పంటలు ఎండిపోయాక కమిటీలా?: కేబినెట్ ఉపసంఘంపై దాసోజు శ్రవణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పంటలు ఎండిపోయాక కమిటీలా?: కేబినెట్ ఉపసంఘంపై దాసోజు శ్రవణ్

Dasoju Sravan slams Cabinet Sub committee for forming after crops dried up
  • కరవుపై ప్రభుత్వం వేసిన కేబినెట్ ఉపసంఘంపై దాసోజు శ్రవణ్ విమర్శలు
  • ఆర్నెల్లుగా ప్రభుత్వం కుంభకర్ణ నిద్ర పోయిందని మండిపాటు
  • ఇది బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నమేనని వ్యాఖ్య
తెలంగాణలో ఎల్‌నినో, కరవు పరిస్థితులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ ఉపసంఘంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది కేవలం కాలయాపన చేయడానికి, బాధ్యత నుంచి తప్పించుకోవడానికి వేసిన ఎత్తుగడ అని ఆయన ఆరోపించారు. పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్న తరుణంలో కమిటీ వేసి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. "ఎల్‌నినో ముప్పు గురించి ఏప్రిల్‌లోనే హెచ్చరికలు వస్తే.. ఆరు నెలల పాటు కుంభకర్ణ నిద్రపోయి, ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తే ఏం ఉపయోగం?" అని శ్రవణ్ ఆ లేఖలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఆరు నెలలుగా ఏమీ చేయకుండా ఉండిపోవడం నేరపూరిత నిర్లక్ష్యమేనని ఆయన దుయ్యబట్టారు.

రాష్ట్రంలో కరవు, ఎల్‌నినో పరిస్థితులను పర్యవేక్షించి, నివారణ చర్యలు సిఫార్సు చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా ఆరుగురు మంత్రులతో ప్రభుత్వం సోమవారం నిన్న కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వడం, కేంద్ర సాయం కోరడం వంటి అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది.

అయితే, ఏర్పాటు చేసిన కమిటీకి ఎలాంటి కాలపరిమితి విధించకపోవడం, నిధులు కేటాయించకపోవడంపై కూడా శ్రవణ్ అభ్యంతరం తెలిపారు. కరువు సహాయక చర్యల కోసం తక్షణమే అసెంబ్లీ, మండలిని ప్రత్యేకంగా సమావేశపరిచి, రూ.20,000 కోట్ల అనుబంధ బడ్జెట్‌ను ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement
Dasoju Sravan
Telangana Drought
Revanth Reddy
El Nino Impact Telangana
BRS Party
Telangana Cabinet Sub Committee

More Telugu News