‘వన్ జనరేషన్‌ ప్లేయర్‌’ అంటూ కాపాడొద్దు: పంత్‌పై అశ్విన్‌ ఫైర్‌

Ashwin slams Rishabh Pant says do not protect him as one generation player
  • శ్రీలంక సిరీస్‌లో పంత్‌ ఆటతీరుపై అశ్విన్‌ అసంతృప్తి
  • రెండు టెస్టుల్లో 2 అర్ధశతకాలతో 168 పరుగులు చేసిన పంత్ 
  • టెస్టుల్లో పరిస్థితులకు తగ్గట్టు ఆడటం ముఖ్యమన్న అశ్విన్‌
  • ‘రిషభ్‌ ఇలాగే ఆడతాడు’ అంటూ తప్పులను సమర్థించొద్దని సూచన
  • పంత్‌కు ప్రత్యేక మద్దతు ఇవ్వడాన్ని తప్పుబట్టిన అశ్విన్‌
భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఆటతీరుపై మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పంత్‌ రెండు అర్ధశతకాలతో 168 పరుగులు చేసినప్పటికీ.. అతడి నుంచి తాను ఆశించిన స్థాయి ప్రదర్శన ఇంకా రాలేదని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.

తన యూట్యూబ్‌ ఛానల్‌ ‘ఆష్‌ కీ బాత్‌’లో మాట్లాడిన అశ్విన్‌.. పరిస్థితులకు అనుగుణంగా ఆడటం టెస్టు క్రికెట్‌లో చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. జట్టు అవసరాలను పక్కనపెట్టి రిషభ్‌ పంత్‌ ఇలాగే ఆడతాడనే వాదనను అంగీకరించలేనని స్పష్టం చేశాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ, బ్రిస్బేన్‌ టెస్టుల్లో పంత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన విషయాన్ని అశ్విన్‌ గుర్తుచేశాడు. అయితే ఆ విజయాల్లో వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌ చేసిన కీలక సహకారాన్ని కూడా మర్చిపోవద్దని అన్నాడు. టెస్టు మ్యాచ్‌ను గెలిపించడానికి 11 మంది ఆటగాళ్ల సమష్టి కృషి అవసరమని, కానీ ఒక తప్పు నిర్ణయం మ్యాచ్‌ను ఓడించగలదని పేర్కొన్నాడు.

ఇక పంత్‌కు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఇస్తున్న ప్రత్యేక మద్దతుపైనా అశ్విన్‌ ప్రశ్నలు లేవనెత్తాడు. ‘వన్‌-జనరేషన్‌ ప్లేయర్‌’ అంటూ అతడికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం సరికాదని అన్నాడు. అలాంటి మద్దతు ఇవ్వాలనుకుంటే యశస్వి జైస్వాల్‌ వంటి ఇతర ప్రతిభావంతులకూ ఇవ్వాలని సూచించాడు.

పంత్‌ ఇప్పటికే 50 టెస్టులు ఆడిన అనుభవజ్ఞుడని గుర్తుచేసిన అశ్విన్‌.. ఇక అతడు మరింత బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నాడు. తన నిర్ణయాల కారణంగానే పంత్‌ మిగిలిన రెండు ఫార్మాట్లలో స్థానం కోల్పోతున్నాడని పేర్కొన్నాడు.

పంత్‌ ప్రతిభను తాను ఏమాత్రం తక్కువ చేయడం లేదని చెప్పిన అశ్విన్‌.. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటే అతడు భారత జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా మారగలడని వ్యాఖ్యానించాడు.
Advertisement
Rishabh Pant
Ravichandran Ashwin
Indian Cricket Team
Test Cricket Analysis
One Generation Player
Yashasvi Jaiswal

More Telugu News