8,000 ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా..!: గూగుల్, మెటాలలో ఉద్యోగాలు కోల్పోయిన టెక్కీల వెతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

8,000 ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా..!: గూగుల్, మెటాలలో ఉద్యోగాలు కోల్పోయిన టెక్కీల వెతలు

Techies struggle after losing jobs at Google and Meta despite 8000 applications
  • గూగుల్, మెటా వంటి దిగ్గజ కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన టెక్కీలు
  • కొత్త ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న మాజీ ఉద్యోగులు
  • ఒక మాజీ ఉద్యోగిని 8,000 జాబ్స్‌కి అప్లై చేసినా ఫలితం శూన్యం
  • ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో సతమతం
  • పెద్ద ఉద్యోగం, అధిక జీతం భద్రతకు హామీ కాదని గ్రహింపు
గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం అంటే జీవితంలో స్థిరపడినట్లేనని చాలామంది నమ్ముతారు. అయితే, అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పనిచేసి, లేఆఫ్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన నలుగురు మాజీ టెక్కీల జీవితాలు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై అనిశ్చితి వారిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి.

ఒక తాజా ఇంటర్వ్యూలో ఈ నలుగురు తమ బాధాకరమైన అనుభవాలను పంచుకున్నారు. వీరిలో మెటా మాజీ ఉద్యోగిని బ్రిట్నీ బాల్ (37) ఏడాదికి 180,000 డాలర్ల వేతనం అందుకునేవారు. గూగుల్‌లో పనిచేసిన జాసన్ జాంగ్ (25) వార్షిక వేతనం 200,000 డాలర్లకు పైమాటే. ఇక మైక్రోసాఫ్ట్‌లో 23 ఏళ్లు సుదీర్ఘ అనుభవం ఉన్న జో ఫ్రెండ్ (62) 250,000 డాలర్ల వేతనం అందుకుంటుండగా, ఇంటెల్‌లో అంతే కాలం పనిచేసిన శ్రీరామ్ రామకృష్ణ (57) 180,000 డాలర్ల వేతనం పొందేవారు. ఎటువంటి ముందుస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా లేఆఫ్‌కు గురవడం వీరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం వారు ఊహించిన దానికంటే అత్యంత కష్టతరంగా మారింది. బ్రిట్నీ బాల్ ఏకంగా 8,000కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. శ్రీరామ్ రామకృష్ణ ఏడాది కాలంగా ఉద్యోగ వేట సాగిస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితి వారి ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపింది. బ్రిట్నీ తన పొదుపు మొత్తాన్ని ఖర్చు చేయడమే కాకుండా, జీవన వ్యయాన్ని తగ్గించుకోవడానికి వాషింగ్టన్ డీసీ నుంచి వేరే నగరానికి తరలివెళ్లాలని ఆలోచిస్తున్నారు. మరోవైపు, సంస్థలు అందించే బీమా సౌకర్యం లేకపోవడంతో వైద్య ఖర్చులు పెనుభారంగా మారాయి. జో ఫ్రెండ్ కుటుంబం ప్రస్తుతం ఆరోగ్య బీమా కోసం నెలకు సుమారు 2,600 డాలర్లు వెచ్చిస్తోంది.

ఈ పరిణామాలు టెక్ దిగ్గజ సంస్థలపై వారికున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేశాయి. భారీ వేతనాలు, పేరున్న సంస్థల్లో ఉద్యోగాలే వృత్తిపరమైన భద్రతకు గ్యారంటీ కాదని తాము నేర్చుకున్న అతిపెద్ద పాఠమని వారు పేర్కొన్నారు. కేవలం డబ్బు, కెరీర్‌ మాత్రమే కాకుండా, జీవితంలో అంతకుమించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాల గురించి పునరాలోచించుకునేలా ఈ విపత్కర పరిస్థితులు తమను మార్చాయని వారు వివరించారు.
Advertisement
Tech Layoffs
Google Meta Microsoft Intel
Brittany Ball
Sriram Ramakrishna
Big Tech Unemployment

More Telugu News