పేపర్ల రీ-ఎవాల్యుయేషన్‌.. సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం!

CBSE takes key decision on answer paper reevaluation
  • రీ-ఎవాల్యుయేషన్ నుంచి కోఎంప్ట్ సంస్థ తొలగింపు
  • సీబీఎస్‌ఈ సొంత సర్వర్లలోకి డేటా మార్పిడి
  • ఐఐటీ నిపుణుల కమిటీ సూచనతో నిర్ణయం
  • పునఃసమీక్ష కోసం 1.6 లక్షల దరఖాస్తులు
  • ఫలితాల కోసం వెబ్‌సైట్ చూడాలని సూచన
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ నుంచి ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థను తప్పించింది. ఈ విషయాన్ని ఐఐటీ నిపుణుల కమిటీ సభ్యుడొకరు అధికారికంగా ధృవీకరించారు.

ఈ ఏడాది బోర్డు ఫలితాల తర్వాత ఆన్‌-స్క్రీన్ మార్కింగ్ విధానంలో అనేక సాంకేతిక లోపాలు, గందరగోళం తలెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సంస్థకు చెందిన సర్వర్లలో భద్రతా లోపాలు ఉన్నాయని సైబర్ నిపుణులు గుర్తించారు. దీంతో విద్యార్థుల మార్కులు, డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్‌ఈ తాజా నిర్ణయం తీసుకుంది. మొత్తం జవాబు పత్రాల డేటాను కోఎంప్ట్ సర్వర్ల నుంచి సీబీఎస్‌ఈ తన సొంత సర్వర్లలోకి మార్చేసింది.

ఇకపై రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ మొత్తం సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే జరగనుంది. దీనివల్ల విద్యార్థుల డేటాపై బోర్డుకు పూర్తి నియంత్రణ, భద్రత ఉంటుందని ఐఐటీ కాన్పూర్ నిపుణులు స్పష్టం చేశారు. అయితే ఈ సంస్థను తొలగించడానికి గల కచ్చితమైన కారణాలను బోర్డు ఇప్పటివరకు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ నిపుణుల కమిటీ సూచనల మేరకే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఫలితాల అనంతరం మార్కుల వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ కోసం విద్యార్థుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. జూన్ 3న ప్రారంభమైన ఈ దరఖాస్తుల విండో జూన్ 7 అర్ధరాత్రితో ముగిసింది. ఈ ఐదు రోజుల్లోనే దాదాపు 1.6 లక్షల మంది విద్యార్థులు సుమారు 3.8 లక్షల జవాబు పత్రాల పునఃసమీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారని బోర్డు వెల్లడించింది.

అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో కొంతమంది విద్యార్థులకు ‘రోల్ నంబర్ నాట్ ఫౌండ్' అని రావడంపై సీబీఎస్‌ఈ స్పష్టత ఇచ్చింది. మొదటి దశ స్కాన్డ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకోని వారికి మాత్రమే అలా చూపిస్తుందని బోర్డు స్పష్టం చేసింది. సైబర్ దాడులను అడ్డుకుంటూ సాంకేతిక బృందాలు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని.. విద్యార్థులు ఎలాంటి అవాస్తవాలను నమ్మకుండా కేవలం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఫాలో అవ్వాలని సూచించింది.
Go Back to Shorts
CBSE
CBSE Re-evaluation 2024
Coempt Edutek Private Limited
CBSE 12th Board Exams
IIT Kanpur
CBSE Answer Sheet Verification

More Telugu News