డేటింగ్లో బిర్యానీ తినిపించా.. వసూల్ చేస్తా అన్నాడు.. ఉద్యోగం ఊడింది!
- కామెడీ షోలో యువకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
- డేటింగ్లో రూ.370 బిర్యానీపై చేసిన కామెంట్‌తో దుమారం
- సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఉద్యోగం తొలగింపు
- విషయాన్ని అధికారికంగా ప్రకటించిన గురుగ్రామ్ డిజైన్ కంపెనీ
- క్షమాపణలు చెప్పిన యువకుడు, షో కమెడియన్
వివరాల్లోకి వెళితే, హిమాన్షు జంగ్రా (22) అనే యువకుడు గురుగ్రామ్‌లోని 'స్టార్విక్ డిజైన్' అనే సంస్థలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతను కమెడియన్ ప్రణీత్ మోర్ స్టాండప్ కామెడీ షోకు ప్రేక్షకుడిగా వెళ్లాడు. షోలో భాగంగా ఆ కమెడియన్‌తో హిమాన్షు మాట్లాడుతూ, తాను ఒక అమ్మాయితో డేట్‌కు వెళ్లానని, ఆమెతో కలిసి రూ.370 పెట్టి చికెన్ బిర్యానీ తిన్నానని చెప్పాడు. ఆ తర్వాత, పెట్టిన డబ్బులు వసూలు చేసుకోవాలి కదా ("వసూల్ తో కరుంగా") అనే అర్థం వచ్చేలా పరోక్ష వ్యాఖ్యలు చేశాడు.
ఈ వ్యాఖ్య మహిళల పట్ల అగౌరవంగా, అంగీకారాన్ని చులకన చేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిమాన్షుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వివాదం ముదరడంతో హిమాన్షు క్షమాపణలు చెప్పి, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నాడు.
ఈ ఘటనపై స్పందించిన స్టార్విక్ డిజైన్ సంస్థ వ్యవస్థాపకుడు వివేక్ విశ్వకర్మ, హిమాన్షు వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అవి తమ సంస్థ విలువలకి విరుద్ధమని తెలిపారు. ఆఫీసులో అతని ప్రవర్తనపై ఎటువంటి ఫిర్యాదులు లేనప్పటికీ, ఈ వ్యాఖ్యల ప్రభావం దృష్ట్యా అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. షో సమయంలోనే ఈ వ్యాఖ్యను ఖండించనందుకు కమెడియన్ ప్రణీత్ మోర్ కూడా క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.