పాన్, ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాన్, ఆధార్ వాట్సాప్‌లో పంపుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

Are you sending PAN Aadhaar on WhatsApp then you must know these things
  • వాట్సాప్‌లో పాన్, ఆధార్ వంటి పత్రాలు పంపడం ప్రమాదకరమంటున్న నిపుణులు
  • వ్యక్తిగత ఫోన్లలో, క్లౌడ్‌లో మీ సమాచారం ఏళ్ల తరబడి నిల్వ ఉండే ఛాన్స్‌
  • హ్యాకింగ్ జరిగితే ఐడెంటిటీ థెఫ్ట్, ఆర్థిక మోసాలకు ఆస్కారం
  • కంపెనీ అధికారిక లింకుల ద్వారానే డాక్యుమెంట్లు పంపడం సురక్షితం
"మీ పాన్, ఆధార్, లేటెస్ట్ బ్యాంక్ స్టేట్‌మెంట్ వాట్సాప్ చేయండి" ఈ మాట మనకు తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. లోన్ ఏజెంట్, ప్రాపర్టీ బ్రోకర్ లేదా హోటల్ రిసెప్షనిస్ట్ వెరిఫికేషన్ కోసం అడిగినప్పుడు, మనం ఏమాత్రం ఆలోచించకుండా మన కీలక పత్రాలను పంపేస్తాం. కానీ, ఈ చిన్నపాటి నిర్లక్ష్యం మన అత్యంత సున్నితమైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సమస్య ఎక్కడ మొదలవుతుంది?
మీరు వాట్సాప్‌లో డాక్యుమెంట్లు పంపినప్పుడు, అవి కేవలం అవతలి వ్యక్తికి చేరడమే కాదు, వారి వ్యక్తిగత ఫోన్, ల్యాప్‌టాప్ లేదా క్లౌడ్ బ్యాకప్‌లో శాశ్వతంగా నిల్వ ఉండిపోతాయి. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అవతలి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేయకపోయినా, వారి డివైజ్ భవిష్యత్తులో హ్యాకింగ్‌కు గురైతే లేదా వారి అకౌంట్ పాస్‌వర్డ్ చోరీకి గురైతే, మీ డాక్యుమెంట్లు నేరగాళ్ల చేతికి చిక్కుతాయి. ఒక్కసారి పంపిన సమాచారంపై మన నియంత్రణ పూర్తిగా పోతుంది.

"ప్రజలు తమ డాక్యుమెంట్లను ఒక కంపెనీకి లేదా హోటల్‌కు పంపుతున్నామని అనుకుంటారు. కానీ వాస్తవానికి, వారు ఒక వ్యక్తిగత ఫోన్‌కు పంపి, తమ డేటాపై పూర్తి నియంత్రణ కోల్పోతున్నారు" అని డిజిటల్ ట్రస్ట్ ప్లాట్‌ఫామ్ 'డిజియో' సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అభినవ్ పరాశర్ వివరించారు.

ఆర్థిక మోసాలకు ఆస్కారం
ముఖ్యంగా ఆర్థిక రంగంలో పనిచేసే డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు (డీఎస్ఏలు) కస్టమర్ల నుంచి కేవైసీ పత్రాలను తమ వ్యక్తిగత ఫోన్ నంబర్ల ద్వారా సేకరిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల ఆ సమాచారం కంపెనీ సైబర్ భద్రతా వ్యవస్థల పరిధి దాటి బయటకు వెళ్లిపోతుంది. తద్వారా మీ పాన్, ఆధార్, బ్యాంక్ వివరాలు అపరిచితులకు అయాచిత కాల్స్, మెసేజ్‌లు పంపడానికి ఒక వనరుగా మారతాయి. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఇది గుర్తింపు దొంగతనం (ఐడెంటిటీ థెఫ్ట్), భారీ ఆర్థిక మోసాలకు దారితీస్తుంది. ఆర్‌బీఐ 2024-25 వార్షిక నివేదిక ప్రకారం.. దేశంలో రూ.36,014 కోట్ల విలువైన 23,953 బ్యాంకింగ్ మోసాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

సురక్షితమైన మార్గాలు ఏమిటి?
సమాచారాన్ని పంచుకోవడం పూర్తిగా ఆపేయడం దీనికి పరిష్కారం కాదు. బ్యాంకులు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలకు గుర్తింపు ధ్రువీకరణ తప్పనిసరి. అయితే, సమాచారాన్ని సేకరించే విధానంలో మార్పు రావాలి. డాక్యుమెంట్ల కాపీలను వాట్సాప్‌లో పంపమని అడగకుండా, కంపెనీలకు చెందిన అధికారిక, సురక్షితమైన డిజిటల్ ఫారమ్‌లు లేదా అప్‌లోడ్ పోర్టల్స్ ద్వారా స్వీకరించాలి. డిజిలాకర్ లేదా యూఐడీఏఐ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ (ఓవీఎస్ఈ) ఫ్రేమ్‌వర్క్ వంటి వ్యవస్థల ద్వారా ధ్రువీకరణ జరగడం మరింత సురక్షితం.

భారత డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం కూడా వ్యక్తిగత సమాచార సేకరణ, వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఒక నిర్దిష్ఠ‌ ప్రయోజనం కోసం మాత్రమే డేటాను సేకరించి, బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఈ చట్టం చెబుతోంది. అధికారిక పోర్టల్ ద్వారా పంపినప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ, వ్యక్తిగత నంబర్‌కు పంపితే ఆ డాక్యుమెంట్‌కు ఎన్ని కాపీలు సృష్టించబడ్డాయో కూడా తెలుసుకోవడం అసాధ్యం.

మీరేం చేయాలి?
తదుపరిసారి ఎవరైనా మీ పాన్, ఆధార్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను వాట్సాప్‌లో పంపమని అడిగితే, ఒక్క క్షణం ఆగండి. కంపెనీ అధికారిక లింక్ లేదా సురక్షితమైన పోర్టల్ అడగండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో డాక్యుమెంట్ పంపాల్సి వస్తే, ఫైల్‌ను పాస్‌వర్డ్‌తో ప్రొటెక్ట్ చేసి, పాస్‌వర్డ్‌ను వేరే మార్గంలో పంపడం ఉత్తమం. మీ పాన్, ఆధార్ కేవలం పత్రాలు కావు, అవి మీ ఆర్థిక, వ్యక్తిగత గుర్తింపుకు సంబంధించినవి. ఒక్కసారి అవి మీ ఫోన్ దాటి బయటకు వెళితే, వాటిని వెనక్కి తెచ్చుకోవడం దాదాపు అసాధ్యం.
Advertisement
PAN card
Aadhaar card
WhatsApp security
Identity theft
Cyber security
Banking fraud

More Telugu News