సన్‌రైజర్స్‌కు భారీ ఊరట.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ‌చ్చేస్తున్నాడు!

Pat Cummins Returns to Sunrisers Hyderabad After Injury
  • వెన్నుగాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించిన‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 
  • ఈ నెల‌ 25న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం 
  • కమిన్స్ లేక‌పోవ‌డంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్‌ జట్టు
ఐపీఎల్ 2026 సీజన్‌లో మిశ్రమ ఫలితాలతో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) జట్టుకు భారీ శుభవార్త అందింది. జట్టు నియమిత కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు. రెండు రోజుల్లో అతను తిరిగి జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల‌ 25న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్ ద్వారా కమిన్స్ మైదానంలోకి తిరిగి అడుగుపెట్టే అవకాశం ఉంది.

సీజన్ ప్రారంభానికి ముందే భారత్‌కు చేరుకున్న కమిన్స్, వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ నెల‌ 2న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు ప్రత్యేక స్కానింగ్ కోసం ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో కథనం ప్రకారం సిడ్నీలో నిర్వహించిన స్కానింగ్‌లో గాయం పూర్తిగా నయమైనట్లు నిర్ధారణ అయింది. దీంతో అతను తిరిగి భారత్‌కు బయల్దేరుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా సూచన ఇచ్చాడు. కమిన్స్ రాకతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంతో పాటు కెప్టెన్సీ కూడా మరింత బలోపేతం కానుంది.

ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత కమిన్స్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు కూడా అతను దూరమయ్యాడు. ఇక‌, కమిన్స్ జ‌ట్టుకు దూరం కావ‌డంతో ఇషాన్ కిషన్ జట్టుకు సారథ్యం వహించాడు. అతని నాయకత్వంలో ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండింటిలో గెలిచింది.

సోమవారం జరిగిన మ్యాచ్‌లో అరంగేట్ర బౌలర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగడంతో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శనివారం తమ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.
Go Back to Shorts
Pat Cummins
Sunrisers Hyderabad
IPL 2026
Rajasthan Royals
Cricket
Injury Update
Captain
SRH
Pat Cummins comeback
Ishan Kishan

More Telugu News