దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి: పేర్ని నాని సవాల్
- బియ్యం దొంగతనం చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారన్న పేర్ని నాని
- దమ్ముంటే విచారణ జరిపి జైల్లో పెట్టాలని సవాల్
- డీఎస్సీలో చేసిన పాపాలు చంద్రబాబును, మంత్రులను వదిలిపెట్టవని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, మంత్రులు అనిత, కొల్లు రవీంద్రలను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అవగాహన సదస్సులో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వానికి ఒక సవాల్ విసిరారు.
"నేను బియ్యం దొంగతనం చేశానని నాపై ఆరోపణలు చేస్తున్నారు. మీకు నిజంగా ధైర్యముంటే, నాపై విచారణ జరిపించి నన్ను జైల్లో పెట్టండి. 2029 నాటికి చంద్రబాబు ప్రభుత్వం కచ్చితంగా పడిపోతుంది. అంతవరకు మీకు చేతనైతే, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి" అంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పేర్ని నాని ఆరోపించారు. ప్రభుత్వం మొదట క్రీడా కోటాను 3 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చిందని, ఆ తర్వాత 382 మంది ఎంపికయ్యారని చెప్పిందని.. కానీ ఇటీవలే ఆటల సంఖ్యను 29 నుంచి ఏకంగా 67 కి పెంచి, అందులో ‘బ్రిడ్జ్’ (పేకాట) ను కూడా చేర్చారని విమర్శించారు.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను గత 9 నెలలుగా ఎందుకు బహిరంగపరచడం లేదు? ఐఏఎస్ అధికారి సంతకం కూడా లేకుండా ఆ లిస్ట్‌ను ఎలా విడుదల చేశారు? ఇప్పుడు కార్డు గేమ్స్ (పేకాట) ఆడేవారిని ఎంపిక చేయలేదని ప్రభుత్వం ఎందుకు మాట మారుస్తోంది? అని ప్రశ్నించారు.
డీఎస్సీ నియామకాల్లో జరిగిన భారీ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడానికి హోంమంత్రి అనితను ఒక కవచంలా వాడుకుంటోందని పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అరాచకాలపై నోరు మెదపని ప్రభుత్వం.. ప్రతిపక్షాలు డీఎస్సీ స్కామ్‌ను లేవనెత్తినప్పుడు మాత్రం హైపర్యాక్టివ్గా మారుతోందని ధ్వజమెత్తారు. డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన ‘పాపాలు’ చంద్రబాబును, ఆయన మంత్రులను వదిలిపెట్టవని పేర్ని నాని హెచ్చరించారు.