కుటుంబంలో ఇబ్బంది పెట్టే బంధువులతో వేగలేకపోతున్నారా?.. గౌరాంగ దాస్ చెప్పిన 3 చిట్కాలు మీకోసమే!

Gauranga Das shares 3 ways to deal with toxic family members
  • బంధువుల వేధింపులతో మనశ్శాంతి కోల్పోవద్ద‌న్న గౌరాంగ దాస్‌
  • "నీవల్ల ఏమీ కాదు" అన్నప్పుడు వాదనకు దిగవద్దని సూచ‌న‌
  • ఉచిత సలహాలిచ్చేవారిని సహాయం అడిగి చూడాల‌న్న ఆధ్యాత్మిక గురువు 
  • అవమానాన్ని మౌనంగా భరించకుండా మర్యాదగా ప్రశ్నించాలని సూచ‌న‌
సమాజంలో మన చుట్టుపక్కలే కాదు.. ప్రతి కుటుంబంలోనూ మనల్ని మాటలతో ఇబ్బంది పెడుతూ విషం కక్కే బంధువులు (టాక్సిక్ ఫేమిలీ మెంబర్స్) లేదా సభ్యులు ఎవరో ఒకరు ఉంటారు. వారి ప్రవర్తన వల్ల మన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అయితే, అలాంటి వారితో ఎలా వ్యవహరించాలనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గౌరాంగ దాస్ చెబుతున్నారు. కుటుంబ సభ్యుల విషపూరిత ప్రవర్తనకు మనశ్శాంతిని బలిపెట్టవద్దని ఆయన సూచిస్తున్నారు.

"బంధాలను నిలబెట్టుకోవడం కోసం వాదించాల్సిన, నిరూపించుకోవాల్సిన లేదా అవమానాన్ని భరించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్రశాంతంగా అంగీకరించడం, తెలివైన సమాధానాలు ఇవ్వడం లేదా మర్యాదగా వారిని నిలదీయడం మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది. కుటుంబంతో హద్దులు గీసుకోవడం అహంకారం కాదు, అది భావోద్వేగ బలం, ఆత్మరక్షణ" అని గౌరాంగ దాస్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన సూచించిన 3 ముఖ్యమైన మార్గాలను ఇప్పుడు చూద్దాం.

1. "నీ వల్ల ఏమీ కాదు" అన్నప్పుడు
మిమ్మల్ని ఎవరైనా "నీ వల్ల ఏమీ కాదు," "నువ్వు దేనికీ పనికిరావు" అని నిరుత్సాహపరిచినప్పుడు, వారితో వాదనకు దిగవద్దు, ఎలాంటి వివరణ ఇవ్వొద్దు. కేవలం ప్రశాంతంగా నవ్వి, "మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం" అని చెప్పండి. మనం వారితో ఏకీభవించినప్పుడు, ఇక వాదనకు ఆస్కారం ఉండదు. దీంతో వారే మౌనంగా ఉండిపోతారని గౌరాంగ దాస్ వివరించారు.

2. ఉచిత సలహాలు ఇస్తే.. సహాయం అడగండి
"చూడు, ఫలానా వాళ్ల అబ్బాయి ఎంత మంచి ఉద్యోగం సంపాదించాడో, నువ్వేంటి ఇలా ఉన్నావు?" అని ఇతరులతో పోలుస్తూ ఉచిత సలహాలు ఇచ్చేవారు ఎదురైనప్పుడు, "అవునా, అయితే వారి అబ్బాయిలాగే నాకూ ఓ మంచి ఉద్యోగం ఇప్పించడంలో సహాయం చేయండి" అని మర్యాదగా అడగండి. సహాయం అడిగిన మరుక్షణమే వారు అక్కడి నుంచి జారుకుంటారు. ఆ తర్వాత మీ జోలికి రావడానికి కూడా ఆలోచిస్తారని ఆయన తెలిపారు.

3. బలహీనంగా ప్రవర్తించవద్దు.. నిలదీయండి
మిమ్మల్ని కించపరిచినా లేదా మీ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకున్నా బలహీనంగా ఉండవద్దు. వారిని మర్యాదపూర్వకంగా ప్రశ్నించండి. "మామయ్యా, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు?" లేదా "అత్తయ్యా, దయచేసి ఈ స్వరంతో నాతో మాట్లాడొద్దు" అని స్పష్టంగా, ప్రశాంతంగా చెప్పండి. ఇలా నిలదీయడం వల్ల వారు కాస్త భయపడతారు, తమ మాటల విషయంలో జాగ్రత్త వహిస్తారు.

కుటుంబ సభ్యులని చెప్పి విషపూరిత ప్రవర్తనను భరించాల్సిన అవసరం లేదని, మీ మానసిక ప్రశాంతత మీ చేతుల్లోనే ఉంటుందని గౌరాంగ దాస్ పేర్కొన్నారు. ఆత్మగౌరవం విషయంలో రాజీ పడకూడదని, అవసరమైతే హద్దులు గీసుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు.
Go Back to Shorts
Gauranga Das
family relationships
toxic relatives
mental peace
self-respect
communication skills
spiritual guru
conflict resolution
emotional strength
setting boundaries

More Telugu News