తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అనేక చోట్ల ఈడీ దాడులు

ED Conducts Searches at 15 Locations in Multi State Operation Linked to Tirumala Tirupati Devasthanams Ghee Adulteration Case
  • టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
  •  దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 15 చోట్ల ఏకకాలంలో సోదాలు
  •  తనిఖీల్లో రూ. 60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు
  •  ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు
  •  హవాలా, అక్రమాస్తులపై దృష్టి సారించిన ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో కలకలం రేపిన కల్తీ నెయ్యి కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై బుధవారం దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూ.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
 
 మహారాష్ట్ర (అహిల్యనగర్, ముంబై), రాజస్థాన్ (బికనీర్), ఉత్తరాఖండ్ (డెహ్రాడూన్, రూర్కీ), తమిళనాడు (దిండిగల్), ఆంధ్రప్రదేశ్ (గుంటూరు), ఢిల్లీలలో ఈడీ బృందాలు సోదాలు జరిపాయి. ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ మరికొందరిపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. నిందితులు కొందరు టీటీడీ అధికారులతో కుమ్మక్కై, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి నాణ్యత లేని, కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల టీటీడీకి తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు గుర్తించారు.
 
 గతంలో ఈ కేసుపై సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపింది. టెండర్లు, సరఫరాలలో అవకతవకలు జరిగినట్లు అప్పట్లో తేలింది. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి హవాలా లావాదేవీలు, అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేయడం వంటి అంశాలపై దృష్టి సారించింది. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.
Go Back to Shorts
TTD
ED
Tirumala Tirupati Devasthanams
Ghee Adulteration Case

More Telugu News