తెలుగు నుంచి ఇప్పుడు ఒక సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సిరీస్, ఈ నెల 22వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ లో, నాగబాబు .. గెటప్ శ్రీను .. రవితేజ ప్రధానమైన పాత్రలను పోషించారు. బీవీఎస్ రవి నిర్మించిన ఈ సిరీస్ కి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు.

అది గోదావరి జిల్లా పరిధిలోని 'మహాదేవపట్నం' అనే గ్రామం. ఆ గ్రామంలో పెద్దమనిషిగా గజపతిరాజు (నాగబాబు)కి మంచి పేరు ఉంటుంది. ఆయన కూతురే సంఘవి. సంక్రాంతి పండగకి కోడి పందాలలో పాల్గొనడమనేది గజపతిరాజు పూర్వీకుల నుంచి ఉంది. అదే ఆనవాయితీని ఆయన కొనసాగిస్తూ ఉంటాడు. ఆ ఏడాది కూడా 'సలార్ రాజు' అనే పేరుగల తన కోడిపుంజును బరిలోకి దింపడానికి ఆయన ప్రయత్నాలు చేస్తుంటాడు. 

ఈ నేపథ్యంలోనే ఆ ఊరి పోలీస్ స్టేషన్ లో తన జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి కానిస్టేబుల్ మోహన్ (గెటప్ శ్రీను) వస్తాడు. అక్కడ ఎస్.ఐ.గా ఉన్నది తన బాల్యమిత్రుడు రవి (రవితేజ) కావడంతో హ్యాపీగా ఫీలవుతాడు. ఇక అప్పటి నుంచి ప్రతి కేసును ఇద్దరూ కలిసి డీల్ చేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది. గజపతిరాజుకి పోటీగా తమ పుంజులను బరిలోకి వదలాలనే ఆలోచనలో, ఒక వైపున మహిపాల్ రెడ్డి (కమల్) .. మరో వైపున సుధాకర్ - గౌరీ అనే బావమరుదులు సిద్ధమవుతారు.

మహిపాల్ రెడ్డికి .. గజపతిరాజుకి అస్సలు పడదు. కానీ మహిపాల్ కొడుకు ఆకాశ్ .. గజపతి కూతురు సంఘవి ప్రేమించుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులలోనే గజపతిరాజు పందెం కోడిపుంజు 'సలార్ రాజు' కనిపించకుండా పోతుంది. అందుకు కారకులు ఎవరనేది కనుక్కునే బాధ్యత రవి - మోహన్ పై పడుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ను మొదలుపెట్టిన వాళ్లకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ.              

'మహాదేవపట్నం'లో గజపతిరాజు అనే పెద్దమనిషి పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ కథ మొదలవుతుంది. ఆయన పెద్దరికానికి భయపడటమే కాదు, అసూయపడేవారిగా సుధాకర్ - మహిపాల్ కనిపిస్తూ ఉంటారు. పోలీసులైన రవి - మోహన్ ఇద్దరూ కూడా గజపతికి భయపడుతూనే రోజులు నెట్టుకొస్తుంటారు. ఈ మూడు వైపుల నుంచి ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. 

ఇక ఈ ఊరుకి దూరంగా ఒక అజ్ఞాత వ్యక్తి తన అనుచరులతో కలిసి ఏదో ప్లాన్ చేస్తూ ఉంటాడు.  మహాదేవపట్నంలో జరిగే కోడి పందాల గురించి .. ఆ న్యూస్ ను కవర్ చేస్తున్న 'మీనాక్షి' (రీతూ చౌదరి)ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లు ఎవరు? ఏం చేయబోతున్నారు? అనేది మరో వైపు నుంచి ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతూ వెళుతుంది. ఆ దిశగా వాళ్లను ఆలోచింపజేస్తూ ఉంటుంది. 

విలేజ్ నేపథ్యం .. పెద్ద మనిషిగా నాగబాబు .. ఆయనంటే పడని వర్గం .. అమాయకత్వం - మంచితనం కలిసిన ఇద్దరు పోలీసులు .. శత్రువుల పిల్లల మధ్య లవ్ వ్యవహారం .. ఇవన్నీ కుతూహలాన్ని రేకెత్తించే అంశాలే. అయితే ఆ స్థాయిలో ఆవిష్కరణ జరగలేదని అనిపిస్తుంది. అవసరం లేని సన్నివేశాలు .. అంతగా కామెడీ పండని సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. మొదటి రెండు ఎపిసోడ్స్ మరింత పేలవంగా అనిపిస్తాయి.

పందెం కోడిని వెతుకుతూ జనమంతా బయల్దేరిన సమయంలో, కథలోకి మరో కొత్త అంశం వచ్చి చేరుతుంది. పోనీ ఆ వైపు నుంచి ఏమైనా రక్తి కట్టించగలిగారా అంటే, అది కూడా చాలా మొక్కుబడిగా .. నాటకీయంగా అనిపిస్తుంది. ఇక పసుపు ప్యాకెట్లు .. 'అబ్బా' అసోసియేషన్ హడావిడి .. రక్తపు వాంతులు వంటి అనవసరమైన సన్నివేశాలు అసహనాన్ని కలిగిస్తాయి. పందెం కోడి పుంజులకు ప్రభాస్ సినిమాల పేర్లు పెట్టడం బాగుంది.  
          
ప్రధానమైన  పాత్రధారులంతా చాలా బాగా చేశారు. కాకపోతే నాగబాబు పాత్రను ఇంకాస్త పవర్ఫుల్  గా డిజైన్ చేయవలసింది. మహిపాల్ రెడ్డి - సుధాకర్ పాత్రలకు మంచి ఆర్టిస్టులను తీసుకున్నారు. కానీ వాళ్లను ఉపయోగించుకోలేకపోయారు. కథాకథనాలు .. పాత్రలను డిజైన్ చేసే విషయంలో ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. ఫోటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ పరంగా చెప్పాలంటే కొన్ని సీన్స్ కు కత్తెర పడుతుంది. నేపథ్య సంగీతం అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. విలేజ్ లొకేషన్స్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయని చెప్పచ్చు.