రాయలసీమ కుర్రాడిలో కొరియన్ భూతం... వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' టీజర్ అదిరిపోయింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాయలసీమ కుర్రాడిలో కొరియన్ భూతం... వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' టీజర్ అదిరిపోయింది!

Varun Tej Korean Kanakaraju Teaser Out Rayalaseema Boy With A Korean Twist
  • ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన 'కొరియన్ కనకరాజు' టీజర్
  • రాయలసీమ యువకుడిగా, కొరియన్ శక్తులున్న వ్యక్తిగా వరుణ్ తేజ్
  • హారర్, కామెడీ, యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న టీజర్
  • ఆగస్టు 7న థియేటర్లలోకి రానున్న సినిమా
  • వరుణ్ తేజ్ కొత్త అవతార్ అద్భుతంగా ఉందన్న ప్రభాస్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం 'కొరియన్ కనకరాజు'. హారర్, కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మార్క్ కామెడీతో, వరుణ్ తేజ్ మాస్ అవతార్‌తో నిండిన ఈ టీజర్, విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

టీజర్ ప్రకారం, ఈ కథ రాయలసీమలోని పెనుకొండ అనే గ్రామంలో మొదలవుతుంది. "మా ఊరు పెనుకొండ.. రాయలసీమ. మా ఊరెంత అందంగా ఉంటాదో, మా ఊరి మనుషులు కూడా అంతే అందంగా ఉంటారు" అంటూ తన ఊరిని పరిచయం చేస్తాడు కథానాయకుడు. తన పేరు కనకరాజు అని, కాస్త ముక్కోపి అని చెప్పుకుంటాడు. చిన్న చిన్న కారణాలకే మద్యం సేవిస్తూ సరదాగా కనిపించే ఈ పాత్రకు ఒక విచిత్రమైన కోణం ఉందని టీజర్‌లో చూపించారు. 

సరదాగా సాగిపోతున్న అతని జీవితంలోకి, డ్రాగన్ బొమ్మ ఉన్న ఒక ప్రత్యేకమైన వాజ్ (కుండీ) వచ్చిన తర్వాత కథ మలుపు తిరుగుతుంది. దాన్ని తాకడంతో కనకరాజుకు అతీత శక్తులు వస్తాయి, కళ్ళు నీలంగా మారిపోతాయి.'కొరియా' అనే పదం వినపడగానే కనకరాజు ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. కళ్ల రంగు మారడం, వేగంగా స్పందించడం వంటి సన్నివేశాలు ఆసక్తి రేపుతున్నాయి. "అతను ఉత్త కనకరాజు కాదు... కొరియన్ కనకరాజు" అనే డైలాగ్‌తో ఈ పాత్రలోని వైవిధ్యాన్ని స్పష్టం చేశారు. రాయలసీమ నేపథ్యానికి, కొరియా కనెక్షన్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటనేది సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. 

హీరోయిన్‌గా నటిస్తున్న రితికా నాయక్ కొరియన్ భాషలో మాట్లాడటం, కమెడియన్ సత్య తనదైన శైలిలో పండించిన హాస్యం టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే, టీజర్ చివర్లో అసలు ట్విస్ట్ దాగి ఉంది. ఒంటి నిండా టాటూలు, ఒక వేలు తెగిపోయి, కొరియన్ మాఫియా డాన్‌లా హైపర్ లుక్‌లో వరుణ్ తేజ్ కనిపించడం సినిమాపై క్యూరియాసిటీని అమాంతం పెంచేసింది. ఒకే సినిమాలో రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ నటించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

టీజర్ విడుదల చేసిన అనంతరం ప్రభాస్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. "'కొరియన్ కనకరాజు' టీజర్ చాలా బాగుంది. వరుణ్ తేజ్ కొత్త అవతార్‌లో అద్భుతంగా ఉన్నాడు. ఆగస్టు 7న విడుదలవుతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ప్రభాస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 7న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. రాయలసీమ నేపథ్యానికి కొరియన్ సూపర్ నేచురల్ అంశాలను జోడించిన ఈ విభిన్నమైన కాన్సెప్ట్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Advertisement
Varun Tej
Korean Kanakaraju Teaser
Merlapaka Gandhi
Prabhas
Ritika Nayak
Korean Kanakaraju Release Date

More Telugu News