ఢిల్లీలో 30 ఏళ్ల జడ్జి అనుమానాస్పద మృతి

Aman Kumar Sharma 30 Year Old Delhi Judge Dies in Suspicious Circumstances
  • తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణం
  • కుటుంబ కలహాలే కారణమని బంధువుల ఆరోపణ
  • కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు
  • మృతుడి భార్య కూడా న్యాయమూర్తిగా విధులు
ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు చెందిన 30 ఏళ్ల యువ న్యాయాధికారి అమన్ కుమార్ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దక్షిణ ఢిల్లీలోని గ్రీన్ పార్క్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో శనివారం ఆయన ఉరి వేసుకుని కనిపించారు. ఇది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

శనివారం మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో అమన్ బావమరిది శివమ్, పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాత్రూం తలుపులు పగలగొట్టి చూడగా, అమన్ కుమార్ శర్మ ఉరి వేసుకుని కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కుటుంబ కలహాల కారణంగానే అమన్ తీవ్ర మనోవేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆయన తండ్రి, ఇతర బంధువులు పోలీసుల వద్ద ఆరోపించినట్లు సమాచారం. అయితే, సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

అమన్ కుమార్ శర్మ 2021లో ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్‌లో చేరారు. ప్రస్తుతం కర్కర్దూమా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య కూడా జడ్జి కావడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఓ సీనియర్ పోలీస్ అధికారి వివరించారు.
Go Back to Shorts
Aman Kumar Sharma
Delhi
Judge
Judicial Services
Suicide
Death
Crime
Karkardooma Court
DLSA
District Legal Services Authority

More Telugu News