మొదటి నుంచి కూడా ఈటీవీ సకుటుంబంగా చూడదగిన సినిమాలను .. సిరీస్ లను అందిస్తూ వస్తోంది. కుటుంబాన్ని కేంద్రంగా చేసుకుని సాగే బంధాలు - అనుబంధాలకు సంబంధించిన కథలను అందంగా ఆవిష్కరిస్తోంది. అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన సిరీస్ 'మా ఇంటికథ'. శ్రావణ్ దాములూరి దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ఈ నెల 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 6 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

అది 'వైజాగ్' కి సమీపంలోని ఒక విలేజ్. అక్కడ సామ్రాట్ (రోహిత్ సత్యన్) టైలరింగ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. భార్య శివమ్మ (అనూష నూతుల) పెద్ద కొడుకు సూర్య .. చిన్న కొడుకు శ్యామ్ .. ఇదే అతని కుటుంబం. సూర్య టీనేజ్ లో ఉంటాడు .. శ్యామ్ మాత్రం 5వ క్లాస్ చదువుతుంటాడు. టైలరింగ్ లో సామ్రాట్ కి మంచి పేరు ఉంటుంది. అందువలన అతని దగ్గరే కుట్టించుకోవడానికి అందరూ ఆసక్తిని చూపుతుంటారు. అతనికి శివమ్మ సాయపడుతూ ఉంటుంది.

 సామ్రాట్ తన సొంత అక్కయ్య ద్వారా 'చీటీ' కడుతుంటాడు. ఆ డబ్బు రాగానే బ్యాంకులో తాకట్టులో ఉన్న తన భార్య నగలు విడిపించాలనేది అతని కోరిక. ఇక ఇద్దరు  పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చదివించే స్థోమత లేని కారణంగా, శ్యామ్ ను మాత్రం ప్రైవేట్ స్కూల్ లో చేర్పిస్తాడు. అతను క్రికెట్ ఆడుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. ఈ కారణాలుగా తల్లిదండ్రులు తనని పట్టించుకోవడం లేదని సూర్య చిన్నబుచ్చుకుంటాడు. 

అలాంటి పరిస్థితులలోనే శివమ్మ తన బంధువుల ఇంట్లో పెళ్లికి భర్తను తీసుకుని వెళుతుంది. దాంతో సూర్య - శ్యామ్ మాత్రమే ఇంటి దగ్గర ఉండిపోవలసి వస్తుంది. సూర్యకి తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్వేచ్ఛ లభించినట్టు అవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? ఆ పేరెంట్స్ కన్న కలలు ఫలిస్తాయా? అనేది మిగతా కథ.

మధ్యతరగతి కుటుంబాన్ని పోషించేవాడు, మహాసముద్రాన్ని ఈజీగా ఈదగలడు అని ఒక కవిగారు సెలవిచ్చాడు. మధ్యతరగతి జీవితం మరో మహాభారతమే అనుకోవాలి. ఇంటి ఖర్చులు .. స్కూల్ ఫీజులు .. అనుకుని వచ్చే పండుగలు .. అనుకోకుండా వచ్చే ఆహ్వానాలు .. ముందుచూపుతో వేసే చీటీలు. ఇవన్నీ కూడా మధ్యతరగతి జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అలాంటి అంశాల చుట్టూనే దర్శకుడు ఈ కథను నడిపించాడు. 

మధ్యతరగతి పేరెంట్స్ కలలు కూడా పిల్లల గురించే కంటారు .. పిల్లల కోసమే కంటారు. ఆ కలలను నిజం చేసుకోవడానికి పరుగు మొదలెడతారు. సమానంగా పరిగెత్తలేక ఒకరిపై ఒకరు చిటపడలాడతారు. ఆవేశాలు తగ్గగానే సారీలు చెప్పుకుని సర్దుకుపోతారు. అలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు. సమస్యలు .. సంతోషాలు .. గొడవలు .. అలకలు .. వీటన్నింటినీ కలుపుకుంటూ ఈ కథ ముందుకు వెళుతుంది. 

ఈ కథ మొత్తంలో తల్లిదండ్రులు .. ఇద్దరు పిల్లలు. ఈ నాలుగు ప్రధానమైన పాత్రలతోనే ఈ కథ నడుస్తుంది. ఈ కథ అలా ముందుకు వెళుతున్నా కొద్దీ ఎక్కడైనా ఏదైనా మలుపు తిరుగుతుందేమో అని ఆడియన్స్ ఎదురు చూస్తూ కూర్చుంటారు.  ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ మూడ్ లో ఉంది .. ఏమౌతుందో ఏమిటో? అనుకుంటారు. కానీ ఎంత  తాపీగా ఈ కథ మొదలవుతుందో .. అంతే సాఫీగా పూర్తవుతుంది. 'మా ఇంటి కథ'కి సంబంధించిన ఈ మొత్తం ప్రయాణంలో, మనకి 'ఇల్లు' తప్ప అందులో ఎక్కడా కథ కనిపించదు. 

భార్యాభర్తల సరసాలు .. అలకలు .. బుజ్జగింపులు .. పిల్లల కీచులాటలు పొద్దున్న లేస్తే అందరి ఇళ్లలో కనిపించేవే. అయితే సినిమాగా చెప్పాలనుకున్నప్పుడు వాటన్నింటినీ కలుపుతూ ఒక బలమైన కారణం ఉండాలి .. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండాలి. అవేమీ లేకుండా చేసిన ఒక ప్రయత్నమిది. అవసరాల శ్రీనివాసరావు తన గతాన్ని తలచుకోవడంతో మొదలయ్యే ఈ కథలో ఏముంది? దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? ఆయన ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్న వేసుకుంటే అందుకు సమాధానం మాత్రం కనిపించదు. 

ఆర్టిస్టులు ఆయా పాత్రలలో జీవించినప్పుడే ఆ సన్నివేశాలు మనకి కనెక్ట్ అవుతాయి. పేరెంట్స్ పాత్రలు పోషించినవారు మినహా, మిగతా పాత్రలు పోషించినవారి నుంచి సరైన అవుట్ పుట్ తీసుకోలేదు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. లోతైన ఎమోషన్స్ లేకపోవడం వలన .. పాత్రధారులు ఇన్వాల్వ్ కాకపోవడం వలన సన్నివేశాలు కనెక్ట్ కావు. బలమైన కథాకథనాలు లేకపోవడం వలన, సహజంగానే క్లైమాక్స్ కూడా వీక్ గానే అనిపిస్తుంది. 

మధ్యతరగతి జీవితాలను హృద్యంగా ఆవిష్కరించాలనే ఒక ప్రయత్నం బాగానే ఉంది. అయితే అందుకు తగిన ఆసక్తికరమైన అంశాలను జోడించకపోవడం వలన, తేలికపాటి సన్నివేశలతో తేల్చేయడం వలన ఈ కంటెంట్ నిరాశ పరుస్తుంది.