మొదటి నుంచి కూడా ఈటీవీ కుటుంబ బంధాలు .. ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. గతంలో సినిమాలు .. సీరియల్స్ విషయంలో మాత్రమే కాదు, ఇప్పుడు వెబ్ సిరీస్ ల విషయంలోను అదే పంథాను అనుసరిస్తోంది. అలా ఇప్పుడు ఈటీవీ విన్ కి 'గుర్తుకొస్తున్నాయి' అనే వెబ్ సిరీస్ వచ్చింది. విరాజ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వినోద్ గాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
'కాకినాడ'లో స్కూల్ డేస్ నుంచి సంతోష్ ( విరాజ్) ఆనంద్ .. శ్రీకాంత్ .. గణేశ్ .. మంచి స్నేహితులు. చిన్నప్పుడు చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోయినా, ఆటపాటల్లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఒకానొక సందర్భంలో మిగతా ముగ్గురు మిత్రులకు సంతోష్ దూరమైపోతాడు. సంతోష్ కి వైశాలి(యశశ్రీ రావు)తో పెళ్లి కుదురుతుంది. స్కూల్ డేస్ నుంచి మొదలైనవారి ప్రేమ ఫలిస్తుంది. అప్పట్లో ఆ స్కూల్ కి ప్రిన్సిపాల్ గా ఉన్న రఘునాథ్ ( ప్రియదర్శిని రామ్) కూతురే వైశాలి.
స్కూల్ డేస్ లో చాలా ఆకతాయిగా ఉండే సంతోష్ .. అతని స్నేహితులపై రఘునాథ్ మాస్టర్ కి అస్సలు సదభిప్రాయం ఉండేది కాదు. అందువలన సంతోష్ తో వైశాలి పెళ్లికి అతను అయిష్టంగానే ఒప్పుకుంటాడు. అతను మారిపోయాడని కూతురు పదే పదే చెప్పడంతో కాదనలేకపోతాడు. అయితే చివరి నిమిషం వరకూ సంతోష్ ను పరీక్షించాలనే అతను నిర్ణయించుకుంటాడు. పెళ్లికి మూడు రోజుల ముందు ఊరుదాటి వెళ్లొద్దని వైశాలితో సంతోష్ కి చెప్పిస్తాడు.
అయినా సంతోష్ వినిపించుకోకుండా తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం కారులో 'గోవా' బయల్దేరతాడు. మార్గమధ్యంలో ప్రమాదం జరగడంతో, మిగతావాళ్లు సంతోష్ ను హాస్పిటల్ లో చేరుస్తారు. అతను గతం మరిచిపోయాడని చెబుతాడు డాక్టర్. ఆ మాట వినగానే స్నేహితులు .. పేరెంట్స్ షాక్ అవుతారు. తాము పక్కనే ఉంటూ సంతోష్ కి గతాన్ని గుర్తుచేయాలని ఫ్రెండ్స్ భావిస్తారు. సంతోష్ పరిస్థితిని చెప్పకుండా వైశాలితో అతని పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుంటారు. సంతోష్ తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తారు.
సంతోష్ కి గతం గుర్తుకు వస్తుందా? వైశాలి దగ్గర .. ఆమె తండ్రి దగ్గర ఆ నిజాన్ని దాచడానికి స్నేహితులు .. పేరెంట్స్ ఎలాంటి ఇబ్బందులు పడతారు? సంతోష్ - వైశాలి పెళ్లి జరిపించడం కోసం వాళ్లంతా కలిసి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అనేది మిగతా కథ.
కాకినాడ .. నలుగురు స్నేహితులు .. స్కూల్ డేస్ లో వాళ్లు చేసే ఆకతాయి పనులు .. పెళ్లికి వారం రోజుల ముందు జరిగిన ఒక ప్రమాదంలో ఒక స్నేహితుడు గతాన్ని మరిచిపోవడం .. అతనికి గతాన్ని గుర్తుచేయడానికి ఆ స్నేహితులంతా ట్రై చేయడం .. జరిగిన సంఘటనను దాచేసి అతని పెళ్లి జరిపించే ఆలోచన చేయడం .. ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎదురైన సవాళ్లు ఎలాంటివి? అనే ప్రధానమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథ ఇది.
చిన్నప్పటి నుంచి సంతోష్ ను ప్రేమిస్తున్న వైశాలి .. అతనితో ఏడడుగులు వేయడానికి ఉన్న సమయం వారం రోజులే. సంతోష్ అంటే ఏ మాత్రం మంచి అభిప్రాయం లేని ఆమె తండ్రి, ఏ మాత్రం చిన్న రీజన్ దొరికినా ఆ పెళ్లిని ఆపేసే ఆలోచనలో ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఒక చేదు నిజాన్ని అతనికి తెలియకుండా మేనేజ్ చేయడం ఎలా సాధ్యం అనే ఒక కుతూహలాన్ని రేకెత్తిస్తూ ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
ఒకరు గతాన్ని మరిచిపోవడం .. గతాన్ని గుర్తుచేయడానికి చుట్టూ ఉన్నవారు ప్రయత్నించడం .. అతను ఉన్న స్థితిని ఇతరులు గమనించకుండా కవర్ చేయడానికి నానా పాట్లు పడటం అనేది ఆల్రెడీ గతంలో చాలామంది టచ్ చేసిన కంటెంట్ అనే చెప్పాలి. ఈ తరహా కంటెంట్ ను ఎక్కువగా కామెడీని పండించడం కోసం ఆయా దర్శకులు వాడుకున్నారు. ఈ సిరీస్ విషయంలోనూ అదే పద్ధతిని అనుసరించడం కనిపిస్తుంది.
కథ పాతదే అయినా కథనంతో కొంతవరకూ దర్శకుడు ఆసక్తిని రేకెత్తించాడనే చెప్పాలి. సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు .. ఆవిష్కరించిన విధానం కూడా చాలా సహజంగా అనిపిస్తాయి. అయితే ఈ తరహా కంటెంట్ లో, సంతోష్ మెమెరీ లాస్ ను కవర్ చేసే వైపు నుంచి రాసుకున్న కామెడీ బలంగా లేకపోవడం కనిపిస్తుంది. అలాగే టీనేజ్ నుంచి కూడా సంతోష్ - వైశాలి మధ్య ఉన్న లవ్ లో గాఢతను చూపించలేకపోయారు.
స్నేహితులు .. స్కూల్ డేస్ .. టీనేజ్ .. ఆకతాయి పనులు .. వేసవి సెలవులలో అమ్మమ్మ తాతయ్యల దగ్గర గడపడం .. మొదలైన సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. ఆ రోజులలోకి తీసుకుని వెళతాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ లో స్నేహితులు చేసిన త్యాగాలతో కూడిన ఎమోషన్స్ కూడా మనసును భారం చేస్తాయి. రోహిణి హట్టంగడి .. శుభలేఖ సుధాకర్ వంటి ఆర్టిస్టులు ఈ సిరీస్ కి మరింత నిండుదనాన్ని తీసుకొచ్చారు. శివన్నారాయణ కామెడీ కాస్త రిలీఫ్ ను ఇస్తుంది.
నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కథకి .. సన్నివేశాలకు తగిన లొకేషన్స్ ప్లస్ అయ్యాయి. వినోద్ గాలి స్క్రీన్ ప్లే - టేకింగ్ ఆకట్టుకుంటాయి. రహీమ్ షేక్ ఫొటోగ్రఫీ .. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం .. శ్రీధర్ - వెంకటేశ్ ఎడిటింగ్ మంచి మార్కులు కొట్టేస్తాయి. సంభాషణలు సహజత్వానికి మరింత బలాన్ని ఇచ్చాయి.
అమాయకత్వం .. ఆకతాయితనం .. తొందరపాట్లు .. పొరపాట్లు .. ఎడబాట్లు .. ఇలా అనేక రకాల దశలకి సంబంధించిన అనుభూతులను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుంది. స్నేహంతో ప్రేమను గెలవడం .. తప్పును ఒప్పుకుని చుట్టూ ఉన్నవారి మనసులు గెలవడం అనే కాన్సెప్ట్ తో ఈ కథ సాగుతుంది. స్నేహం కోసం నిలబడటం .. స్నేహితుడిని నిలబెట్టడం అనే ఒక సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది. కొన్ని అంశాల విషయంలో గాఢత తగ్గినా, ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ ఇది.
'గుర్తుకొస్తున్నాయి' (ఈటీవీ విన్) సిరీస్ రివ్యూ!
Gurthukosthunnayi Review
Movie Details
Movie Name: Gurthukosthunnayi
Release Date: 2026-07-05
Cast: Viraj Ashwin, Yashasri, Priyadarshini Ram, Shivannarayana, Pavan Siddhu, Godavari Gopi
Director: Wonod Gali
Music: Ajay Arasada
Banner: 90s Kids Entertainments
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer