నీట్ పేపర్ లీక్... ఒకరి నుంచి ఒకరికి ఇలా పాకిపోయింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీట్ పేపర్ లీక్... ఒకరి నుంచి ఒకరికి ఇలా పాకిపోయింది!

NEET UG 2024 Exam Cancelled After WhatsApp Leak Allegations
  • రాజస్థాన్‌లో పేపర్ లీక్ వార్తల దుమారం
  • లీకేజీ ఆరోపణలతో విచారణ కోసం కేసు సీబీఐకి అప్పగింత
  • డెహ్రాడూన్ నుంచి లీకై వాట్సాప్‌లో ఫార్వార్డ్ అయిన పేపర్
జాతీయ వైద్య విద్య అర్హత ప్రవేశ పరీక్ష(నీట్-యూజీ) 2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్థాన్‌లో లీకైనట్లు వచ్చిన వార్తలు దుమారం రేపుతున్నాయి. ఈ ప్రశ్నాపత్రం పలుమార్లు వాట్సాప్‌లో ఫార్వార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ప్రశ్నాపత్రం ఒకచోట లీక్ అయినప్పటికీ, పలువురికి ఇది చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మే 3వ తేదీన జరిగిన నీట్ (యూజీ) పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. ఇటీవలే జరిగిన ఈ పరీక్షకు 22 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు.

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో, దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఐ విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని, విచారణ సంస్థకు కావాల్సిన అన్ని వివరాలను అందజేస్తామని ఎన్టీఏ తెలిపింది. ఇప్పటికి ఈ ఆరోపణలపై రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ)  దర్యాప్తు జరుపుతోంది.

లీకైన పేపర్.. ఒకరి నుంచి ఒకరికి ఇలా...!

డెహ్రాడూన్‌లో ఉంటున్న సికార్ వాసి రాకేశ్ మందవారియా నుంచి ఈ పేపర్ బయటకు వచ్చింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, అక్కడి నుంచి కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థికి చేరింది. ఈ ఎంబీబీఎస్ విద్యార్థి రాజస్థాన్‌లోని చురు ప్రాంతానికి చెందినవాడు. కేరళలో చదువుతున్న ఈ రాజస్థాన్ విద్యార్థి దీనిని సికార్ ప్రాంతానికి చెందిన తన స్నేహితులతో మే 1వ తేదీన పంచుకున్నాడు. నీట్ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలతో లీకైనట్లుగా భావిస్తున్న ప్రశ్నలు పోలి ఉండటం అనుమానాలకు తావిస్తోంది.

అక్కడి నుంచి ఇది ఒక పేయింగ్ గెస్ట్ వసతి గృహం యజమాని వద్దకు చేరింది. అతడు కూడా దానిని మరికొందరు విద్యార్థులతో పంచుకున్నాడు. వీరంతా ఇతర విద్యార్థులు, కెరీర్ కౌన్సిలర్లతో పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పేపర్ అలా ఒకరి వద్ద నుంచి మరొకరి వద్దకు వాట్సాప్ ద్వారా వ్యాపించింది. ఈ పేపర్‌ను కొంతమంది ప్రింట్ తీసుకుని ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రింట్ తీసుకుని ఉంటే అలాంటి వారిని గుర్తించడం కష్టమే అవుతుంది.

ఈ పేపర్ లీకేజీ గురించి పేయింగ్ గెస్ట్ వసతి గృహం యజమాని ఫిర్యాదు చేశాడు. అయితే పేపర్ లీక్ గురించి అందరికీ తెలియడంతో దాని నుంచి తాను తప్పించుకోవడానికి ఫిర్యాదు చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పేపర్ లీక్‌కు సంబంధించి పూర్తి ఆధారాలు, అలాగే ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలు వెల్లడి కావాల్సి ఉందని జైపూర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఎస్ఓజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విశాల్ బన్సల్ మీడియాతో మాట్లాడుతూ, ఆ పేపర్‌లో 400కు పైగా ప్రశ్నలు ఉన్నాయని, వాటిలో సుమారు 120 ప్రశ్నలు నీట్ పరీక్షలో వచ్చినట్లు చెప్పారు. లీకైనట్లుగా భావిస్తున్న పేపర్ నీట్ పరీక్షకు కొన్ని వారాల ముందే విద్యార్థుల వద్ద ఉందని అన్నారు.

ఈ ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి లీకైందనే విషయం వెల్లడి కాలేదని తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల మొబైల్ ఫోన్‌లలోని వాట్సాప్‌లో కనిపించినట్లు చెప్పారు. ఈ పేపర్ లీకేజీ ఆరోపణలకు సంబంధించి ఇప్పటి వరకు 20 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో విద్యార్థులు, కెరీర్ కౌన్సిలర్లు ఉన్నట్లు తెలిపారు.

విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకు మరోసారి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. కొత్త పరీక్ష కోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామని తెలిపింది.
Advertisement
NEET UG 2024
NEET exam paper leak
National Testing Agency
NTA
Rajasthan Police SOG
NEET

More Telugu News