ఆలయాల బంగారంపై ప్రభుత్వ గురి?.. కేంద్రం వివరణ!
- ఆలయాల బంగారాన్ని నగదుగా మార్చే ప్రణాళికలు లేవన్న కేంద్రం
- గోల్డ్ బాండ్లు జారీ చేస్తారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని వెల్లడి
- ఆలయ గోపురాల బంగారు పూతలను దేశ నిల్వలుగా మారుస్తారనే ప్రచారాన్నీ కొట్టిపారేసిన ప్రభుత్వం
- సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి
- ప్రభుత్వ నిర్ణయాలు కేవలం అధికారిక ఛానళ్ల ద్వారానే ప్రకటిస్తామని స్పష్టీకరణ
దేశంలోని వివిధ దేవాలయాలు, మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చుకునే (మానిటైజేషన్) యోచనలో ప్రభుత్వం ఉందంటూ సాగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇవన్నీ అబద్ధపు ప్రచారాలని, అలాంటి ప్రతిపాదనేమీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది.
ఆలయాల బంగారు నిల్వలను తీసుకుని వాటికి బదులుగా గోల్డ్ బాండ్లు జారీ చేయడానికి కేంద్రం సిద్ధమవుతోందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా సహా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. ‘‘దేవాలయాల ట్రస్టులు, మతపరమైన సంస్థల బంగారాన్ని మానిటైజ్ చేసే పథకాన్ని తీసుకురాబోతున్నామనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి’’ అని కొట్టిపారేసింది.
అలాగే ఆలయ గోపురాలు, తలుపులు, ఇతర నిర్మాణాలపై ఉండే బంగారు పూతలను భారత ‘వ్యూహాత్మక బంగారు నిల్వలు’గా పరిగణించబోతున్నారనే ప్రచారాన్నీ ప్రభుత్వం ఖండించింది. అధికారిక వెబ్సైట్లు, ప్రకటనల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని.. ఎలాంటి ఆధారాల్లేని ఇలాంటి వదంతులతో ప్రజల్లో గందరగోళం సృష్టించొద్దని పౌరులను కోరింది.