గురుగ్రామ్ హిట్ అండ్ రన్: మహిళా బైకర్‌ను ఢీకొట్టింది కబడ్డీ ప్లేయర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గురుగ్రామ్ హిట్ అండ్ రన్: మహిళా బైకర్‌ను ఢీకొట్టింది కబడ్డీ ప్లేయర్!

Gurugram Hit and Run Kabaddi Player Hits Female Biker
  • గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను ఢీకొట్టిన కారు
  • బాధితురాలి యాక్షన్ కెమెరా వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • నిందితుడు అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్‌గా ప్రచారం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గురుగ్రామ్‌లో ఓ కారు మహిళా బైకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టి పరారైన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాధితురాలి కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని తనను తాను అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడిగా చెప్పుకుంటున్న కల్యాణ్ బైన్స్‌లా అని గుర్తించారు.

సియా అనే మహిళ ఆదివారం గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై తన అప్రిలియా RS 457 స్పోర్ట్స్ బైక్‌పై వెళుతుండగా, అతివేగంగా వచ్చిన మారుతి సియాజ్ కారు ఆమెను పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సియాకు స్వల్ప గాయాలు కాగా, బైక్ పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సియా బైక్ కు అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు నిందితుడి వివరాలపై ఆరా తీశారు. కల్యాణ్ బైన్స్‌లా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తనను తాను "అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు," "భారత రగ్బీ జట్టు సభ్యుడు"గా పేర్కొన్నట్లు వెల్లడైంది. అయితే, ఈ ఘటన అనంతరం అతను తన సోషల్ మీడియా ఖాతాను డియాక్టివేట్ చేశాడు. అతని క్రీడా నేపథ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లభించలేదు.

కారు యజమాని మనీష్ స్పందిస్తూ, తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, ప్రమాదం జరిగిన సమయంలో తాను అసోంలో విధుల్లో ఉన్నానని తెలిపారు. తన స్నేహితుడైన కల్యాణ్ ఆదివారం తన కుటుంబ సభ్యుల వద్ద నుంచి కారును తీసుకువెళ్లాడని ఆయన వివరించారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాతే తనకు విషయం తెలిసిందని పేర్కొన్నారు.

సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని, వెంటనే బాధితురాలిని సంప్రదించామని గురుగ్రామ్ ఏసీపీ అభిలక్ష్ జోషి తెలిపారు. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రక్రియ చేపట్టామని, ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
Advertisement
Kalyan Bainsla
Gurugram Hit and Run
Kabaddi Player Accident
Female Biker Sia
Gurugram Golf Course Road

More Telugu News