ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కళ్లెం.. 80కిలోమీటర్లు దాటితే అడ్డంగా దొరికిపోతారు!

AP Private Travels Bus 80 KM Speed Limit Tracking
  • ఏపీలో ప్రైవేట్ బస్సుల ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్
  • ట్రావెల్స్ బస్సులకు గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి
  • జీపీఎస్ ద్వారా బస్సుల వేగాన్ని పర్యవేక్షిస్తున్న రవాణా శాఖ
  • నిబంధనలు అతిక్ర‌మించి అతివేగంగా వెళ్తే బస్సులను సీజ్ చేస్తున్న అధికారులు
  • అధికారుల చర్యలతో ట్రాక్‌లోకి వస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలు
ఏపీలో ఇటీవల జరిగిన వరుస ప్రైవేట్ బస్సు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల అతివేగానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా, జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఇకపై ఏ ట్రావెల్స్ బస్సు అయినా గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని మించి ప్రయాణించడానికి వీల్లేకుండా నిబంధనలను కఠినతరం చేశారు.

రాష్ట్రంలో ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ (ఏఐటీపీ) కింద సుమారు 1800 బస్సులు రిజిస్టర్ కాగా, ఇప్పటివరకు 1,660 బస్సులకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అనుసంధానం చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా ఏ బస్సు ఎక్కడ, ఎంత వేగంతో ప్రయాణిస్తుందో అధికారులు తమ కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా బస్సు 80 కిలోమీటర్ల వేగ పరిమితిని ఉల్లంఘించినట్లు జీపీఎస్ ద్వారా నిర్ధారణ అయితే, అధికారులు తక్షణమే ఆ బస్సును సీజ్ చేస్తున్నారు. అనంతరం ఆ బస్సును ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌కు (ఏటీఎస్‌) తరలించి, దాని స్పీడ్ లిమిట్ పరికరం పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనలు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.

ఈ పర్యవేక్షణ కేవలం ఏపీ సరిహద్దులకే పరిమితం కాలేదు. ఉదాహరణకు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సు తెలంగాణలో ప్రయాణిస్తున్నప్పటికీ, దాని వేగాన్ని ఏపీ రవాణా శాఖ అధికారులు ట్రాక్ చేస్తారు. గతంలో మోటారు వాహన చట్టం ప్రకారం బస్సుల్లో స్పీడ్ లిమిట్ పరికరాలు ఉన్నప్పటికీ, చాలా ట్రావెల్స్ యాజమాన్యాలు వాటిని పనిచేయకుండా చేసి అతివేగంతో బస్సులను నడిపేవారు. ఈ సమస్యను అధిగమించడానికే ప్రభుత్వం జీపీఎస్ ట్రాకింగ్‌ను తప్పనిసరి చేసింది.

రవాణా శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం బస్సుల కదలికలను గమనిస్తున్నారు. అధికారుల కఠిన వైఖరి, బస్సులను సీజ్ చేస్తుండటంతో ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలు పాటించడం మొదలుపెట్టాయి. దీంతో చాలా బస్సులు పరిమిత వేగంతోనే నడుస్తుండటంతో, రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యమవుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
AP Private Travels Bus
Speed Limit Tracking
Transport Department
Andhra Pradesh
APSRTC

More Telugu News