70వ వార్షికోత్సవం: రెండు కొత్త ప్లాన్లను ప్రారంభించిన ఎల్ఐసీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

70వ వార్షికోత్సవం: రెండు కొత్త ప్లాన్లను ప్రారంభించిన ఎల్ఐసీ

LIC launches two new plans on its 70th anniversary
  • బీమా ప్లాటినం, జీవన్ రక్ష పేరుతో కొత్త పాలసీల ఆవిష్కరణ
  • గ్యారెంటీ రాబడితో రానున్న బీమా ప్లాటినం ప్లాన్
  • కుటుంబ రక్షణ కోసం జీవన్ రక్ష టర్మ్ ప్లాన్
  • సెప్టెంబర్ 7 నుంచి అందుబాటులోకి పాలసీలు
భారతీయ జీవిత బీమా సంస్థ-ఎల్ఐసీ తన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆవిష్కరించింది. 'బీమా ప్లాటినం', 'జీవన్ రక్ష' పేర్లతో వస్తున్న ఈ పాలసీలు 2026 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. పొదుపుతో పాటు రక్షణను కోరుకునే వారి కోసం ఒక ప్లాన్‌ను, పూర్తిస్థాయి ఆర్థిక భద్రత కోసం మరో టర్మ్ ప్లాన్‌ను ఎల్ఐసీ ప్రవేశపెట్టింది.

ఎల్ఐసీ బీమా ప్లాటినం

ఇది పొదుపు, బీమా రక్షణ రెండింటినీ అందించే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. ఇందులో గ్యారెంటీడ్ రిటర్న్స్ ప్రధాన ఆకర్షణ. ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి రూ. 1,000 హామీ మొత్తానికి రూ. 70 చొప్పున 'గ్యారెంటీడ్ అడిషన్' లభిస్తాయి. కనీస హామీ మొత్తం రూ. 3 లక్షలు కాగా, గరిష్ఠ పరిమితి లేదు. మెచ్యూరిటీ సమయంలో హామీ మొత్తంతో పాటు అప్పటివరకు జమయిన గ్యారెంటీడ్ అడిషన్లు పాలసీదారుకు అందుతాయి. ఇప్పటికే ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి రిబేటు, లోన్ సౌకర్యం, అదనపు రైడర్లను జోడించుకునే వెసులుబాటు వంటి సదుపాయులు ఇందులో ఉన్నాయి.

ఎల్ఐసీ జీవన్ రక్ష 

ఇది కుటుంబ ఆర్థిక భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్యూర్ రిస్క్ (టర్మ్) ప్లాన్. పాలసీదారుడికి ఏదైనా అవాంఛనీయ సంఘటన ఎదురైనప్పుడు వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్లాన్‌లో కనీస హామీ మొత్తం రూ. 5 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ. 24 లక్షల వరకు బీమా రక్షణ పొందే అవకాశం ఉంది. ఇందులో సింగిల్, రెగ్యులర్, లిమిటెడ్ ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మహిళా పాలసీదారులకు ప్రత్యేక ప్రీమియం రేట్లు ఆఫర్ చేస్తుండటం ఈ ప్లాన్ యొక్క మరో విశిష్టత.
Advertisement
LIC
LIC Bima Platinum
LIC Jeevan Raksha
LIC 70th Anniversary
New LIC Insurance Plans

More Telugu News