తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

Mohan Commits Suicide with Children After Killing Wife Mother in Tirupati
  • తిరుపతి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
  • తల్లిని, భార్యను హత్య చేసిన వ్యక్తి
  • ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
తిరుపతి జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన తల్లిని, భార్యను హత్య చేసి, ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నిన్న వెంకటకృష్ణపాలెంలో వెలుగుచూసింది.
 
 పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ అనే వ్యక్తి నిన్న తెల్లవారుజామున తన కన్నతల్లి చంద్రకళ (65), భార్య హరిత (33) ను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం తన ఇద్దరు చిన్నారులు కౌశిక్ (14), హరిణి (12) తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. సమీపంలోని వేపకుంట రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని, పిల్లలతో సహా వేగంగా వస్తున్న రైలు కింద దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 
 రైల్వే ట్రాక్‌పై ఛిద్రమైన మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులను మోహన్, అతని పిల్లలుగా గుర్తించారు. మరోవైపు, ఇంటి వద్ద మోహన్ తల్లి, భార్య విగతజీవులుగా పడి ఉండటంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రెండు ఘటనా స్థలాలను పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి దారితీసిన కారణాలపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Mohan
Tirupati district
family suicide
Venkata Krishnapalem
Andhra Pradesh
family dispute
murder suicide
railway track
children
crime news

More Telugu News