సూర్య కథానాయకుడిగా తమిళంలో నటించిన సినిమానే 'కరుప్పు'. తెలుగులో ఈ సినిమాను 'వీరభద్రుడు' టైటిల్ తో విడుదల చేశారు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. 130 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 300 కోట్లకి పైగా వసూలు చేయడం విశేషం. త్రిష .. ఆర్జే బాలాజీ ..శ్వాసిక కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి తమిళంతో పాటు ఇతర భాషల్లోను 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
  
మునుస్వామి (ఇంద్రన్) తన కూతురు 'మీను' (అనఘ మాయ)ను వెంటబెట్టుకుని సిటీకి వస్తాడు. ఆమె లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. లివర్ మార్పిడికి పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతారు. అందువలన అతను తన దగ్గరున్న 60 సవర్ల బంగారాన్ని బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకోవడం కోసం వస్తాడు. అయితే అతను ట్రైన్ దిగగానే దొంగలు ఆ నగలు కొట్టేసి పారిపోతారు. దాంతో తండ్రీ కూతుళ్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. 

పోలీసులు 45 సవర్ల బంగారాన్ని మాత్రమే రికవరీ చేయగలుగుతారు. ఆ నగలను కోర్టు ద్వారా తీసుకోమని చెబుతారు. ఆ కేసును లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) తీసుకుంటాడు. కేసును ఎటూ తేల్చకుండానే బేబీ కృష్ణ టీమ్ తమ టిఫిన్ బిల్లులను మునుస్వామితో కట్టిస్తుంటారు. అలా 4 నెలలు గడిచిపోతుంది. 'మీను' ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది. అయినా తన బంగారం తన చేతికి రాకపోవడంతో మునుస్వామి విసిగిపోతాడు.

కోర్టుకి సమీపంలో ఒక వీరభద్రస్వామి గుడి ఒకటి ఉంటుంది. స్వామికి మనసులో మాట చెప్పుకుంటే, తప్పకుండా నెరవేరుతుందని మునుస్వామి వింటాడు. తన కూతురును కాపాడమని వేడుకుంటాడు. దాంతో నేరుగా వీరభద్రుడు (సూర్య) రంగంలోకి దిగుతాడు. నేరుగా బేబీ కృష్ణకి కనిపించి, పద్ధతి మార్చుకోమని హెచ్చరిస్తాడు. దేవుడిలా అతీత శక్తులు చూపించకుండా, కోర్టుకు వచ్చి 'మీను'కి న్యాయం చేసి చూడమని అతను వీరభద్రుడికి సవాల్ విసురుతాడు. అప్పుడు వీరభద్రుడు ఏం చేస్తాడు? అవినీతి పరులపై ఎలా విరుచుకుపడతాడు? అనేది కథ.


సాధారణంగా ఎవరి చేతిలోనైనా మోసపోయినప్పుడు,మోసం చేసినవారికి తగిన గుణపాఠం చెప్పడానికి దేవుడు దిగివస్తే బాగుండునని చాలామంది అనుకుంటారు. మోసం చేసినవాళ్లు, తమని శిక్షించడానికి దేవుడు దిగివస్తాడా ఏంటి? అని నవ్వుకుంటారు. అయితే నిజంగానే దేవుడు దిగి వస్తే ఎలా ఉంటుందనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఆ దేవుడు కూడా ఒక మనిషి మాదిరిగానే ఎలా పరిస్థితులను చక్కదిద్దగలిగాడు? అనే కుతూహలాన్ని రేకెత్తిస్తూ మలుపులు తీసుకుంటుంది. 

ఈ కథ అంతా కూడా కోర్టు .. లాయర్ల చుట్టూ తిరుగుతుంది. కోర్టుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది .. దేవుడు దిగివచ్చినా దానిని మార్చలేడు. మహిమలు లేకుండా మనిషిగా వచ్చి కోర్టు పరిథిలో న్యాయం జరిగేలా చూడమని కథానాయకుడిని   ప్రతినాయకుడు సవాల్ చేయడమే ఈ కథలోని కీలకమైన మలుపుగా చెప్పుకోవాలి. శిక్షించడానికి వచ్చిన దేవుడికి పరీక్ష పెట్టడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

లాయర్ గా వీరభద్రుడు కోర్టుకు రావడం .. 'మీను' కేసును పరిష్కరించడం వరకూ బాగానే ఉంటుంది. ఆ తరువాత వీరభద్రుడి ప్రభావం కారణంగా, అసత్యాలు చెప్పాలనుకున్నవారు సైతం మాట తడబడిపోయి నిజాలు చెబుతూ ఉంటారు. దాంతో చకచకా కేసులు పరిష్కారమవుతూ ఉంటాయి. ఇక్కడే గ్రాఫ్ పడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించిన సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

తండ్రీ కూతుళ్లు లాయర్ల ఉచ్చులో చిక్కుకోవడం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది. న్యాయమూర్తులు .. న్యాయవాదులు .. పోలీసులు .. రౌడీలు కుమ్మక్కయితే ఒక సామాన్యుడికి ఆ దేవుడే దిక్కు అనే పాయింట్ ను టచ్ చేస్తూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. దేవుడైనా సరే దిగివస్తే, మనుషుల చేతిలో మోసపోవలసిందే అనే విషయాన్ని ఆవిష్కరించిన విధానం మెప్పిస్తుంది. కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తి కన్నీరు దొంగలను కదిలించి వేస్తుంది గానీ, పోలీసులు .. లాయర్ల హృదయాలను కరిగించలేపోవడమనే సీన్ హైలైట్ గా నిలుస్తుంది.

ఈ సినిమాలో ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. అది ఏంటంటే హీరో సూర్య ఎంట్రీ, మొదటి అరగంట దాటిన తరువాతనే ఉంటుంది.ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లాయర్ వీరభద్రుడుగా వచ్చింది సాక్షాత్తు దేవుడని తెలిసిన ఆ విషయాన్ని విలన్ ఈజీగా తీసుకోవడం. ఇక వీరభద్రుడు .. ప్రీతీ ద్వారా పరిష్కరించే రెండో కేసుకు సంబంధించిన సీన్ అంతగా ఇంపాక్ట్ చూపలేకపోయింది.


ఎలాంటి అండదండలు లేనివారు తమకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు పోలీసులను .. న్యాయవాదులను ఆశ్రయించవలసి వచ్చినప్పుడు, వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనేది దర్శకుడు చూపించిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. విష్ణు ఫొటోగ్రఫీ .. సాయి అభ్యంకర్ నేపథ్య సంగీతం . కలైవానన్ ఎడిటింగ్ ఫరవాలేదు. 

వీరభద్రుడిగా సూర్య లుక్ .. వీరభద్రస్వామి నేసథ్యంలో వచ్చే సీన్స్ .. అందుకు సంబంధించిన గ్రాఫిక్స్ .. తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్  ప్రేక్షకులను  ఆకట్టుకుంటాయి. కొన్ని సీన్స్ వాస్తవానికి చాలా దగ్గరగా వెళితే, మరికొన్ని సన్నివేశాలు చాలా తేలికగా తేలిపోతూ ఉంటాయి. బలమైన కొన్ని సన్నివేశాలు మాత్రమే బాగున్నాయని అనిపిస్తుంది అంతే.