బొత్స సొంత అడ్డాలో వైసీపీకి భారీ షాక్.. సామూహికంగా నేతల రాజీనామా!

బొత్స సొంత అడ్డాలో వైసీపీకి భారీ షాక్.. సామూహికంగా నేతల రాజీనామా!

Botsa Satyanarayana stronghold Cheepurupalli faces major shock as YSRCP leaders resign
  • బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ
  • మెరకముడిదాం మండలంలో సామూహికంగా రాజీనామా చేసిన నేతలు
  • పార్టీని వీడిన వారిలో మండల అధ్యక్షుడు, 13 గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు
  • బొత్స మేనల్లుడు చిన్న శ్రీను బాటలోనే పయనిస్తామని వెల్లడి
  • త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించిన నేతలు
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మెరకముడిదాం మండలంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు సామూహికంగా రాజీనామా చేశారు. దీంతో స్థానిక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

వివరాల్లోకి వెళితే.. మెరకముడిదాం వైసీపీ మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావుతో పాటు 13 గ్రామాలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నేతలు ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా లేఖలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపుతున్నట్లు వారు తెలిపారు.

ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను తామంతా అనుసరిస్తామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. త్వరలోనే వారంతా టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా చీపురుపల్లికి చెందిన ఓ మాజీ జెడ్పీటీసీ దంపతులు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

2029 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచే పోటీ చేస్తానని బొత్స సత్యనారాయణ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే పార్టీ సంస్థాగత నిర్మాణం బలహీనపడటం వైసీపీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. ఈ వరుస రాజీనామాలు రానున్న రోజుల్లో నియోజకవర్గ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
Advertisement
Botsa Satyanarayana
Cheepurupalli YSRCP resignations
YSRCP leaders join TDP
Majji Srinivasa Rao
Andhra Pradesh politics
Merakamudidam YSRCP crisis

More Telugu News