లక్నో అగ్నిప్రమాదం.. 2016లో కూల్చివేత ఉత్తర్వులు ఇచ్చి రెండు నెలల్లోనే రద్దు..!

Lucknow Fire Accident Demolition orders issued in 2016 canceled in two months
  • అగ్నిప్రమాదంలో 15 మంది సజీవ దహనం
  • పదేళ్ల క్రితం ఇదే భవనం కూల్చివేతకు లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ ఆదేశాలు
  • సరైన విచారణ జరపకుండా నోటీసు ఇచ్చారని యాజమాన్యం సవాల్ చేయడంతో ఉత్తర్వు రద్దు
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్‌లోని ఒక మూడంంతస్తుల వాణిజ్య భవనంలో సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో అత్యధికులు యానిమేషన్ శిక్షణా కేంద్రానికి హాజరైన విద్యార్థులే కావడం గమనార్హం. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో భవన నిర్మాణం నిబంధనలు ఉల్లంఘనలు మరియు నియంత్రణ వైఫల్యాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

అక్రమ నిర్మాణం కారణంగా ఈ భవనాన్ని కూల్చివేయాలని 2016 మే 10న లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కేవలం రెండు నెలల వ్యవధిలోనే, అంటే అదే ఏడాది జులై 5న ఆ ఆదేశాలను అధికారులు రద్దు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సరైన విచారణ జరపకుండానే నోటీసులు ఇచ్చారని, భవన నిర్మాణం నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని అప్పటి యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేయడంతో, ఆ కూల్చివేత ఆదేశాలు రద్దయ్యాయి. కాగా, 1980వ సంవత్సరం నుంచి ఈ స్థలం పలువురి చేతులు మారుతూ వచ్చిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులుగా నలుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, భవన యజమాని వీరేంద్ర ప్రతాప్ శుక్లాతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
Go Back to Shorts
Lucknow Fire Accident
Aliganj Building Fire
Yogi Adityanath SIT Probe
Lucknow Development Authority

More Telugu News