బెంగళూరు ఎయిర్‌పోర్ట్ T2లో షాకింగ్ దృశ్యాలు.. అంతర్జాతీయ విమానాశ్రయమా, రైల్వే స్టేషనా?

Bengaluru Airport T2 shocking scenes international airport or railway station
  • బెంగళూరు ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్ 
  • బెంచీలపై పడుకున్న ప్రయాణికులు 
  • నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ
  • మౌలిక వసతులపై ప్రశ్నలు
  • అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి అంటున్న నెటిజన్లు
దేశంలోనే అత్యంత ఆధునికమైన, అందమైన విమానాశ్రయాల్లో ఒకటిగా పేరుగాంచిన బెంగళూరులోని 'కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2' ఇప్పుడు ఒక సరికొత్త వివాదానికి కేంద్రబిందువుగా మారింది. టెర్మినల్ లోపల ప్రయాణికులు ఇష్టారాజ్యంగా బెంచీలపై, నేలపై నిద్రిస్తున్న దృశ్యాలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడమే దీనికి కారణం. ఈ వీడియో కాస్తా ఇప్పుడు ప్రయాణికుల పౌర బాధ్యత, విమానాశ్రయంలో మౌలిక వసతుల లభ్యతపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

అఫ్రీన్ అహెమది అనే డిజిటల్ క్రియేటర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. మొదట ఈ వీడియోలో టెర్మినల్-2కు అంతర్జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పచ్చని మొక్కలు, అద్భుతమైన డిజైన్, వెదురు అలంకరణలను చూపించారు. అయితే ఆ వెంటనే, డిపార్చర్ ప్రాంతంలో ప్రయాణికులు అక్కడి సిమెంట్ బెంచీలపై, ఇండోర్ చెట్ల కింద, నేలపై తమ బ్యాగులను దిండ్లుగా చేసుకుని నిద్రిస్తున్న దృశ్యాలను చూపించారు. దీనికి ఆమె "మీరు ఎంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కట్టినా.. మేము మాత్రం దేశీయులముగానే ఉంటాము" అనే క్యాప్షన్‌ను జోడించడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.

నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు
ఈ వీడియోను విమర్శిస్తున్న వారు.. ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్న ఇలాంటి ప్రదేశాల్లో ఇలా ప్రవర్తించడం పౌర బాధ్యత లేకపోవడమేనని మండిపడుతున్నారు. ఎయిర్‌పోర్ట్ అందాన్ని ఇలాంటి పనులు పాడు చేస్తున్నాయని కొందరు కామెంట్ చేశారు. అయితే, ఈ విమర్శలను తోసిపుచ్చుతూ ప్రయాణికులకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. "విమానాలు గంటల తరబడి ఆలస్యమైనప్పుడు, లాంగ్ లేఓవర్లు ఉన్నప్పుడు ప్రయాణికులు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? టిక్కెట్లకు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు కనీసం పడుకోవడానికి సరైన సీట్లు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు?" అని మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తున్నారు. సింగపూర్‌లోని చాంగి, కౌలాలంపూర్, కొరియాలోని ఇన్చియాన్ వంటి ప్రపంచ ప్రసిద్ధ ఎయిర్‌పోర్ట్‌లలో కూడా ప్రయాణికులు ఇలా పడుకోవడం సాధారణమేనని, ఇది కేవలం భారతీయులకే పరిమితం కాదని డిఫెండ్ చేస్తున్నారు.

మౌలిక వసతుల కొరతపై ప్రశ్నలు
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో పర్యావరణ అనుకూలమైన గార్డెన్ థీమ్‌తో టెర్మినల్-2ను అద్భుతంగా నిర్మించినప్పటికీ, ప్రయాణికులు పెరిగే కొద్దీ విశ్రాంతి తీసుకునే సదుపాయాలు సరిపోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో స్లీపింగ్ పాడ్స్, లాంజ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. అవి చాలా ఖరీదైనవి కావడం వల్ల సాధారణ ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు భారం అవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ వైరల్ వీడియో నేపథ్యంలో, విమానాశ్రయాల విస్తరణ కేవలం అందానికే పరిమితం కాకుండా వృద్ధులు, కుటుంబాలు, సుదీర్ఘ ప్రయాణాలు చేసే కనెక్టింగ్ ఫ్లైట్ ప్రయాణికుల కనీస అవసరాలను తీర్చే విధంగా ఉండాలని విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Go Back to Shorts
Bengaluru Airport
Terminal 2
Viral Video
Kempegowda International Airport
Passenger Sleeping
Airport Infrastructure

More Telugu News