యజువేంద్ర చాహల్ వేపింగ్ వివాదం: అసలేం జరిగింది?

Yuzvendra Chahal Accused of Vaping on Flight
  • విమానంలో వేపింగ్ చేసినట్టు చాహల్ పై ఆరోపణలు
  • అర్ష్‌దీప్ షూట్ చేసిన వీడియోలో నోటి దగ్గర ఏదో పెట్టుకున్నట్టు కనిపించిన వైనం
  • వీడియో వివాదాస్పదం కావడంతో ఎడిట్ చేసి కొత్త వీడియో అప్‌లోడ్ చేసిన అర్ష్‌దీప్ 

టీమిండియా ఆటగాడు, ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్, విమాన ప్రయాణంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ-సిగరెట్ (Vaping) తాగారనే ఆరోపణలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.


వివరాల్లోకి వెళితే... పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన యూట్యూబ్ ఛానల్ కోసం 'ట్రావెల్ వ్లాగ్' షూట్ చేశాడు. మే 6న అహ్మదాబాద్ నుండి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న సమయంలో తీసిన ఈ వీడియోలో, బ్యాక్‌గ్రౌండ్‌లో కిటికీ పక్క సీటులో కూర్చున్న చాహల్, తన నోటి దగ్గర ఏదో పరికరాన్ని పెట్టుకుని పక్కన ఉన్న శశాంక్ సింగ్‌తో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఆ సమయంలో చిన్నపాటి పొగ లాంటిది రావడం, చాహల్ వెంటనే దగ్గడం నెటిజన్ల కంట పడింది.


ఈ దృశ్యాలు వైరల్ కావడంతో, అర్ష్‌దీప్ సింగ్ తన ఒరిజినల్ వీడియోను డిలీట్ చేసి, వివాదాస్పదంగా ఉన్న ఆ 56 సెకన్ల క్లిపింగ్‌ను తొలగించి ఎడిట్ చేసిన కొత్త వీడియోను అప్‌లోడ్ చేశాడు. అయితే, అప్పటికే నెటిజన్లు ఆ పాత క్లిప్‌ను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం ముదిరింది.

చాహల్ నిజంగానే వేపింగ్ చేశాడని, అందుకే వీడియోను ఎడిట్ చేశారని కొందరు విమర్శిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ దొరికిపోయిన ఘటనపై చాహల్ కేవలం 'ప్రాంక్' (సరదాగా వెక్కిరించడం) చేశాడని, అది నిజమైన వేప్ కాదని, కేవలం స్ప్రే బాటిల్ అని మరికొందరు సమర్థిస్తున్నారు.

మరోవైపు, విమానాల్లో వేపింగ్ లేదా ధూమపానం చేయడం తీవ్రమైన నేరం. నిర్ధారణ అయితే ప్రయాణికుడిని 30 రోజుల పాటు 'నో-ఫ్లై' లిస్టులో పెట్టే అవకాశం ఉంటుంది. గత నెలలోనే రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ వేపింగ్ ఘటనలో దొరికినందుకు 25 శాతం మ్యాచ్ ఫీజు కోత మరియు డీమెరిట్ పాయింట్లు విధించింది. ఒకవేళ చాహల్ దోషిగా తేలితే, బీసీసీఐ నుంచి అంతకంటే కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉండే అవకాశం ఉంది.
Advertisement
Yuzvendra Chahal
Chahal vaping controversy
Arshdeep Singh
Punjab Kings
IPL
vaping in flight
Riyan Parag
BCCI
cricket
no-fly list

More Telugu News