పదవి వచ్చిందనే అహంకారం వద్దు: నారా లోకేష్
- మంగళగిరిలో టీడీపీ నూతన కార్యవర్గానికి శిక్షణ తరగతులు
- నాయకుల పనితీరుపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష ఉంటుందని లోకేష్ స్పష్టీకరణ
- అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మిమ్మల్ని నాయకత్వం ఎలా గుర్తించిందో, మీరు కూడా నాయకత్వాన్ని అలాగే గుర్తించాలి. నిన్నటి వరకు వేరు, ఈ రోజు నుంచి వేరు. మీరు చేసే ప్రతి పని పార్టీకి వర్తిస్తుంది. మీరు మంచి చేస్తే పార్టీకి మంచి జరుగుతుంది" అని దిశానిర్దేశం చేశారు.
నియోజకవర్గాల్లో నాయకులు అందరితో కలిసి పనిచేయాలని లోకేష్ సూచించారు. పార్టీ నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలని కోరారు. అంతకుముందు, కొత్తగా నియమితులైన సభ్యుల కోసం నిర్వహించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతులను ఆయన ఆసక్తిగా విన్నారు. బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

