగీకరిస్తారు. ఒక్కొక్కరుగా మేడపైకి వెళతారు. అక్కడ ఏం జరుగుతుంది? వెళ్లినవాళ్లు తిరిగొస్తారా లేదా? అనేది మిగతా కథ.

ఆత్మహత్య చేసుకున్నవాళ్లు దెయ్యాలుగా మారతారా? బ్రతికున్నపుడు తమని అదే పనిగా వేధిస్తూ వచ్చినవాళ్లపై ప్రేతాత్మలు పగబడతాయా? అలాంటివాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటాయా? అనే ప్రశ్నలకు  సమాధానంగా ఈ సినిమా కథను అల్లుకున్నారు. ఆకతాయి చేష్టలతో తనని వేధించిన ముగ్గురు యువకులు .. ఒక యువతిపై ఒక ప్రేతాత్మ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది? అనే అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.

వృద్ధురాలు చనిపోవడం .. ఆమె ఆత్మహత్యకు కారకులైన నలుగురు ఫ్రెండ్స్ ను ఆమె భర్త పిలిపించడం .. వాళ్లకి ఒక టాస్క్ ఇవ్వడం వరకూ ఈ కథ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఇక ప్రేతాత్మతో ఫోన్లో మాట్లాడటానికి ఒక్కొక్కరూ మేడపైకి వెళుతుంటే, అసలు కథ మొదలైందనే ఒక కుతూహలం పెరుగుతూ పోతుంది. అయితే ఆ క్యూరియాసిటీ ఎంతోసేపు నిలబడదు. ఎందుకంటే ఆడియన్స్ భయపడేంత స్థాయిలో అక్కడ ఏమీ జరగదు.

మేడపైకి వెళ్లిన వాళ్లు ఒక ప్రత్యేకమైన జోన్ లోకి వెళ్లిపోవడం వరకూ బాగానే ఉంది. అయితే అక్కడ లైటింగునుగానీ, ప్రేతాత్మకి సంబంధించిన జుగుప్సాకరమైన సన్నివేశాలనుగాని చూడలేము. భయంతో ముచ్చెమటలు పట్టేంత సీన్ .. అక్కడ ఏ సీన్ కి లేదు.  మొబైల్ ను శవంతో పాటు పెట్టేసి పూడ్చేయడం, ఆ నెంబర్ కి కాల్ చేస్తే ప్రేతాత్మ మాట్లాడటం వంటి సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి.

సాధారణంగా దెయ్యాల కథలన్నీ దాదాపు ఒక ఇంటిపరిమితమవుతూ ఉంటాయి. ఆ ఇంటి గేటుదాటి దెయ్యాలు బయటికి రావు. బయట పాత్రలు లోపలికి వెళతాయి అంతే. పైగా ఈ తరహా కథలకు పెద్దగా తారాగణం అవసరం లేదు. చాలా తక్కువ మందితో .. తక్కువ బడ్జెట్ లో కానిచ్చేస్తూ ఉంటారు. అలాంటి ఒక కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే రియాలిటీ షోను గుర్తుకు చేసే కంటెంట్ ఇది.

ఆర్టిస్టుల నటన గురించి గొప్పగా చెప్పుకోవడానికేమీ లేదు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. హారర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి చాలా సాధారణంగా అనిపించే కాన్సెప్ట్ గా ఈ సినిమా మిగిలిపోతుందని చెప్పచ్చు.