మూడు ఫార్మాట్లకు కెప్టెన్సీ ఇస్తేనే: పాక్ బోర్డుకు బాబర్ ఆజం షరతు!

Babar Azam sets condition for Pakistan Board only if captaincy given for three formats
  • టెస్ట్ కెప్టెన్‌గా షాన్ మసూద్ విఫలం
  • బాబర్‌ను సంప్రదించిన సెలక్టర్లు
  • వెస్టిండీస్, ఇంగ్లండ్‌తో 5 టెస్టు సిరీస్లు
  • వాటిలో జట్టు రాణిస్తే పూర్తి స్థాయి కెప్టెన్సీ ఇస్తామని హామీ
  • గతంలో ఒకే ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉండటం ఇష్టం లేక తప్పుకున్న బాబర్ 
  • టెస్ట్ కెప్టెన్సీని తిరస్కరించిన సల్మాన్ ఆఘా  
పాకిస్థాన్ క్రికెట్‌లో కెప్టెన్సీ మార్పుల వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. జట్టు టెస్ట్ కెప్టెన్సీని చేపట్టాలని వచ్చిన ప్రతిపాదనకు స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం అంగీకరించాడని, అయితే అందుకు ఓ కీలకమైన షరతు విధించాడని ఒక వార్తా నివేదిక వెల్లడించింది. మూడు ఫార్మాట్లకు (టెస్ట్, వన్డే, టీ20) తననే కెప్టెన్‌గా నియమిస్తేనే టెస్టు పగ్గాలు చేపడతానని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

టెస్టుల్లో ప్రస్తుత కెప్టెన్ షాన్ మసూద్ నాయకత్వంలో జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. డిసెంబర్ 2023 నుంచి 16 టెస్టులకు గాను 12 మ్యాచుల్లో పాక్ ఓటమి పాలైంది. దీంతో సెలెక్టర్లు బాబర్ ఆజం వైపు చూడక తప్పలేదు. జులై 5న టెస్ట్ కెప్టెన్‌ను అధికారికంగా ప్రకటించడానికి ముందు ఇద్దరు సెలెక్టర్లు బాబర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే అతడు తన షరతును వారి ముందుంచాడు.

బాబర్ షరతుపై సెలెక్టర్లు స్పందిస్తూ.. రాబోయే వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల్లోని ఐదు టెస్టుల్లో జట్టు మెరుగ్గా రాణిస్తే, అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతకుముందు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని సెలెక్టర్లు సల్మాన్ ఆఘాను సంప్రదించగా, అతడు సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.

నవంబర్ 2023లో బాబర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా కొనసాగాలని అప్పటి పీసీబీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ సూచించగా, అందుకు ఇష్టపడకే బాబర్ అన్ని బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు అనుకూలించడంతో, పూర్తిస్థాయి కెప్టెన్సీపై అతడు దృష్టి సారించారు. ప్రస్తుతం వన్డే కెప్టెన్‌గా షహీన్ అఫ్రిది, టీ20 కెప్టెన్‌గా సల్మాన్ ఆఘా ఉన్నారు. అయితే వీరిద్దరూ నాయకులుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే బాబర్ ఆజం పాకిస్థాన్ జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారతాడని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ జోస్యం చెప్పాడు.
Advertisement
Babar Azam
Pakistan Cricket Board
Pakistan Cricket Captaincy
Shan Masood
PCB Selectors
Salman Agha

More Telugu News