భారత్‌ను విచ్ఛిన్నం చేయాలనుకునేవారి ఆటలు సాగవు.. ‘సర్‌’ నిరసనలపై మోహన్‌ భగవత్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్‌ను విచ్ఛిన్నం చేయాలనుకునేవారి ఆటలు సాగవు.. ‘సర్‌’ నిరసనలపై మోహన్‌ భగవత్‌

Mohan Bhagwat says those trying to break India will not succeed regarding SIR protests
  • ప్రభుత్వ మార్పుతోనే సమస్యలు పరిష్కారం కావన్న మోహన్‌ భగవత్‌
  • భారత్‌ను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు ఫలించవని స్పష్టీకరణ
  • భారత అభివృద్ధిని అడ్డుకోవాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని ఆరోపణ
  • నిరసనలు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచన
  • ఆందోళనలు రాజ్యాంగం, చట్టాల పరిధిలోనే జరగాలని పిలుపు
  • నిరసనలు సమాజంలో విద్వేషాలు, విభజనలకు దారితీయకూడదని వ్యాఖ్య
ప్రభుత్వాన్ని మార్చితే దేశంలో పరిస్థితులు మారిపోతాయనుకోవడం సరికాదని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. భారత్‌ను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించే శక్తుల ఆటలు సాగబోవని వ్యాఖ్యానించారు. దేశంలో సమస్యల పరిష్కారం కోసం జరిగే నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమేనని, అయితే అవి సమాజంలో విద్వేషాలు, విభేదాలకు దారితీయకూడదని సూచించారు.

విజయదశమి సందర్భంగా మంగళవారం నాగ్‌పుర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ వార్షిక సభలో భగవత్‌ ప్రసంగించారు. సంఘ్‌ శతాబ్ది ఏడాది కార్యకలాపాలతో పాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు. ప్రభుత్వ మార్పుతోనే పరిస్థితులు మారిపోతాయనే భావన గతంలోనూ నిజం కాలేదని, ఇప్పుడూ అలాంటి అంచనాలు సరికావని పేర్కొన్నారు.

భారత్‌ పురోగతిని అడ్డుకోవాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని భగవత్‌ ఆరోపించారు. గత కొన్ని దశాబ్దాలుగా దేశం అనుసరిస్తున్న విధానాలతో ముందుకు సాగుతోందని, అందుకే భారత్‌ను, ఆర్‌ఎస్‌ఎస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలోనూ కొందరు రాజకీయ నేతలు ఇలాంటి ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఫ్రాన్స్‌, అల్బేనియా, బంగ్లాదేశ్‌, నేపాల్‌ పరిణామాలను ప్రస్తావిస్తూ ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలు, సంస్కృతి, మానవీయ విలువలకు సవాళ్లు ఎదురవుతున్నాయని అన్నారు.

దేశంలో సమస్యలు ఉన్నప్పుడు ప్రజలు నిరసనలు చేపట్టడం సహజమేనని భగవత్‌ అన్నారు. అయితే ఆందోళనల లక్ష్యం సమస్యలకు పరిష్కారాలు కనుగొనడమే కావాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రేరేపించే నిరసనలు ఉద్రిక్తతలు పెంచి, ప్రజాజీవనానికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

నిరసనకారులు, శాంతిభద్రతలను పర్యవేక్షించే అధికారులు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే సమాజంలో ద్వేషం, కక్షలు, విభజనలకు కారణం కాకూడదని స్పష్టం చేశారు. భావోద్వేగాలు ఎంత తీవ్రంగా ఉన్నా రాజ్యాంగం, చట్టం, సామాజిక మర్యాదల పరిధిలోనే వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో భగవత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ అంశంపై ఢిల్లీలో జరుగుతున్న నిరసనలను సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఇటీవల ప్రభుత్వ మార్పు కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు.
Advertisement
Mohan Bhagwat
RSS
Vijayadashami Speech
National Unity
SIR Protests
Rashtriya Swayamsevak Sangh

More Telugu News