ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ఏఐ తుపాను: డిగ్రీ చేతిలో ఉన్నా... ఉద్యోగం కష్టమేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ఏఐ తుపాను: డిగ్రీ చేతిలో ఉన్నా... ఉద్యోగం కష్టమేనా?

AI storm on entry level jobs is it hard to get a job with a degree
  • ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై గోల్డ్‌మన్‌ సాక్స్‌ నివేదిక
  • ప్రపంచవ్యాప్తంగా కాల్ సెంటర్‌ రంగంపై అత్యధిక ప్రభావం 
  • అనుభవజ్ఞుల కన్నా కెరీర్ ప్రారంభించే యువతకే ఏఐతో ఎక్కువ నష్టం
  • భారత్‌లోనూ బ్యాక్-ఆఫీస్, కాల్ సెంటర్ ఉద్యోగాలపై ప్రభావం!
  • ఏఐ నైపుణ్యాలు పెంచుకోవాలని నిపుణుల హెచ్చరిక
కళాశాల నుంచి పట్టా చేత పట్టుకుని, బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు వేయాలని కలలు కనే లక్షలాది మంది యువతకు... కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో ఓ పెద్ద సవాలు ఎదురవుతోంది. మంచి కంపెనీలో తొలి ఉద్యోగం సాధించాలన్న వారి ఆశలకు ఏఐ గండికొడుతోంది. ప్రాథమిక స్థాయి పనుల కోసం కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలు వెనకాడుతున్నాయి. ఈ చేదు నిజాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సంస్థ గోల్డ్‌మన్‌ సాక్స్‌ రీసెర్చ్‌ తన తాజా అధ్యయనంలో కళ్లకు కట్టింది. ఈ నివేదిక కేవలం గణాంకాలను చెప్పడమే కాదు, మారుతున్న ఉద్యోగ ప్రపంచంలో యువతరం ఎదుర్కోబోయే గట్టి పోటీకి అద్దం పడుతోంది.

వికసిత దేశాల్లో మొదలైన ప్రభావం
గోల్డ్‌మన్‌ సాక్స్‌ నివేదిక ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్‌, యూకే, నెదర్లాండ్స్ వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఏఐ వినియోగం ఇప్పటికే 15 నుంచి 20 శాతానికి చేరుకుంది. ఎక్కడైతే ఆటోమేషన్‌కు ఎక్కువ ఆస్కారం ఉందో, ఆయా రంగాల్లో 2022 ద్వితీయార్థం నుంచే కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మందగించింది. జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది.

ఆశ్చర్యకరంగా, ఏఐ ప్రభావం అనుభవజ్ఞులైన ఉద్యోగుల కన్నా కొత్తగా కెరీర్ ప్రారంభించే వారిపైనే ఎక్కువగా ఉంది. సీనియర్లు ఏఐని ఒక సాధనంగా వాడుకుంటూ తమ ఉత్పాదకతను పెంచుకుంటుండగా, ఏ అనుభవం లేని జూనియర్లకు మాత్రం అవకాశాలు మూసుకుపోతున్నాయి.

కుప్పకూలిన కాల్ సెంటర్ ఉద్యోగాలు
ఏఐ ప్రభావానికి అత్యంత ఎక్కువగా గురైన రంగం ఏదైనా ఉందంటే అది కాల్ సెంటర్లే. కస్టమర్ల సాధారణ ప్రశ్నలకు సమాధానాలివ్వడం, డేటాను నమోదు చేయడం వంటి పనులను ఇప్పుడు ఏఐ చాట్‌బాట్‌లు, వాయిస్ ఏజెంట్లు సులువుగా, వేగంగా చేస్తున్నాయి. ఫలితంగా, ఈ రంగంలో మానవ వనరుల అవసరం గణనీయంగా తగ్గింది. దీర్ఘకాలిక అంచనాలతో పోలిస్తే అమెరికాలో కాల్ సెంటర్ ఉద్యోగాలు 39 శాతం, కెనడాలో 33 శాతం, జర్మనీలో 27 శాతం మేర పడిపోయాయి. కాల్ సెంటర్లతో పాటు సాఫ్ట్‌వేర్ పబ్లిషింగ్, మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్, అడ్వర్టైజింగ్ వంటి రంగాల్లోనూ కొత్త నియామకాలు తగ్గాయి.

భారత్‌పైనా తప్పని ప్రభావం
ప్రపంచానికి బ్యాక్-ఆఫీస్‌గా పేరుగాంచిన భారత్‌పైనా ఏఐ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి కాల్ సెంటర్లు, బీపీవో పరిశ్రమల్లోనూ ఉద్యోగాల కోత మొదలైందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గోల్డ్‌మన్‌ సాక్స్‌ అంచనా ప్రకారం, భారత్‌లోని నాన్-ఫార్మ్ రంగంలో 8 నుంచి 12 శాతం ఉద్యోగాలను జెనరేటివ్ ఏఐ భర్తీ చేయగలదు. మరో 42 నుంచి 48 శాతం ఉద్యోగాల పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. ఈ గణాంకాలు భవిష్యత్తులో ఉద్యోగ స్వరూపం ఎలా ఉండబోతోందో సూచిస్తున్నాయి.

మరి భవిష్యత్తేంటి?
మొత్తం ఉద్యోగ మార్కెట్‌పై ఏఐ ప్రభావం ప్రస్తుతానికి పరిమితంగానే ఉన్నప్పటికీ, కెరీర్ తొలి మెట్టుపైనే యువతకు ఎదురవుతున్న ఈ సవాలు ఆందోళన కలిగించే అంశం. కేవలం సంప్రదాయ డిగ్రీ పట్టాతో ఉద్యోగం సంపాదించడం ఇకపై అంత సులభం కాదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏఐ సాధనాలపై పట్టు సాధించడం, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇంటిగ్రేషన్ వంటి కొత్త తరం నైపుణ్యాలను నేర్చుకోవడం తప్పనిసరి. ఏఐని ఒక భూతంగా కాకుండా, తమ కెరీర్‌కు ఉపయోగపడే ఒక శక్తిమంతమైన సాధనంగా మలుచుకున్న వారికే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయన్నది ఈ నివేదిక ఇస్తున్న స్పష్టమైన సందేశం.
Advertisement
Artificial Intelligence
Entry level jobs
Goldman Sachs Research
Freshers job market
Generative AI impact
Skill development

More Telugu News