ఒక రోజు సీఎంగా.. మరో రోజు ఎమ్మెల్యేగా.. ఆసక్తిగా మారిన విజయ్ ప్రమాణ స్వీకారం

Vijay Joseph Sworn in as MLA After CM Oath Creates Interest
  • తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఎమ్మెల్యేగా విజయ్ ప్రమాణ స్వీకారం
  • సీఎంగా 'దేవుడిపై ప్రమాణం'.. ఎమ్మెల్యేగా 'మనస్సాక్షిగా ధ్రువీకరిస్తున్నాను' అంటూ ప్రమాణం
  • పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా 
  • తొలిసారి అసెంబ్లీకి హాజరైన టీవీకే సభ్యులు.. కొత్త ప్రభుత్వానికి ప్రొటెం స్పీకర్ సూచనలు
  • ప్రజాసేవకే ప్రాధాన్యత ఇవ్వాలని కొత్త ఎమ్మెల్యేలకు పిలుపు
తమిళనాడు ముఖ్యమంత్రిగా నిన్న‌ ప్రమాణ స్వీకారం చేసిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్, నేడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కొత్తగా ఏర్పాటైన 17వ తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ కరుప్పియా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులందరితో ప్రమాణం చేయించారు.

సీఎం విజయ్ తన ప్రమాణ స్వీకారంలో రెండు విభిన్న పద్ధతులు పాటించడం చర్చనీయాంశమైంది. సీఎంగా ప్రమాణం చేసేటప్పుడు "ఆండవన్ మీదు ఆనైయగ" (దేవుడిపై ప్రమాణంగా) అని చెప్పిన ఆయన, సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేటప్పుడు మాత్రం "ఉలమార ఉరుది కూరుగిరేన్" (మనస్సాక్షిగా ధ్రువీకరిస్తున్నాను) అని రాజ్యాంగబద్ధంగా ప్ర‌మాణం చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. ఆయన పెరంబూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని, తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. విజయ్ ప్రమాణం చేసిన వెంటనే, టీవీకే సీనియర్ నేత ఎన్. ఆనంద్ (టి. నగర్), ఆధవ్ అర్జున (విల్లివాక్కం) కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. తొలిసారి అధికారంలోకి రావడంతో టీవీకే సభ్యులు ఎంతో ఉత్సాహంగా సభలో అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ కరుప్పియా మాట్లాడుతూ కొత్త సభ్యులకు అభినందనలు తెలిపారు. అనేక సవాళ్లను అధిగమించి కొత్త నాయకత్వం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని ప్రశంసించారు. "ప్రజలు మనల్ని సేవ చేయడానికి ఎన్నుకున్నారు. ఈ బాధ్యతను ప్రతి సభ్యుడు గుర్తించి చిత్తశుద్ధితో పనిచేయాలి" అని ఆయన పిలుపునిచ్చారు. పెరియార్, కామరాజర్, వేలు నాచియార్, అంజలై అమ్మాళ్ వంటి గొప్ప నేతల ఆశయాలను, హేతువాద, సామాజిక న్యాయ సూత్రాలను పాటిస్తూ కొత్త ప్రభుత్వం పనిచేయాలని ఆయన సూచించారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించి మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
CM Vijay
Vijay Joseph
Tamil Nadu
TVK
Tamilaga Vettri Kazhagam
Assembly Elections
Perambur
Tiruchi East
Karuppiah
Tamil Nadu Politics

More Telugu News