గుజరాత్ నుంచి హిల్సా చేపల దిగుమతిపై బంగ్లాదేశ్ యూటర్న్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుజరాత్ నుంచి హిల్సా చేపల దిగుమతిపై బంగ్లాదేశ్ యూటర్న్

Bangladesh U-turn on Hilsa fish imports from Gujarat
  • భారత్ నుంచి హిల్సా చేపల దిగుమతులను ఆకస్మికంగా నిలిపివేసిన బంగ్లాదేశ్
  • సుమారు 103 దిగుమతి అనుమతులను రద్దు చేసిన బంగ్లా ఫిషరీస్ శాఖ
  • అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడించని ప్రభుత్వం
  • భారీ నష్టాల్లో బంగ్లాదేశ్ దిగుమతిదారులు, భారత్‌లో నిలిచిపోయిన నిల్వలు
  • దుర్గా పూజకు పులసల ఎగుమతిపైనా అలుముకున్న అనిశ్చితి
భారత్ నుంచి హిల్సా చేపల దిగుమతి విషయంలో బంగ్లాదేశ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. దిగుమతులను ప్రారంభించిన కొద్ది రోజులకే వాటిని ఆకస్మికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 23న బంగ్లాదేశ్ ఫిషరీస్ విభాగం సుమారు 103 నిరభ్యంతర పత్రాలను (NOCs) రద్దు చేసింది. అయితే, ఈ ఆకస్మిక నిర్ణయానికి గల కారణాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. ఈ పరిణామం ఇరు దేశాల మత్స్య వాణిజ్యంలో గందరగోళానికి దారితీసింది.

ఇండియా టుడే కథనం ప్రకారం, బంగ్లాదేశ్ ఫిషరీస్ విభాగం యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఎండీ ఖలీద్ కనక్ ఈ రద్దు ఉత్తర్వులపై సంతకం చేశారు. వాస్తవానికి, ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 1,739 టన్నుల హిల్సా చేపల దిగుమతికి బంగ్లాదేశ్ అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు సుమారు 535 మెట్రిక్ టన్నుల చేపలు బెనపోల్-పెట్రాపోల్ సరిహద్దు ద్వారా దిగుమతి అయ్యాయి. ప్రపంచంలోనే హిల్సా చేపలను అత్యధికంగా ఉత్పత్తి చేసే బంగ్లాదేశ్, తొలిసారిగా భారత్ నుంచి వాటిని దిగుమతి చేసుకోవడం గత వారం వార్తల్లో నిలిచింది. గుజరాత్‌లోని భరూచ్ నుంచి ఈ చేపలను దిగుమతి చేసుకుంటున్నారు.

ప్రభుత్వం కారణాలు చెప్పనప్పటికీ, ఈ నిషేధం వెనుక పలు అంశాలు ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చౌకగా లభించే గుజరాత్ హిల్సాను, అత్యంత ఖరీదైన స్థానిక 'పద్మ' హిల్సాగా పేర్కొని అమ్మకాలను అరికట్టడం, అండర్-ఇన్వాయిసింగ్ ద్వారా జరిగే మనీ లాండరింగ్‌ను నిరోధించడం, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం వంటివి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిల్సా ఉత్పత్తి 2022లో 5.71 లక్షల టన్నుల నుంచి 2025 నాటికి 5 లక్షల టన్నులకు పడిపోవడంతో, ధరలు కిలోకు 2,600 టాకాలకు చేరాయి. ఈ నేపథ్యంలోనే చౌకైన భారత హిల్సాకు మార్గం సుగమమైంది.

ఈ ఆకస్మిక నిర్ణయంతో బంగ్లాదేశ్ దిగుమతిదారులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే గుజరాత్‌లో చేపలను కొనుగోలు చేసి, గోదాముల్లో నిల్వ ఉంచిన వ్యాపారులు వాటిని తక్కువ ధరకు తిరిగి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఏటా దుర్గా పూజ సందర్భంగా బంగ్లాదేశ్ 'కానుక'గా భారత్‌కు పంపే పద్మ హిల్సాల ఎగుమతిపై కూడా ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉందని, ఈ సీజన్‌లో ఎగుమతులు జరగకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించాలని కొందరు భారత వ్యాఖ్యాతలు సూచిస్తుండటం గమనార్హం.

కాగా, ఈ హిల్సా చేపలనే పులస అని కూడా అంటారు. ఇవి సముద్రం నుంచి గోదావరి నదిలోకి ప్రవేశించాక వాటిని పులస అని పిలుస్తారు. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. అందుకే పులస చేపలు వలలకు పడితే వేలం వేస్తుంటారు. ఇవి వేలల్లో ధర పలుకుతాయి. 
Advertisement
Bangladesh
Hilsa Fish
India Bangladesh Trade
Gujarat Hilsa Import
Pulasa Fish
Fisheries Department

More Telugu News