తూర్పు గోదావరి రైతు అద్భుతం.. భార్య కష్టం చూడలేక.. ఇంట్లోనే ఎస్కలేటర్ తయారు చేసిన వైనం!
- భార్య మోకాళ్ల నొప్పుల బాధను చూడలేకపోయిన రైతు
- కేవలం రూ.70 వేల ఖర్చుతో ఇంట్లోనే ఎస్కలేటర్ నిర్మాణం
- తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్తి శివనారాయణరెడ్డి ఆవిష్కరణ
- ఐదో తరగతి చదివినా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రైతు
- ఈ ఎస్కలేటర్ 300 కిలోల బరువును మోయగలిగే సామర్థ్యం
తూర్పు గోదావరి జిల్లా, అర్తమూరు గ్రామానికి చెందిన సత్తి శివనారాయణరెడ్డి వృత్తిరీత్యా రైతు. ఆయన ఐదో తరగతి వరకే చదువుకున్నారు. ఆయన భార్య గత కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్నారు. దీంతో రెండంతస్తుల ఇంట్లో మెట్లు ఎక్కి, దిగడానికి ఆమె చాలా ఇబ్బంది పడేవారు. రోజూ భార్య పడుతున్న ఈ వేదనను చూడలేకపోయిన శివనారాయణరెడ్డి, ఆమె కష్టాన్ని తీర్చాలని సంకల్పించారు. ఈ సమస్యకు ఓ వినూత్న పరిష్కారం కనుగొనాలని ఆలోచించారు.
శివనారాయణరెడ్డికి చిన్నప్పటి నుంచే ఎలక్ట్రికల్ వస్తువులపై ఆసక్తి, అవగాహన ఉన్నాయి. చిన్న చిన్న పనులు సొంతంగా చేసుకునేవారు. ఆ అనుభవంతోనే ఇంట్లో మెట్లపై ఎస్కలేటర్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 1.5 హెచ్‌పీ మోటార్, మెట్లకు సరిపడా రేకు, మూడు ఆటో స్టాపర్లు, రెండు స్టాపర్లు, బేరింగ్‌లు, ఎలక్ట్రికల్ వైర్లను సమకూర్చుకున్నారు. వీటన్నింటి సాయంతో తన ఆలోచనకు రూపం ఇచ్చారు. ఈ మొత్తం నిర్మాణానికి ఆయనకు సుమారు రూ.70 వేలు ఖర్చు అయింది. ఈ ఎస్కలేటర్ తక్కువ విద్యుత్‌తో నడుస్తుందని, ఏకకాలంలో 300 కిలోల బరువును మోయగలదని ఆయన తెలిపారు.
ప్రస్తుతం శివనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు మేడపైకి వెళ్లాలంటే మెట్లు ఎక్కాల్సిన పనిలేదు. ఎస్కలేటర్ మెట్టుపై నిల్చుంటే చాలు, అదే సులభంగా పైకి తీసుకెళ్తుంది. ఒకవేళ కరెంట్ పోయినా ఇబ్బంది లేకుండా, అది ఎక్కడుంటే అక్కడే ఆగిపోయేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఎస్కలేటర్‌ను ఆన్, ఆఫ్ చేయడానికి ప్రత్యేకంగా ఒక స్విచ్ కూడా ఏర్పాటు చేశారు.
శివనారాయణరెడ్డి చేసిన ఈ ప్రయోగం గురించి తెలిసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చదివింది ఐదో తరగతే అయినా, ఆయనలోని సాంకేతిక ప్రతిభ, భార్యపై ఉన్న ప్రేమకు అందరూ ఫిదా అవుతున్నారు. చదువుకు, నైపుణ్యానికి సంబంధం లేదని శివనారాయణరెడ్డి మరోసారి నిరూపించారంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి